
మలేరియా ‘ఆర్టీఎస్, ఎస్’ వ్యాక్సిన్ కూడా
అభివృద్ధి, ఉత్పత్తికి టీడీబీతో సాపిజెన్ ఒప్పందం
రూ.400 కోట్ల పెట్టుబడులు , భువనేశ్వర్‌లో యూనిట్
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): భారత్ బయోటెక్ అధిపతి కృష్ణ ఎల్లాకు చెందిన సాపిజెన్ బయోలాజిక్స్ కొవిడ్-19 కోసం ఇంట్రానేజల్, మలేరియాకు ‘ఆర్టీఎస్, ఎస్’ వ్యాక్సిన్లను అభివృద్ధి చేసి వాణిజ్యపరంగా అందుబాటులోకి తీసుకురానుంది. కేంద్ర సైన్స్, టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన టెక్నాలజీ డెవల్‌పమెంట్ బోర్డు (టీడీబీ)తో కలిసి ఈ రెండు వినూత్న వ్యాక్సిన్లను అభివృద్ధి చేసి, అందుబాటులోకి తీసుకురానున్నట్లు సాపిజెన్ తెలిపింది. ఈ మేరకు సాపిజెన్ బయోలాజిక్స్, టీడీబీ మధ్య ఒప్పందం కుదిరింది. కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ సమక్షంలో ఒప్పందం పత్రాలు మార్చుకున్నారు. ఈ ప్రాజెక్టులో రెండింటికీ సమాన వాటా, భాగస్వామ్యం ఉంటుంది.
రెండు వ్యాక్సిన్లను అభివృద్ధి చేసి, వాణిజ్యపరంగా అందుబాటులోకి తీసుకురావడానికి భారత్ బయోటెక్, టెక్నాలజీ డెవల్‌పమెంట్ బోర్డు రూ.200 కోట్ల చొప్పున మొత్తం రూ.400 కోట్ల పెట్టుబడులు పెడతాయి. ఒప్పందంలో భాగంగా భారత్ బయోటెక్ ఒడిసాలోని భువనేశ్వర్‌లో సీజీఎంపీ ప్రమాణాలతో అత్యాధునిక వ్యాక్సిన్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తుంది. ముందుగా ఈ యూనిట్లో ఇంట్రానేజల్ కొవిడ్ వ్యాక్సిన్ (ముక్కు ద్వారా తీసుకునే వ్యాక్సిన్), మలేరియా వ్యాక్సిన్‌ను తయారు చేస్తారు. ఆ తర్వాత ఇతర వ్యాక్సిన్లను కూడా ఇక్కడ తయారు చేస్తారని సాపిజెన్ బయోలాజిక్స్ పేర్కొంది. 2023 ఏప్రిల్ నాటికి ఏడాదికి 10 కోట్ల ఇంట్రానేజల్ వ్యాక్సిన్ డోసులను, 2025 ఏప్రిల్ నాటికి ఏడాదికి 1.5 కోట్ల డోసుల ఆర్టీఎస్, ఎస్ వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ రెండు కొత్త వ్యాక్సిన్లు. మొదటిసారి వాణిజ్యపరంగా ఉత్పత్తి చేయనున్నారు.
కొత్త మైలురాయి: ఈ ఒప్పందం ద్వారా ఇద్దరు భాగస్వాములు సమాన వాటా, భాగస్వామ్యమే కాకుండా సమాన సామాజిక బాధ్యతను కూడా కలిగి ఉంటారని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. వ్యాక్సిన్ల తయారీ వ్యూహంలో సమాన వాటా, భాగస్వామ్యం ఒక కొత్త మైలురాయని.. ఇది దేశీయంగా పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలు ఊపందుకునేలా చేస్తుందని తెలిపారు. కొవిడ్ వచ్చిన కొద్ది కాలంలోనే దేశీయంగా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయగలిగామని, కొవిడ్ వ్యాక్సిన్ల తయారీకి భారత్ కేంద్రంగా మారిందని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీబీ సెక్రటరీ, రాజేశ్ కుమార్ పాథక్, కృష్ణ ఎల్లా తదితరులు పాల్గొన్నారు.