కరోనా వ్యాక్సిన్లతో పిల్లలకు ఇబ్బందేమీ లేదు

ABN , First Publish Date - 2022-03-16T08:10:22+05:30 IST

కరోనా వ్యాక్సిన్లు వేయడం కారణంగా పిల్లలకు ఎలాంటి ఇబ్బందులూ కలగలేదని కేంద్ర ప్రభుత్వం మంగళవారం ..

కరోనా వ్యాక్సిన్లతో పిల్లలకు ఇబ్బందేమీ లేదు


 సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం

న్యూఢిల్లీ, మార్చి 15: కరోనా వ్యాక్సిన్లు వేయడం కారణంగా పిల్లలకు ఎలాంటి  ఇబ్బందులూ కలగలేదని  కేంద్ర ప్రభుత్వం మంగళవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఇంతవరకు 15-18 ఏళ్ల మధ్య ఉన్న పిల్లలకు 8.91 కోట్ల కొవాగ్జిన్‌ డోసులు ఇచ్చినట్టు పేర్కొంది. వ్యాక్సిన్ల క్లినికల్‌ పరీక్షల సమాచారం ఇచ్చేలా ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యంపై విచారణ జరుపుతున్న జస్టిస్‌ ఎల్‌.నాగేశ్వరరావు, జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌లతో కూడిన ధర్మాసనానికి ఈ వివరాలు ఇచ్చింది. ఈ వ్యాక్సిన్ల కారణంగా 1,739 మంది పిల్లల్లో స్పల్పంగా, 81 మందిలో కొంచం ఎక్కువగా, ఆరుగురిలో తీవ్రమైన దుష్పరిణామాలు కనిపించాయని వివరించింది. శాతాల్లో చూస్తే ఇది చాలా తక్కువని పేర్కొంది. నిపుణుల సలహాల మేరకే ప్రభుత్వం మైనర్లకు కూడా టీకాలు ఇచ్చిందని, ఇది న్యాయ సమక్ష పరిధిలోకి రాదని కేంద్రం తరఫున వాదనలు వినిపించిన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా, అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఐశ్వర్య భాటి  తెలిపారు. దశలవారీగా టీకాలు ఇస్తూ చివరగా పిల్లలకు వేశామని, అందువల్ల ఎక్కడా పెద్దగా ఇబ్బందులు ఎదురుకాలేదని చెప్పారు. కొన్ని అంశాల్లో గోప్యత పాటించాల్సిన దృష్ట్యా క్లినికల్‌ పరీక్షల సమాచారం ఇవ్వడం సాధ్యం కాదని పేర్కొన్నారు.  

Updated Date - 2022-03-16T08:10:22+05:30 IST