కొవిడ్ వేళ మానవత్వం కనుమరుగు.. ఐసీయూ బెడ్లను లక్షల రూపాయలకు అమ్మేస్తున్నారు!

ABN , First Publish Date - 2021-05-10T00:21:00+05:30 IST

కరోనా వైరస్ దేశాన్ని చుట్టేస్తున్న వేళ బాధితులకు కొందరు దయార్థ్ర హృదయులు తమకు తోచిన సాయం అందిస్తుంటే

కొవిడ్ వేళ మానవత్వం కనుమరుగు.. ఐసీయూ బెడ్లను లక్షల రూపాయలకు అమ్మేస్తున్నారు!

జైపూర్: కరోనా వైరస్ దేశాన్ని చుట్టేస్తున్న వేళ బాధితులకు కొందరు దయార్థ్ర హృదయులు తమకు తోచిన సాయం అందిస్తుంటే మరికొందరు బాధితుల నుంచి అందినకాడికి దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు. దేశంలో ఐసీయూ బెడ్లకు విపరీతంగా ఉన్న కొరతను కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి. బెడ్లను అమ్ముకుంటూ సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. జైపూర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రి ఐసీయూ బెడ్‌ను రూ. 1.30 లక్షలకు విక్రయించిన ఓ మేల్ నర్సును అవినీతి నిరోధకశాఖ అధికారులు అరెస్ట్ చేశారు. 


ఈ కేసులో ప్రభుత్వ ఆసుపత్రికి చెందిన ఓ వైద్యుడు, మేల్ నర్స్ ప్రమేయం కూడా ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. అత్యవసర చికిత్స అవసరమయ్యే కొవిడ్ రోగులకు వీరు ఆసుపత్రిలో బెడ్లను విక్రయిస్తున్నట్టు గుర్తించారు. తాజా అరెస్ట్‌తో ఆసుపత్రిలో పడకలు, ఆక్సిజన్ సిలిండర్ల బ్లాక్ మార్కెట్ వ్యవహారం మరోమారు చర్చనీయాంశమైంది.


ప్రభుత్వ ఆధ్వర్యంలోని రాజస్థాన్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఆసుపత్రికి చెందిన ఓ మేల్ నర్స్ తనకు ఓ ప్రైవేటు ఆసుపత్రిలోని ఐసీయూ బెడ్‌ను రూ. 1.30 లక్షలకు విక్రయించినట్టు అశోక్ గుర్జార్ అనే బాధితుడు ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. 


తన భార్య ఐసీయూలో చేరడానికి ముందు లంచం డబ్బులో రూ. 95 వేలను చెల్లించినట్టు చెప్పాడు. బుధవారం చేరిన ఆమె 48 గంటల చికిత్స తర్వాత శుక్రవారం మరణించిందని పేర్కొన్నాడు. అయినప్పటికీ వదలని మేల్ నర్స్ మిగతా రూ.35 వేల కోసం ఫోన్ చేస్తూ ఇబ్బంది పెట్టాడు. దీంతో అశోక్ ఏసీబీని ఆశ్రయించాడు.


నేడు వల పన్నిన ఏసీబీ అధికారులు అశోక్ నుంచి రూ. 23 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలోని వైద్యులు, ఇతర సిబ్బందితో నిందితుడికి ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు.


ప్రభుత్వ ఆసుపత్రిలోని ఐసీయూ వార్డులో పనిచేస్తున్న ఓ వైద్యుడికి కూడా ఈ కేసుతో సంబంధం ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. మొత్తం లంచం సొమ్ములో అతడు రూ.  50 వేలు తీసుకుంటున్నట్టు ఆరోపణలున్నాయని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-05-10T00:21:00+05:30 IST