కొవిడ్ పాజిటివ్ ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు సర్కారు శుభవార్త

ABN , First Publish Date - 2022-01-11T18:21:42+05:30 IST

కొవిడ్ పాజిటివ్ వచ్చిన ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు సీఎం యోగి శుభవార్త వెల్లడించారు...

కొవిడ్ పాజిటివ్ ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు సర్కారు శుభవార్త

7 రోజుల వేతనంతో కూడిన సెలవు మంజూరు

లక్నో: కొవిడ్ పాజిటివ్ వచ్చిన ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు సీఎం యోగి శుభవార్త వెల్లడించారు. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని కొవిడ్-19 పాజిటివ్ ఉద్యోగులకు వేతన కోత లేకుండా 7 రోజుల సెలవులు ఇస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి  యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు.ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో  ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో ఉద్యోగుల హాజరును 50 శాతానికి పరిమితం చేశారు.ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాల్లో కొవిడ్ హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేయాలని యూపీ సీఎం ఆదేశించారు.ప్రైవేట్ కార్యాలయంలోని ఉద్యోగులు ఎవరైనా కరోనా పాజిటివ్‌గా తేలితే, అతనికి లేదా ఆమెకు జీతంతో పాటు ఏడు రోజుల సెలవు ఇవ్వాలని కూడా సీఎం ఆదేశించారు.


కొవిడ్-19 కేసుల సంఖ్య పెరగడంతో, యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో ఉద్యోగుల హాజరును 50 శాతానికి పరిమితం చేస్తున్నట్లు ప్రకటించింది. కార్యాలయాల్లో స్క్రీనింగ్‌ లేకుండా ఎవరికీ ప్రవేశం కల్పించరాదని ఆదిత్యనాథ్‌ కోరారు.కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి ఉద్యోగుల హాజరు 50 శాతం అమలు చేయాలని, ఇంటి నుంచి పని చేసేలా ప్రోత్సహించాలని సీఎం అధికారులను ఆదేశించారని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది.ఆస్పత్రుల్లో ఓపీడీకి ఆన్‌లైన్‌లో అపాయింట్‌మెంట్ ఇవ్వాలని, ప్రత్యేక సందర్భాల్లో రోగులను ఆస్పత్రులకు పిలిపించాలని సీఎం సూచించారు.టెలీ కన్సల్టేషన్‌ను ప్రోత్సహించాలని సీఎం కోరారు.




వచ్చే నెలలో ప్రారంభం కానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కొవిడ్-19కి వ్యతిరేకంగా 100 శాతం వ్యాక్సినేషన్ సాధించేందుకు కృషి చేయాలని యూపీ సీఎం కోరారు.ఎన్నికలకు వెళ్లే జిల్లాల్లో ప్రతి ఒక్కరూ 10 రోజుల ముందుగానే టీకాలు వేయించుకోవాలని, ఇందుకు సంబంధించి తక్షణమే ప్రణాళిక రూపొందించాలన్నారు.ఉత్తరప్రదేశ్‌లో గత 24 గంటల్లో 8,334 తాజా కొవిడ్-19 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ప్రస్తుతం మొత్తం 33,946 యాక్టివ్ కరోనావైరస్ కేసులున్నాయి. ఇందులో 33,563 మంది రోగులు హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు.


Updated Date - 2022-01-11T18:21:42+05:30 IST