అంబులెన్స్‌లో ఎగ్జామ్ సెంటర్‌కు ఆమె.. ఏమైందా అని ఆరా తీయగా..

ABN , First Publish Date - 2020-09-18T01:04:44+05:30 IST

భారత్‌లోకి కరోనా ప్రవేశించిన తొలినాళ్లతో పోల్చుకుంటే ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మారాయి. తొలినాళ్లలో తాము నివసిస్తున్న ప్రాంతంలో..

అంబులెన్స్‌లో ఎగ్జామ్ సెంటర్‌కు ఆమె.. ఏమైందా అని ఆరా తీయగా..

దౌసా: భారత్‌లోకి కరోనా ప్రవేశించిన తొలినాళ్లతో పోల్చుకుంటే ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మారాయి. తొలినాళ్లలో తాము నివసిస్తున్న ప్రాంతంలో ఎవరికైనా కరోనా సోకిందని తెలిస్తే చాలు.. వారి నుంచి తమకెక్కడ వైరస్ సోకుతుందోనన్న భయాందోళనల వల్ల కరోనా సోకిన బాధితులపై కొంత వివక్ష ఉండేది. ఈ పరిస్థితిలో మార్పు వచ్చిందనడానికి రాజస్థాన్‌లో వెలుగుచూసిన ఓ ఘటనే ఉదాహరణ. రాజస్థాన్‌లో సెప్టెంబర్ 16న(బుధవారం) బీఈడీ ఎంట్రన్ టెస్ట్ అయిన పీటెట్ ఎగ్జామ్ నిర్వహించారు.


దౌసా జిల్లాలో మొత్తం 80 పరీక్షా కేంద్రాలను ప్రకటించారు. వీటిల్లో ఒకటైన ఆదర్శ్ విద్యా మందిర్‌లో పరీక్ష రాసేందుకు ఓ అభ్యర్థి అంబులెన్స్‌లో పరీక్షా కేంద్రానికి వచ్చింది. సదరు అభ్యర్థి అంబులెన్స్‌లో రావడంతో ఆ పరీక్షా కేంద్రం వద్ద అప్పటికే వేచి ఉన్న అభ్యర్థులంతా భయాందోళనకు లోనయ్యారు. ఆరా తీయగా.. ఆమెకు కోవిడ్-19 సోకినట్లు తెలిసింది. అందువల్లే.. ఆమె అంబులెన్స్‌లో వచ్చింది.


తొలుత.. పరీక్షా కేంద్రంలోకి వెళ్లేందుకు ఆమెను అనుమతించనప్పటికీ జిల్లా కలెక్టర్ పీయూష్ సమరియా జోక్యంతో ఆ యువతికి పరీక్షా కేంద్రంలో ప్రత్యేక గదిని కేటాయించారు. మూడు గంటల పాటు ఆమె పరీక్ష రాసింది. ఆమెకు ఇచ్చిన ఓఎంఆర్ షీట్‌ను కూడా ప్రత్యేకంగా ప్యాక్ చేశారు. పరీక్ష రాయగానే ఆమెను అదే అంబులెన్స్‌లో ఇంటికి తరలించి హోం ఐసోలేషన్‌లో ఉంచారు. ఆమె పరీక్ష రాసిన గదిని శానిటైజ్ చేశారు.

Updated Date - 2020-09-18T01:04:44+05:30 IST