మొదలైన కరోనా ఆంక్షలు

ABN , First Publish Date - 2021-04-21T06:35:06+05:30 IST

జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో కరోనా కట్టడికి ఆంక్షలు మొదలయ్యాయి.

మొదలైన కరోనా ఆంక్షలు
కందుకూరులో సాయంత్రం 5 గంటలకు మూసివేసి ఉన్న దుకాణాలలు

కందుకూరులో రాత్రిపూట అన్నీ బంద్‌

త్రిపురాంతకంలో పూర్తిగా, 

పంగులూరులో పాక్షికంగా అమలు

రేపటి నుంచి అద్దంకిలోనూ కొనసాగింపు

జిల్లా అంతటా తనిఖీలు, జరిమానాలు 

ఒంగోలు, ఏప్రిల్‌ 20 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో కరోనా  కట్టడికి ఆంక్షలు మొదలయ్యాయి. పలు పట్టణాలు, మండల కేంద్రాల్లో మంగళవారం వాటిని అమలు చేశారు. కందుకూరులో రాత్రిపూట పూర్తిస్థాయిలో ఆంక్షలు విధించారు. త్రిపురాంతకంలో ఉదయం 11 నుంచి అన్ని రకాల వ్యాపారాలను ఆపివేయగా పంగులూరులో ఉదయం, సాయంత్రం రెండు విడతల అనుమతించి మిగతా సమయం మూసేశారు. జిల్లాలో ఈనెలలో  కరోనా తీవ్రత బాగా పెరిగింది. ఈనెల 1 నుంచి మంగళవారం వరకు 20 రోజుల్లో 3,629 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అందులో సోమవారం 280, మంగళవారం 305 పాజిటివ్‌లు నమోదయ్యాయి. హోమ్‌ ఐసోలేషన్‌తోపాటు వివిధ ఆస్పత్రుల్లోనూ పెద్దసంఖ్యలోనే బాధితులు చికిత్సపొందుతుండగా మృతులు పెరిగారు. ఈనేపథ్యంలో కరోనా తీవ్రత ఉన్న ప్రాంతాల్లో స్థానిక పరిస్థితులకు అనుగుణంగా టాస్క్‌ఫోర్స్‌ కమిటీలు నిర్ణయం తీసుకుని ఆంక్షలు అమల్లోకి తెస్తున్నాయి.  కరోనా బాధితులు పెరుగుతున్న కందుకూరులో మంగళవారం నుంచి రాత్రిపూట జనసంచారంపై ఆంక్షలకు నిర్ణయించారు. ఉదయం 5 నుంచి సాయంత్రం 5వరకు మాత్రమే వ్యాపారాలు, ఇతర జనసంచారానికి అనుమతించి సాయంత్రం 5 నుంచి మరుసటి రోజు 5 గంటల వరకు అన్నింటినీ  నిషేధించారు. అలాగే త్రిపురాంతకంలోనూ మంగళవారం ఆంక్షలు మొదలయ్యాయి. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు మాత్రమే దుకాణాలు, వ్యాపార ఇతర కార్యకలాపాలకు అవకాశం ఇచ్చి తర్వాత అత్యవసరాలు మినహా అన్నింటినీ మూసివేయించారు. పంగులూరులో ఉదయం 8నుంచి 12 గంటలు, అలాగే సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకూ వ్యాపార కార్యకలాపాలు అనుమతించి మిగతా సమయంలో నిలిపేశారు. అద్దంకిలో కూడా ఈనెల 22నుంచి ఆంక్షలు అమలు చేయాలని ఇప్పటికే నిర్ణయించారు. అక్కడ ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు వ్యాపారాలు అనుమతించి రాత్రిపూట   మూసివేయాలని నిర్ణయించారు. ఇదిలా ఉండగా పోలీస్‌, మున్సిపల్‌, పంచాయతీ సిబ్బంది రోడ్లపై మాస్కులు లేకుండా తిరుగుతున్న వారికి జరిమానా విధిస్తున్నారు. పట్టణాల్లో మార్కెట్లు, ఇతర వ్యాపార సముదాయాలు అధికంగా ఉండేచోట మాస్కులు, భౌతికదూరంపై ప్రచారం నిర్వహిస్తున్నారు. ఒంగోలు ఆర్టీసీ డిపోలో ప్రయాణికులకు థర్మల్‌ స్ర్కీనింగ్‌ ప్రక్రియ కొనసాగుతోంది. 


Updated Date - 2021-04-21T06:35:06+05:30 IST