మళ్లీ... Covid డేంజర్ బెల్స్

ABN , First Publish Date - 2022-06-12T14:23:13+05:30 IST

రాష్ట్రంలో మళ్లీ ‘డేంజర్‌ బెల్స్‌’ మోగుతున్నాయ్‌. అనూహ్యంగా కరోనా వైరస్‌ వ్యాప్తి విస్తృతమవుతోంది. వారం రోజులుగా క్రమంగా కరోనా వైరస్‌

మళ్లీ... Covid డేంజర్ బెల్స్

- నిబంధనలు కాస్త కఠినతరం చేసిన ప్రభుత్వం

- బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరి

- వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో సీఎం సమీక్ష

- ముందస్తు ఏర్పాట్లకు ఆదేశాలు


‘కరోనా ఫోర్త్‌వేవ్‌ హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్‌ అయింది. కేసులు పెరుగుతుండడంతో నిబంధనల్ని కాస్త కఠినతరం చేసింది . ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో మాస్కు ధరించడం  తప్పనిసరి చేసింది.  శనివారం ఉదయం ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ అధికారులతో సమీక్ష జరిపి  ముందుజాగ్రత్త చర్యలు చేపట్టాలని వైద్యశాఖ అధికారులను ఆదేశించారు. ’


చెన్నై, జూన్‌ 11 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మళ్లీ ‘డేంజర్‌ బెల్స్‌’ మోగుతున్నాయ్‌. అనూహ్యంగా కరోనా వైరస్‌ వ్యాప్తి విస్తృతమవుతోంది. వారం రోజులుగా క్రమంగా కరోనా వైరస్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ నిబంధనల్ని కాస్త కఠినతరం చేసింది. ఇందులో భాగంగా బహిరంగ ప్రదేశాల్లో మాస్కు ధారణ తప్పనిసరి చేసింది. కరోనా కట్టడి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సచివాలయంలో శనివారం ఉదయం ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ అధికారులతో సమీక్ష జరిపారు. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. పలు రాష్ట్రాల్లో కరోనా మళ్ళీ ఉగ్రరూపం దాల్చుతుండటంతో రాష్ట్రంలో అలాంటి పరిస్థితులు తలెత్తకుండా ముందుజాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వి. ఇరై అన్బు, డీజీపీ శైలేంద్రబాబు, నగరపాలక శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి శివదాస్‌ మీనా, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి రాధాకృష్ణన్‌, రెవెన్యూ విపత్తుల నిర్వహణ శాఖ ప్రధాన కార్యదర్శి కుమార్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రధాన కార్యదర్శి అముదా, గ్రేటర్‌ చెన్నై పోలీసు కమిషనర్‌ శంకర్‌ జివాల్‌ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా వుండగా చెన్నైతో పాటు చెంగల్పట్టు, కాంచీపురం, కోయంబత్తూరు, తిరువళ్లూరు జిల్లాల్లో కరోనా కేసులు అధికంగా ఉన్నాయి. నగరంలోని పలు విద్యాసంస్థల్లో కరోనా వైరస్‌ వ్యాప్థి పెరుగుతోంది. అదే సమయంలో ఆ విద్యా సంస్థల్లోని విద్యార్థులు, ఉద్యోగులు, సిబ్బందికి కరోనా వైద్య పరీక్షలు నిర్వహించి, వైరస్‌ బాధితులను ఐసోలేషన్‌లో ఉంచారు. ఈ నేపథ్యంలో అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షసమావేశం నిర్వహించిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నిబంధనల్ని తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ వివరాలిలా వున్నాయి... 


- రాష్ట్రంలో కరోనా కేసులు గతస్థాయిలో భారీగా లేకున్నా, రోజురోజుకు వాటి సంఖ్య పెరుగుతుండటంతో వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయడానికి వీలుగా బాధితులకు తక్షణ వైద్య చికిత్సలందించేందుకు ఆరోగ్యశాఖ, స్థానిక సంస్థల శాఖ, నగరపాలక శాఖ, విపత్తుల నివారణ సంస్థ తక్షణం రంగంలోకి దిగాలి.


- కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు, ఆలయ వేడుకలు, వివాహాల, సమావేశాల్లో పాల్గొనేవారిలో కొందరికి కరోనా వైరస్‌ సోకితే ఆయా ప్రాంతాల్లో ఉన్నవారందరికీ కరోనా పరీక్షలు తప్పనిసరిగా చేయాలి. తగిన చికిత్సలందించాలి.


- జనం అధికంగా గుమికూడే బహిరంగప్రదేశాల్లో కరోనా నిరోధక నిబంధనలు పాటించాలి. ముఖ్యంగా ముఖాలకు మాస్కులు ధరించాలి. శానిటైజర్‌తో చేతుల్ని తరచూ శుభ్రం చేసుకునేందుకు వీలుగా తగు ఏర్పాట్లు చేపట్టాలి.


- రాష్ట్రంలో మొదటి విడత టీకాలు వేసుకోని 43 లక్షల మంది, రెండో విడత టీకాలు వేసుకోని 1.20 కోట్ల మందికి టీకాలు వేసేందుకు జిల్లా అధికారులు, ఆరోగ్యశాఖ అధికారులు చర్యలు చేపట్టాలి.



Updated Date - 2022-06-12T14:23:13+05:30 IST