మళ్లీ కొవిడ్‌ టెన్షన్‌

ABN , First Publish Date - 2022-06-26T06:36:43+05:30 IST

జిల్లాలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి.

మళ్లీ కొవిడ్‌ టెన్షన్‌

జిల్లాలో పెరుగుతున్న కేసులు

గత వారం రోజుల్లో 195 నమోదు

అప్రమ్తతంగా ఉండాలని సూచిస్తున్న వైద్య నిపుణులు

మాస్క్‌ తప్పనిసరి

రెండో డోసు తీసుకుని ఆరు నెలలు దాటినట్టయితే బూస్టర్‌ డోసు తీసుకోవడం మంచిదంటున్న వైద్యులు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)


జిల్లాలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా వుండడమే ఇందుకు కారణమని వైద్యులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తం కావాలని ఆరోగ్య శాఖ అధికారులు సూచిస్తున్నారు. కేసులు పెరుగుతున్న తీరు నాలుగో వేవ్‌కు సంకేతంగా భావించాల్సిన అవసరం ఉందంటున్నారు. నగర పరిధిలో కొవిడ్‌ కేసులు పెరుగుదల ఉంటుందని, అందుకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకోవాలని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ఇప్పటికే జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. అయితే, మొదటి మూడు వేవ్‌లతో పోలిస్తే వైరస్‌ తీవ్రత తక్కువగా వుండే అవకాశముందని అంచనా వేస్తున్నారు. అయినప్పటికీ తగిన జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. 

రెండో డోస్‌ తీసుకుని నెలలు దాటిన చాలామందిలో యాంటీబాడీలు తగ్గిపోవడంతో మరోసారి వైరస్‌ బారినపడేందుకు అవకాశం వున్నదని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం కేసులు పెరగడానికి, రానున్న రోజుల్లో ఫోర్త్‌ వేవ్‌ అంటూ వచ్చినా...దానికి ఈ అంశమే కారణం కావచ్చునని విశ్లేషిస్తున్నారు. సెకండ్‌ డోసు తీసుకుని ఆరు నెలలు దాటిన ప్రతి ఒక్కరికీ బూస్టర్‌ డోసు ఇవ్వడం వల్ల కొంత ఉపయోగం వుంటుందన్న భావనను నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. 


కేసులు పెరుగుదల

థర్డ్‌ వ్యాప్తి తగ్గుముఖం పట్టిన సుమారు నాలుగు నెలలు తరువాత రోజువారీ కేసుల్లో గత వారం నుంచి మళ్లీ పెరుగుదల కనిపిస్తోంది. గత వారం రోజుల్లో 195 మందికి వైరస్‌ సోకినట్టు నిర్ధారణ అయ్యింది. జిల్లాలో ప్రస్తుతం కేసుల సంఖ్య కొంత తక్కువగా కనిపిస్తున్నప్పటికీ పాజిటివిటీ రేటు భారీగా నమోదవుతుండడం  ఆందోళన కలిగిస్తోంది. ఈ నెల 23న 9 శాతం పాజిటివిటీ రేటుతో 23 కేసులు నమోదు కాగా, ఈనెల 24న పాజిటివిటీ రేటు 15 శాతానికి పెరిగి 40 కేసులు నమోదయ్యాయి. శనివారం 12 శాతం పాజిటివిటీ రేటుతో 31 మందికి వైరస్‌ సోకినట్టు నిర్ధారణ అయింది. గత మూడు నెలలు నుంచి పాజిటివిటీ రేటు 2 శాతం కంటే తక్కువగానే నమోదవుతూ వచ్చింది. ప్రస్తుతం జిల్లాలో ప్రతిరోజూ సుమారు 300 మందికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ సంఖ్యను మరింత పెంచాల్సిందిగా ఇప్పటికే వైద్య, ఆరోగ్య శాఖ అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. ప్రస్తుతం కేజీహెచ్‌లో కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాల్లో కూడా పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్టు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. 


స్వల్ప లక్షణాలు

వైరస్‌ సోకిన వ్యక్తుల్లో స్వల్ప లక్షణాలే వుంటున్నట్టు ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం వైరస్‌ బారినపడుతున్న వ్యక్తుల్లో జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలు మాత్రమే ఉంటున్నాయి. దీంతో ప్రతి ఒక్కరూ హోమ్‌ ఐసోలేషన్‌లోనే ఉండి కోలుకుంటున్నారు. ప్రస్తుతం జిల్లాలో 195 మంది హోమ్‌ ఐసోలేషన్‌లో ఉన్నారు.


60 వేలు కిట్లు.. 

హోమ్‌ ఐసోలేషన్‌లో వుంటున్న వారికి అందించేందుకు జిల్లాలో 60 వేల కిట్లు అందుబాటులో ఉన్నాయి. వైరస్‌ సోకిన ప్రతి ఒక్కరికీ కిట్లు అందిస్తున్నారు. అలాగే, జిల్లాలో కొవిడ్‌ టెస్టింగ్‌ కిట్లు 40 వేల వరకు అందుబాటులో ఉన్నాయి.  


నిబంధనలు పాటించాల్సిందే.. 

- డాక్టర్‌ విజయలక్ష్మి, జిల్లా వైద్య,ఆరోగ్యశాఖ అధికారిణి

జిల్లాలో కొవిడ్‌ కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి. మాస్క్‌ ధరించాలి, భౌతిక దూరం పాటించాలి, అలాగే హ్యాండ్‌ శానిటైజర్‌ వినియోగం తప్పనిసరి. వీలైనంత వరకు కొద్దిరోజులపాటు ఫంక్షన్లు వంటి వాటికి దూరంగా వుండడం మంచిది. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, గర్భిణుల విషయంలో మరింత అప్రమత్తత అవసరం. ఇప్పటికే ఐదేళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్లు అందించాం. 60 ఏళ్లు దాటిన, ఆరోగ్య సిబ్బందికి, ఫ్రంట్‌ లైన్‌ వర్కర్స్‌కు మూడో డోసు ఇస్తున్నాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మిగిలిన వర్గాలకు మూడో డోసు ఇస్తాం. పరీక్షలు సంఖ్య పెంచడంపైనా దృష్టిసారించాం. 


పది మంది పీజీలకు పాజిటివ్‌.. 

గడచిన మూడు రోజుల్లో ఆంధ్రా మెడికల్‌ కళాశాల పరిధిలోని పలు విభాగాల్లో పనిచేస్తున్న పది మంది పీజీలు కరోనా బారినపడ్డారు. వీరిలో గైనిక్‌ విభాగంలో పనిచేస్తున్న వారు ఎక్కువగా ఉన్నారు. ఆయా విద్యార్థులతో సన్నిహితంగా మెలిగిన కొందరికి పరీక్షలు నిర్వహించగా నెగెటివ్‌గా నిర్ధారణ అయినట్టు తెలిసింది. 

Updated Date - 2022-06-26T06:36:43+05:30 IST