ప్రజల చెంతకే కొవిడ్‌ పరీక్షలు

ABN , First Publish Date - 2020-12-03T05:15:45+05:30 IST

కరోనా వైరస్‌ ఈ పేరు చెబితేనే గత 9 నెలల కిందట ప్రజల్లో ఒకరకమైన దడపుట్టుకొచ్చేది. గ్రామాల్లో, పట్టణాల్లో ఎవరైన ఒకరు ఈ వైరస్‌ బారిన పడ్డారని తెలిస్తే చాలు ప్రజలు ఉలిక్కిపడే సందర్భాలు ఉన్నాయి.

ప్రజల చెంతకే కొవిడ్‌ పరీక్షలు
కామారెడ్డి జిల్లాలో మొబైల్‌ పరీక్ష కేంద్రాల ద్వారా పరీక్షలు నిర్వహిస్తున్న దృశ్యం

ఉమ్మడి జిల్లాలోని గ్రామాల్లో మొబైల్‌ పరీక్ష కేంద్రాల ఏర్పాటు
సెకండ్‌వేవ్‌ ముప్పుతో అప్రమత్తమైన అధికారులు
3 నెలల పాటు పరీక్షలు నిర్వహించనున్న వైనం
ఇప్పటికే నిత్యం కరోనా వ్యాధిపై అవగాహన కార్యక్రమాలు
ప్రజలు మాస్క్‌, భౌతికదూరం పాటించాలంటున్న వైద్యాధికారులు


కామారెడ్డి టౌన్‌, డిసెంబరు 2:
కరోనా వైరస్‌  ఈ పేరు చెబితేనే గత 9 నెలల కిందట ప్రజల్లో ఒకరకమైన దడపుట్టుకొచ్చేది. గ్రామాల్లో, పట్టణాల్లో ఎవరైన ఒకరు ఈ వైరస్‌ బారిన పడ్డారని తెలిస్తే చాలు ప్రజలు ఉలిక్కిపడే సందర్భాలు ఉన్నాయి. రోజుకు వందల సంఖ్యలోనే కేసులు నమోదవుతుండడం ఎలర్జీ వల్ల చిన్నపాటి తుమ్ములు, దగ్గులు వచ్చినా ఆ వ్యక్తికి ఆమడదూరంగా ఉన్న పరిస్థితులు నెలకొన్నాయి. అట్లాంటి సమయంలో గత రెండు నెలల నుంచి కరోనా వైరస్‌ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో ప్రజల్లో అలసత్వం పెరిగినా వైరస్‌ ప్రభావం గ్రహించిన వైద్యాధికారులు మాత్రం ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్నారు. కరోనా సెకండ్‌వేవ్‌ రూపంలో మళ్లీ విరుచుకుపడుతుందా? వైరస్‌ విజృంభించిన మొదట్లో ఎదురైన గడ్డు పరిస్థితులు మళ్లీ పునరావృతమవుతాయా అనే సందేహంతో ముందస్తుగానే రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ అప్రమత్తతో ప్రతీ జిల్లాలో పరీక్షలు నిర్వహించాలని ఆదేశాలు ఇవ్వడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొబైల్‌ ర్యాపిడ్‌ పరీక్షలు నిర్వహించేందుకు శ్రీకారం చుట్టారు. గతంలో జిల్లా కేంద్రాలకు, ఏరియా ఆసుపత్రులకు ఆ తర్వాత మండల కేంద్రాలకు పరిమితమైన మొబైల్‌ ర్యాపిడ్‌ పరీక్షలను పల్లె చెంతకు తీసుకువచ్చారు. దీనికోసం అధికారులు యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేసి ఈ మూడు నెలల పాటు ఉమ్మడి జిల్లాలోని నిజామాబాద్‌, బోధన్‌, ఆర్మూర్‌, భీంగల్‌, కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ డివిజన్‌ల పరిధిలోని గ్రామీణ ప్రాంతాల్లో పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు.
ప్రత్యేక శిబిరాల ఏర్పాటు
ప్రధాన పట్టణాలు, మండల ప్రాంతాల్లోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ర్యాపిడ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని ప్రతీ సెంటర్‌లో రెండేసి మొబైల్‌ శిబిరాలను ఏర్పాటు చేశారు. అవసరమైన కిట్లను సిద్ధం చేశారు. ఇప్పటికే కరోనా సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో ప్రతీ ఒక్కరూ పరీక్షలు చేసుకోవాలని ఆరోగ్య బోధకులతో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. అనుమానం ఉన్నా.. లక్షణాలు కనపడినా వెంటనే కరోనా టెస్ట్‌ చేయించుకోవాలని ప్రచారం చేస్తున్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలతో ఆరోగ్యపరీక్షలు చేస్తూ అవసరమున్న వారికి కరోనా పరీక్షలు చేయించేలా అప్రమత్తం చేశారు. పాజిటివ్‌ వచ్చిన వారికి చికిత్స కిట్‌ అందజేస్తూ వైద్యుడి సూచన మేరకు వారికి ఐసోలేషన్‌ పాటించాలని సూచిస్తున్నారు. అలాగే లక్షణాలు తీవ్రంగా మారితే ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించేందుకు కృషి చేస్తున్నారు.
పల్లె ముంగిటకు కరోనా పరీక్షలు
ఇప్పటి వరకు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే కరోనా ర్యాపిడ్‌ టెస్టులు నిర్వహించేవారు. ప్రస్తుతం రద్దీ ఎక్కువ ఉన్న ప్రాంతాలను గుర్తించి ఆ ప్రాంతాల్లో మొబైల్‌ ర్యాపిడ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా ర్యాపిడ్‌ పరీక్షలను గ్రామాలకు విస్తరింపజేస్తున్నారు. గతంలో కరోనా పరీక్షలు చేసుకోవాలంటే మండల కేంద్రం, నియోజకవర్గకేంద్రం, జిల్లా కేంద్రాల్లోని ఆస్పత్రులకు వెళ్లి ఎంతో వ్యయప్రయాసల కోర్చి పరీక్షలు చేసుకునేవారు. ప్రస్తుతం సెకండ్‌వేవ్‌ వస్తోందని ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తగా పల్లె ప్రాంతాల్లో సైతం ర్యాపిడ్‌ పరీక్షలు చేసేందుకు సిద్ధమైంది. గ్రామంలోని కూడలి ప్రాంతాల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఇమ్యూనిటీ పవర్‌ను పెంచుకునేందుకు అవసరమైన ఆహారం తీసుకుని తగు జాగ్రత్తలు పాటించాలని వైద్యసిబ్బంది ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
మాస్క్‌, భౌతికదూరమే రక్షించే ఆయుధాలు
ప్రస్తుతం కరోనా వ్యాధికి వ్యాక్సిన్‌ అందుబాటులోకి రాలేదు. ముందు జాగ్రత్తే మన కర్తవ్యమని, మన నిర్లక్ష్యం వల్లే సెకండ్‌వేవ్‌ పెరిగే అవకాశాలు ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. కరోనా వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే కొద్ది అది మరింత తట్టుకునే శక్తిని పెంచుకునే అవకాశం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. చలికాలంలో వైరస్‌ ఇన్ఫెక్షన్లు పెరుగుతాయని, వయస్సు పైబడినవారు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు, పిల్లలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. చలికాలంలో వైరస్‌ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని, మాస్కులు ధరించకపోవడం, గుమిగూడటం వంటివి ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కరోనా ప్రభావం ముఖ్యంగా ఊపిరితిత్తులు, దీర్ఘకాలిక సమస్యలపై ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మాస్క్‌ ధరించడంతో పాటు, భౌతికదూరమే మనల్ని రక్షించే ఆయుధాలని పేర్కొంటున్నారు.

కరోనా విషయంలో నిర్లక్ష్యం వద్దు
- చంద్రశేఖర్‌, డీఎంహెచ్‌వో, కామారెడ్డి
పల్లెల్లోనూ మొబైల్‌ ర్యాపిడ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నాం. రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ నుంచి వచ్చిన సూచనల మేరకు ప్రతీ జిల్లాలో ఈ పరీక్షలు చేస్తున్నారు. జలుబు, జ్వరం, దగ్గు వంటి లక్షణాలు ఉంటే వెంటనే కరోనా ర్యాపిడ్‌ పరీక్షలు చేయించుకోవడంతో పాటు అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకోవాలి. పట్టణ ప్రాంతాల్లోనే కాకుండా గ్రామాల్లో సైతం మొబైల్‌ టెస్ట్‌లు చేయించుకునే అవకాశం కల్పించాం. ఈ ప్రక్రియను మూడు నెలల పాటు కొనసాగించనున్నాం. కరోనా పట్ల నిర్లక్ష్యం వహించకుండా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి, భౌతికదూరం పాటించాలి.

Updated Date - 2020-12-03T05:15:45+05:30 IST