పరీక్ష ఎక్కడ..? ప్రహసనంగా కొవిడ్‌ టెస్ట్‌లు

ABN , First Publish Date - 2020-11-11T15:49:51+05:30 IST

జిల్లావ్యాప్తంగా ఐమాస్క్‌ బస్సులను..

పరీక్ష ఎక్కడ..? ప్రహసనంగా కొవిడ్‌ టెస్ట్‌లు

కీలక దశలో నిలిచిన వైద్య పరీక్షలు 

తాత్కాలిక సిబ్బంది విధుల బహిష్కరణతో అంతరాయం 

ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయని వైద్యశాఖ 

ప్రాణ భయంతో పరుగులు తీస్తున్న ప్రజలు 

సిఫార్సులుంటేనే కొవిడ్‌ టెస్టులు 

బాధ్యతల నుంచి తప్పించుకుంటున్న అధికారులు 


ఆంధ్రజ్యోతి, విజయవాడ: జిల్లావ్యాప్తంగా ఐమాస్క్‌ బస్సులను పెట్టి, నిన్న మొన్నటి వరకు రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా కొవిడ్‌ పరీక్షలను నిర్వహించి, ప్రశంసలందుకున్న అధికారులు నేడు చేతులెత్తేశారు. దేశమంతటా సెకండ్‌ వేవ్‌ చుట్టుముడుతున్న వేళ మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన వైద్య ఆరోగ్య శాఖ.. వేతనాలు లేక తాత్కాలిక వైద్య సిబ్బంది ఆందోళనకు దిగితే ప్రజారోగ్యాన్ని కొవిడ్‌కు వదిలేసింది. పరీక్షలు చేయని కారణంగా కేసులు తగ్గినట్టు కనిపిస్తుంటే, ఇదేమీ తెలియని ప్రజలు కరోనా తగ్గిపోతోందనుకుని ధైర్యంగా బయట తిరిగేస్తున్నారు.


విజయవాడ నగరానికి చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థి నాలుగు రోజులుగా దగ్గుతో బాధపడుతున్నాడు. కుటుంబ సభ్యులు రాజీవ్‌నగర్‌ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి తీసువెళ్లారు. కరోనా పరీక్ష చేయించుకుని, రిపోర్టు తీసుకుని వస్తేనే వైద్యం చేస్తామని వైద్యులు చెప్పారు. పరీక్ష చేయించేందుకు రైల్వేస్టేషన్‌ వద్ద ఉన్న ఐమాస్క్‌ బస్సు వద్దకు వెళ్లారు. అక్కడ బస్సు ఉన్నా.. శాంపిల్స్‌ తీసుకునే సిబ్బంది లేకపోవడంతో ఆందోళనతో వెనుదిరిగారు. 


విజయవాడలోని ఒక హోటల్లో పని చేస్తున్న పదిమంది కార్మికులు కరోనా లక్షణాలతో బాధపడుతున్నారు. టెస్టులు చేయించుకునేందుకు నగరంలో ఐమాస్క్‌ బస్సులు ఉండే అన్ని ప్రాంతాలకూ వెళ్లారు. ఎక్కడా పరీక్షలు నిర్వహించడం లేదు. ఆ కార్మికుల దయనీయ స్థితిని చూసిన హోటల్‌ యజమాని తనకు తెలిసినవారి ద్వారా వైద్యాధికారులకు సిఫార్సులు చేయించారు. అప్పుడు వారు రమ్మన్నచోటకు వెళితే శాంపిల్స్‌ తీసుకున్నారు. 


విజయవాడ నగరంలో ప్రస్తుతం కరోనా పరీక్షల నిర్వహణ తీరుకు ప్రత్యక్ష ఉదాహరణలు ఇవే. నగరంలోనే కాదు.. జిల్లావ్యాప్తంగానూ కరోనా పరీక్షల నిర్వహణ ప్రక్రియ ఓ ప్రహసనంలా మారింది. జిల్లాలో కరోనా తీవ్రత అంతగా లేనప్పుడే జిల్లా అధికారులు ప్రజలను అప్రమత్తం చేసి, పరీక్షలు చేయించుకునేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావాలంటూ ప్రకటనలు గుప్పించేవారు. ఇప్పుడు కరోనా భయంతో ప్రజలే స్వచ్ఛందంగా ముందుకువచ్చి, పరీక్షలు చేయించుకునేందుకు క్యూలు కడుతున్నా, పరీక్షలు నిర్వహించేవారే లేకుండా పోయారు. 


జిల్లాలో గత మార్చి నెలలో మొదలైన కరోనా ప్రభావం రోజురోజుకూ పెరుగుతూ కల్లోలం సృష్టిస్తున్న తరుణంలో వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖతోపాటు రెవెన్యూ, పోలీసు తదితర శాఖల అధికారులు సైతం నడుం బిగించారు. వైరస్‌ తీవ్రతను గుర్తించి, నియంత్రించేందుకు టెస్టింగ్‌... ట్రేసింగ్‌... ట్రీట్‌మెంట్‌ విధానాన్ని పక్కాగా అమలు చేయడంతో జిల్లాలో కరోనా వ్యాప్తి చాలావరకు అదుపులోకి వచ్చింది. ఒక దశలో రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో కరోనా కేసులు  విపరీతంగా పెరిగినా.. జిల్లాలో మాత్రం రోజువారీ కేసులు 500 లోపే నమోదయ్యాయి. జిల్లాలో కరోనా పరీక్షలను ఎక్కువ సంఖ్యలో నిర్వహించడం ద్వారానే ఇది సాధ్యమయిందని అధికారులు కూడా చెప్పారు. గత జూన్‌ నుంచి జిల్లావ్యాప్తంగా నిర్దేశిత ప్రాంతాల్లో ఐమాస్క్‌ బస్సులను ఏర్పాటు చేసి... తాత్కాలిక ప్రాతిపదికన అదనపు సిబ్బందిని నియమించి, ప్రతిరోజూ ఐదు వేలకు పైగా శాంపిల్స్‌ సేకరించేవారు. ఈ బస్సుల్లో పనిచేస్తున్న తాత్కాలిక సిబ్బందికి కాంట్రాక్టు సంస్థ జీతాలు చెల్లించకపోవడంతో పది రోజులుగా వారంతా మూకుమ్మడిగా విధులను బహిష్కరించారు. దీంతో జిల్లాలో ఐమాస్క్‌ బస్సులు నిలిచిపోయాయి.


కరోనా అనుమానితుల నుంచి శాంపిల్స్‌ సేకరించేవారు లేకపోవడంతో పరీక్షల ప్రక్రియ కూడా దాదాపు నిలిచిపోయింది. ప్రతిరోజూ ఐదు వేలకు పైగా శాంపిల్స్‌ను ల్యాబ్‌లలో పరీక్షించగా.. 300 నుంచి 400కు పైగా పాజిటివ్‌ కేసులు వెలుగు చూసేవి. ఇప్పుడు శాంపిల్స్‌ సేకరించే ప్రక్రియ నిలిచిపోవడంతో ల్యాబ్‌లలో పరీక్షలు గణనీయంగా తగ్గిపోయాయి. దీనికి అనుగుణంగానే రోజువారీ నమోదయ్యే కేసుల సంఖ్య తక్కువగా కనిపిస్తోంది. పది రోజులుగా ఇదే పరిస్థితి ఉండడంతో వైరస్‌ వ్యాప్తి తగ్గిపోయిందని ప్రజలు భావిస్తున్నారు. వాస్తవానికి పరీక్షలు నిలిచిపోయినందునే జిల్లాలో కేసులు వెలుగులోకి రావడం లేదు.


సెకండ్‌ వేవ్‌ భయం

జిల్లాలోనూ కరోనా సెకండ్‌ వేవ్‌ ముంచుకొస్తుందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలోనే లాక్‌డౌన్‌ నిబంధనలను పూర్తిగా సడలించడం ఆందోళన కలిగిస్తోంది. పాఠశాలలు, సినిమా థియేటర్లుతోసహా అన్నీ తెరుచుకోవడంతో కరోనా మహమ్మారి మరింత విజృంభిస్తోంది. అనేక మంది కరోనా లక్షణాలతో బాధపడుతూ పరీక్షలు చేయించుకునేందుకు ఐమాస్క్‌ బస్సుల ద్వారా శాంపిల్స్‌ సేకరించే ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియం, రైల్వేస్టేషన్‌, వన్‌టౌన్‌లో గాంధీజీ మున్సిపల్‌ స్కూల్‌, బసవ పున్నయ్య స్టేడియం, గుణదల మేరీమాత చర్చి ప్రాంతాలకు పరుగులు తీస్తున్నారు. తీరా అక్కడకు వెళ్లాక అక్కడ బస్సులు, వైద్యసిబ్బంది లేకపోవడంతో ఉసూరుమంటూ వెనుదిరిగి వెళ్లిపోతున్నారు. జిల్లాలో కరోనా సెకండ్‌ వేవ్‌ మొదలైన కీలక దశలో జిల్లా యంత్రాంగం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి కొవిడ్‌ టెస్టులను పెంచాల్సి ఉండగా.. ఈ బాధ్యతల నుంచి తప్పించుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 


పీహెచ్‌సీల్లోనూ అదే పరిస్థితి

ఐమాస్క్‌ బస్సులు పూర్తిగా నిలిచిపోవడంతో జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో ప్రజలకు కరోనా పరీక్షలు నిర్వహించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఆయా కేంద్రాల్లోని వైద్య సిబ్బంది ఒక్కొక్కరు రోజుకు పది మందికి కరోనా పరీక్షలు చేయించాలని టార్గెట్లు కూడా నిర్ణయించారు. కానీ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ఆశించిన స్థాయిలో పరీక్షలు చేయడం లేదు. లక్షణాలతో బాధపడుతున్నవారు వెళ్లినా చాలా కేంద్రాల్లో శాంపిల్స్‌ తీసుకోవడం లేదనే ఫిర్యాదులున్నాయి. సిఫార్సులు ఉంటేనే కొన్నిచోట్ల కొవిడ్‌ టెస్టులకు శాంపిల్స్‌ సేకరిస్తున్నారు. సిఫార్సులు చేయించుకునే పలుకుబడిలేని సామాన్యులు కరోనా పరీక్షలు చేయించుకుందామంటే సాధ్యం కాని పరిస్థితులు జిల్లాలో నెలకొన్నాయి. 


ప్రైవేటు ఆసుపత్రుల్లో నిలువు దోపిడీ 

కరోనా అనుమానితులు ప్రాణభయంతో ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్తుంటే అక్కడ దోపిడీకి హద్దూ పద్దూ లేకుండా పోతోంది. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన రోగులకు చికిత్స అందించడానికి అనుమతులు పొందిన ప్రైవేటు ఆసుపత్రుల నిర్వాహకులు ప్రైవేట్‌ ల్యాబ్‌లతో ఒప్పందం కుదుర్చుకుని కరోనా నిర్ధారణ పరీక్షలు కూడా చేయిస్తామంటూ బాధితుల నుంచి వేలాది రూపాయిలు వసూలు చేస్తున్నారు. జిల్లాలో అపోలో ప్రైవేట్‌ ల్యాబ్‌కు, మణిపాల్‌ ఆసుపత్రిలోని ల్యాబ్‌కు మాత్రమే ప్రభుత్వం కరోనా పరీక్షలు నిర్వహించడానికి అనుమతులు జారీ చేసింది. ఈ ల్యాబ్‌లలో పరీక్ష చేయించుకున్నవారి నుంచి ఒక్కో పరీక్షకు రూ.2,900 వసూలు చేయాలని ప్రభుత్వమే ధర నిర్ణయించింది. కానీ నగరంలోని కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల నిర్వాహకులు ఒక్కో కరోనా పరీక్షకు రూ.4 వేలకు పైగా వసూలు చేస్తున్నారు. ఇంత పెద్దమొత్తంలో సొమ్ములు చెల్లించుకోలేని పేదలు వైరస్‌ సోకినా కూడా కొవిడ్‌ పరీక్షలు చేయించుకోలేని నిస్సహాయ స్థితిలో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని కాలం గడుపుతున్నారు. పరిస్థితులు చేయి దాటిపోకముందే జిల్లా యంత్రాంగం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి, ప్రజలకు విరివిగా కొవిడ్‌ పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఉంది. 


269 మందికి కరోనా.. మరో ముగ్గురు బాధితులు మృతి 

జిల్లాలో మంగళవారం కొత్తగా 269 మందికి వైరస్‌ సోకింది. గడిచిన 24 గంటల్లో మరో ముగ్గురు పాజిటివ్‌ బాధితులు మహమ్మారికి బలైపోయారు. ఈ కొత్త కేసులతో కలిపి జిల్లాలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసులు 42,148కి చేరుకున్నాయి. కరోనా మరణాలు అధికారికంగా 597కు పెరిగాయి. కొవిడ్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల్లో 392 మంది వ్యాధి నుంచి కోలుకుని ఇళ్లకు చేరుకోగా.. ఇంకా 3,140 మంది బాధితులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

Updated Date - 2020-11-11T15:49:51+05:30 IST