ఆంధ్రప్రదేశ్‌లో Tenth పబ్లిక్ పరీక్షలకు ఏడు పేపర్లే!

ABN , First Publish Date - 2021-12-19T05:22:38+05:30 IST

పదోతరగతి విద్యార్థులకు పబ్లిక్‌ పరీక్షల ఒత్తిడి తగ్గించేలా కొత్త నిబంధనలతో పాఠశాల విద్యాశాఖ ఏడు ప్రశ్నపత్రాలు ఉండేలా ఆదేశాలు జారీ చేసింది.

ఆంధ్రప్రదేశ్‌లో Tenth పబ్లిక్ పరీక్షలకు ఏడు పేపర్లే!

  • కొవిడ్‌తో టెన్త్‌ పరీక్షల్లో మార్పులు
  • ఉత్తర్వులు జారీచేసిన విద్యాశాఖ


నెల్లూరు (విద్య) డిసెంబరు 18 : పదోతరగతి ప్రశ్నపత్రంపై పాఠశాల విద్యా శాఖ స్పష్టత ఇచ్చింది. గతంలోలా కాకుండా ఈ ఏడాది ఏడు పేపర్లతోనే పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించింది. కరోనా నేపథ్యంలో విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకున్నామని చెబుతూ ఒత్తిడి లేకుండా పబ్లిక్‌ పరీక్షలు నిర్వహించేలా విద్యా శాఖ సవరణ ఉత్తర్వులు ఇచ్చింది. దీనికి తగినట్లుగా విద్యార్థులు పరీక్షలకు సన్నద్దం కావాలని అధికారులు ఆదేశాలు జారీచేశారు.


పదోతరగతి విద్యార్థులకు పబ్లిక్‌ పరీక్షల ఒత్తిడి తగ్గించేలా కొత్త నిబంధనలతో పాఠశాల విద్యాశాఖ ఏడు ప్రశ్నపత్రాలు ఉండేలా ఆదేశాలు జారీ చేసింది. అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు కూడా ఏడు పేపర్లే ఉంటాయని అఽధికారులు తెలిపారు. సామాన్యశాస్త్రం మినహా మిగిలిన అన్ని సబ్జెక్ట్‌లకూ ఒకే పేపర్‌ ఉంటుంది. మొత్తం 33 ప్రశ్నలకు 100 మార్కులు ఉంటాయి. సామాన్యశాస్త్రంలో భౌతిక, రసాయన శాస్త్రాలు ఒకటిగా, జీవశాస్త్రం పేపర్లు ఒకటిగా 50 చొప్పున మార్కులకు ఇస్తారు. 100 మార్కుల పరీక్షకు 3.15 గంటల సమయం ఇవ్వనున్నారు. ఇందులో ప్రశ్నపత్రం చదువుకోవడానికి, రాసింది సరిచూసుకోవడానికి 15 నిమిషాలు, పరీక్ష రాయడానికి 3 గంటల సమయం కేటాయించారు. ఈ విధానాన్ని ఈ ఏడాది మాత్రమే అమలు చేస్తామని స్పష్టం చేశారు. 2023 మార్చి నుంచి 11 పేపర్ల విధానం అమల్లోకి వస్తుందని తెలిపారు.


24పేజీల బుక్‌లెట్‌

కరోనా ఉదృతి లేకపోతే ఈ ఏడాది పదోతరగతి విద్యార్థులు తొలిసారిగా మార్పులతో పరీక్షలు రాయనున్నారు.  24 పేజీల బుక్‌లెట్‌ కలిగిన జవాబుపత్రంలోనే సమాధానాలు రాయాలి. అదనంగా జవాబుపత్రాలు ఇస్తే విద్యార్థులు వాటిని వరుసలో జతచేయకపోవడం, కొన్నిసార్లు పత్రాలు కనిపించకపోవడం వంటి ఘటనల నేపథ్యంలో ఈ మార్పు తీసుకువచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. అలాగే సామాన్యశాస్త్రంలో రెండు ప్రశ్నపత్రాలు 50 మార్కులకు ఉన్నందున ప్రశ్నలకు ఇచ్చే మార్కులు తగ్గుతాయి. ప్రశ్నల సంఖ్య 33లో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు. 

Updated Date - 2021-12-19T05:22:38+05:30 IST