కరోనా కేసుల్లో.. దేశంలోనే జిల్లా 19వ స్థానం

ABN , First Publish Date - 2021-05-07T05:41:00+05:30 IST

దేశంలో అత్యధికంగా కరోనా విస్తరిన్న జిల్లాల్లో గుంటూరుకు చేరింది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల్లో జిల్లా 19వస్థానంలో ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

కరోనా కేసుల్లో.. దేశంలోనే  జిల్లా 19వ స్థానం

 గుంటూరు, మే 6 (ఆంధ్రజ్యోతి): దేశంలో అత్యధికంగా కరోనా విస్తరిన్న జిల్లాల్లో గుంటూరుకు చేరింది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల్లో జిల్లా 19వస్థానంలో ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఏప్రిల్‌ 13వ తేదీ నుంచి నిత్యం నమోదు అవుతున్న పాజిటివ్‌ కేసులను పరిశీలించి ఈ వివరాలను విడుదల చేశారు. దీని దృష్ట్యా జిల్లా యంత్రాంగం, ప్రజలు మేల్కొని కరోనా సెకండ్‌ వేవ్‌ని కట్టడి చేయకపోతే మరింత ఆందోళనకరమైన పరిస్థితులు తలెత్తే అవకాశం లేకపోలేదు. కరోనా సెకండ్‌ వేవ్‌ జిల్లాలో మార్చి 15వ తేదీ తర్వాత ప్రారంభమైంది. అప్పటివరకు నిత్యం 100 లోపే నమోదు అవుతూ వస్తున్న పాజిటివ్‌ కేసులు ఆ తర్వాత వేలల్లోకి వెళ్లిపోయాయి. ఏప్రిల్‌ 13 నుంచి 19వ తేదీల మధ్యన 5,627, అదే నెల 20 నుంచి 26వ తేదీ మధ్యన ఇంచుమించు రెట్టింపు స్థాయిలో 10,248 నమోదు అయ్యాయి. ఇక ఏప్రిల్‌ 27 నుంచి మే 3వ తేదీ మధ్యన మరింత పెరిగి 12,967 కేసులు వచ్చాయి. 4, 5 తేదీల్లో 2 వేలకు పైగా, 6వ తేదీన 1,348 కొత్త కేసులు నమోదు అయ్యాయి. 


కర్ఫ్యూ ప్రభావంతో కేసులు తగ్గేనా!

జిల్లా వ్యాప్తంగా బుధవారం నుంచి మధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలు జరుగుతోంది. దీంతో అన్ని వ్యాపార దుకాణాలు మూసేస్తున్నారు. కేవలం అత్యవసర సర్వీసులను మాత్రమే అనుమతిస్తున్నారు.  పోలీసులు ఎక్కడికక్కడ పికెట్లు ఏర్పాటు చేసి అనుమతి లేని వాహనాలను సీజ్‌ చేస్తున్నారు. అలానే గుంటూరు నగరంలో అత్యంత రద్దీగా ఉండే పట్నంబజారు, ఏలూరుబజారు, లాలాపేట, పండ్ల మార్కెట్‌, చేపల మార్కెట్‌ జోన్‌లోకి వాహనాల రాకపోకలను నిషేధించడం ప్రారంభించారు. కర్ఫ్యూ సడలింపు సమయంలో రద్దీని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకొన్నారు. రెండు రోజుల తర్వాత కర్ఫ్యూ వలన వైరస్‌ వ్యాప్తి ఏమైనా తగ్గిందా, లేదా అనేది తెలుస్తుంది. ఒకవేళ కేసుల సంఖ్య తగ్గకపోతే కర్ఫ్యూ సడలింపు సమయాన్ని మరింతగా కుదించే అవకాశం కూడా లేకపోలేదు. 

Updated Date - 2021-05-07T05:41:00+05:30 IST