నరేంద్రమోదీ ఆదర్శప్రాయంగా నిలిచారు...

ABN , First Publish Date - 2021-10-22T18:18:28+05:30 IST

దేశంలో 100 కోట్ల మందికి కొవిడ్‌ టీకాలు వేయడం ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచానికే ఆదర్శప్రాయంగా నిలిచారని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై ప్రశంసలు గుప్పించారు. హుబ్లీలో గురువారం ఆయన మీడియా

నరేంద్రమోదీ ఆదర్శప్రాయంగా నిలిచారు...

- చారిత్రాత్మకమన్న సీఎం, పలువురు బీజేపీ నేతలు

- రాష్ట్రంలో పలు చోట్ల సంబరాలు


Bengaluru: దేశంలో 100 కోట్ల మందికి కొవిడ్‌ టీకాలు వేయడం ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచానికే ఆదర్శప్రాయంగా నిలిచారని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై ప్రశంసలు గుప్పించారు. హుబ్లీలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కొవిడ్‌ వ్యాక్సిన్‌ల విషయంలో ప్రపంచంలో ఏదేశం సాధించని గొప్ప విజయాన్ని భారత్‌ అందుకోవడం గర్వంగా ఉందన్నారు. మాజీ ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప గురువారం ఒక ట్వీట్‌ చేస్తూ 100 కోట్ల డోస్‌లు దేశ చరిత్రలో ఓ అపురూప ఘట్టమన్నారు. 100 కోట్ల మందికి టీకాలు వేయడం సామాన్య విషయం కాదన్నారు. పైగా ఇందుకైన ఖర్చంతా కేంద్రమే భరించిందని గుర్తు చేశారు. దేశంలో 130 కోట్ల మంది ప్రజల భద్రతకు, ఆరోగ్య సంరక్షణకు మోదీ తీసుకుంటున్న చర్యలు ఎంతగా ప్రశంశించినా తక్కువేనన్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి నగరంలో గురువారం మీడియాతో మాట్లాడుతూ 100 కోట్ల మంది వ్యాక్సిన్‌ దేశ ప్రజల గెలుపుగా అభివర్ణించారు. వ్యాక్సిన్లకు సంబంధించి కాంగ్రెస్‌ చేస్తూ వచ్చిన చౌకబారు విమర్శలకు ప్రధాని మోదీ చేతలతో ధీటైన సమాధానమిచ్చామన్నారు. రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి సుధాకర్‌ 100 కోట్ల వ్యాక్సిన్‌ల విజయంలో కర్ణాటక పాత్ర కూడా చాలా ప్రముఖమన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 4 కోట్ల మందికి పైగా వ్యాక్సిన్లు వేయడం పూర్తయిందన్నారు. 100 కోట్ల మందికి వ్యాక్సిన్లు పూర్తయిన సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో పలు చోట్ల సంబరాలు జరిగాయి. 


Updated Date - 2021-10-22T18:18:28+05:30 IST