ఊపందుకున్న టీకా పంపిణీ

ABN , First Publish Date - 2021-06-13T17:15:56+05:30 IST

రాష్ట్రవ్యాప్తంగా కరోనా టీకా పంపిణీ కార్యక్రమం శనివారం ఊపందుకుంది. వ్యాక్సిన్‌ కేంద్రాల వద్ద తెల్లవారుజామున 5 గంటల నుంచే క్యూలైన్లలో వేచి ఉన్న ప్రజలు పోటీపడి టీకా వేయించుకున్నారు. టీ

ఊపందుకున్న టీకా పంపిణీ

 - తెల్లవారుజాము నుంచే బారులు తీరిన ప్రజలు

 - రాష్ట్రవ్యాప్తంగా కిటకిటలాడిన కేంద్రాలు


చెన్నై: రాష్ట్రవ్యాప్తంగా కరోనా టీకా పంపిణీ కార్యక్రమం శనివారం ఊపందుకుంది. వ్యాక్సిన్‌ కేంద్రాల వద్ద తెల్లవారుజామున 5 గంటల నుంచే క్యూలైన్లలో వేచి ఉన్న ప్రజలు పోటీపడి టీకా వేయించుకున్నారు. టీకా స్వీకరించేందుకు ఆదిలో విముఖత చూపిన ప్రజలు.. ప్రస్తుతం దాని ప్రాధాన్యత తెలియడంతో దానిని తీసుకునేందుకు పోటీ పడుతున్నారు. తొలుత 45 ఏళ్లు పైబడిన వారికి టీకా ఇచ్చేందుకు ప్రాధాన్యత ఇచ్చిన ప్రభుత్వాలు.. ఆ తరువాత 18 ఏళ్లు పైబడిన వారికి కూడా టీకాలు వేస్తున్నాయి. ఈ క్రమంలో, రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం గణాంకాల ప్రకారం 98 లక్షల మందికి టీకాలు వేశారు. అదే సమయంలో కేంద్రప్రభుత్వం నుంచి ఆశించిన టీకాలు రాకపోవడంతో నాలుగు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా టీకాల కేంద్రాలు మూతపడ్డాయి. శుక్రవారం చెన్నైలో మాత్రమే సుమారు 2,500 మందికి టీకాలు వేయగలిగారు. ఈ నేపథ్యంలో శుక్ర, శనివారాల్లో సుమారు 5 లక్షల టీకాలు హైదరాబాద్‌, పుణె నుంచి దిగుమతి కావడంతో శనివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ జోరందుకుంది. తెల్లవారుజామున 5 గంటల నుంచే ప్రజలు కేంద్రాల వద్ద క్యూలైన్లలో వేచివుండి వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. మరోవైపు సంచార వాహనాల ద్వారా కూడా వ్యాక్సిన్‌ వేసే కార్యక్రమాన్ని ఆరోగ్యశాఖ చేపట్టింది. ప్రస్తుతమున్న టీకా నిల్వలు మరో నాలుగు రోజుల పాటు సరిపోతాయని, ఆ తరువాత మళ్లీ మరికొన్ని టీకాలు రానున్నాయని అధికారులు తెలిపారు. ఈ నెలాఖరుకు మొత్తం 35 లక్షల వరకు టీకాలు వచ్చే అవకాశముందని వారు వివరించారు.


రాష్ట్రానికి చేరిన మరో 4.26 లక్షల టీకాలు

రాష్ట్రానికి మరో 4.26 లక్షల కరోనా టీకాలను కేంద్ర ప్రభుత్వం పంపించింది. రాష్ట్రంలో కరోనా టీకాల కొరత పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం 1.3 కోట్ల మేరకు కొనుగోలు చేసిన రెండు రోజులపాటు టీకాలు వేసింది. ఆ తర్వాత అన్ని చోటా వ్యాక్సినేషన్‌ ఆగిపోయింది. ఈ పరిస్థితులను కేంద్రానికి వివరించి తక్షణమే టీకాలు పంపాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఆ మేరకు శనివారం ఉదయం 1.26 లక్షల కొవాగ్జిన్‌ డోసులు విమానం ద్వారా చెన్నై నగరానికి చేరాయి. సాయంత్రం 5.30 గంటలకు 3లక్షల కొవీషీల్డ్‌ డోసులు నగరానికి సరఫరా అయ్యాయి. 

Updated Date - 2021-06-13T17:15:56+05:30 IST