కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రారంభం

ABN , First Publish Date - 2021-01-17T06:00:10+05:30 IST

జిల్లాలో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ శనివారం ప్రారంభమైంది. తొలిరోజు 1,425 మంది టీకా వేయించుకున్నారు

కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రారంభం
సీఎస్‌ ఆర్‌ఎంవో డా.హేమ నళినికి టీకా వేస్తున్న సిబ్బంది

  1. తొలిరోజు 1,425 మందికి.. 
  2. జీజీహెచ్‌లో ప్రారంభించిన కలెక్టర్‌, ఎమ్మెల్యేలు
  3. సీఎస్‌ ఆర్‌ఎంవో డాక్టర్‌ హేమనళినికి తొలి టీకా


కర్నూలు(హాస్పిటల్‌), జనవరి 16: జిల్లాలో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ శనివారం ప్రారంభమైంది. తొలిరోజు 1,425 మంది టీకా వేయించుకున్నారు. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల పాతగైనిక్‌ ఓపీ సెంటర్‌లో తొలి విడత హెల్త్‌ వర్కర్లకు టీకా వేశారు. కలెక్టర్‌ జి.వీరపాండియన్‌, పాణ్యం, కోడుమూరు ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్‌ రెడ్డి, సుధాకర్‌, ఎస్పీ ఫక్కీరప్ప, జేసీ రామసుందర్‌ రెడ్డి, నగర పాలక సంస్థ కమిషనర్‌ డీకే బాలాజీ, ట్రైనీ కలెక్టర్‌ నిధి మీనా ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉదయం 10.30 గంటలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సందేశం ఇచ్చారు. 11.10 గంటలకు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి సీఎస్‌ ఆర్‌ఎంవో డాక్టర్‌ బి.హేమనళినికి తొలి టీకాను కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ఆఫీసర్‌ సరళ కుమారి వేశారు. అనంతరం ఆర్థోపెడిక్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డా.శ్యాంధర్‌కు రెండో టీకా, పల్మనాలజీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డా.సరితకు మూడో టీకాను వేశారు. 


కరోనా సమయంలో వైద్య ఆరోగ్య సిబ్బంది ప్రాణాలను పణంగా పెట్టి సేవలు అందించారని కలెక్టర్‌ వీరపాండియన్‌ గుర్తు చేశారు. అందుకే హెల్త్‌కేర్‌ వర్కర్స్‌కు వ్యాక్సినేషన్‌లో ప్రభుత్వం మొదటి ప్రాధాన్యం ఇచ్చిందని అన్నారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య విభాగాల్లో పని చేస్తున్న 35,470 మంది హెల్త్‌ వర్కర్స్‌కు తొలి విడత వ్యాక్సినేషన్‌ ఇస్తున్నామని తెలిపారు. మొత్తం 147 టీకా కేంద్రాలు ద్వారా వైద్య సిబ్బందికి వ్యాక్సిన్‌ వేస్తున్నామని తెలిపారు. రెండో విడతలో నాలుగు శాఖల ఫ్రంట్‌ లైన్‌ సిబ్బంది 47,037 మందికి టీకా వేయిస్తామని, ఇందుకోసం 199 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మూడో విడతలో 1531 టీకా కేంద్రాల ద్వారా 50 సంవత్సరాలు దాటిన, కొమార్చిడ్‌ జబ్బులతో బాధపడుతున్న 5,57,080 మందికి టీకా వేయిస్తామని తెలిపారు. 

కర్నూలు జీజీహెచ్‌లో నెట్‌ సర్వర్‌ డౌన్‌ కావడంతో ప్రధాని మోదీ ప్రసంగం వినేందుకు ఇబ్బందులు తలెత్తాయి. ఉదయం 10.30 గంటలకు ప్రధాని ప్రసంగం మొదలైంది. జీజీహెచ్‌లో వీడియో కాన్ఫరెన్స్‌ ఉదయం 10.45 గంటలకు మొదలైంది. కలెక్టర్‌, అధికారులు కూర్చోగానే 10.51 గంటలకు మరోమారు అంతరాయం ఏర్పడింది. మరో నాలుగు నిమిషాలకు పునరుద్ధరించారు. 

డీఎంహెచ్‌వో డా.బి.రామగిడ్డయ్య, డీఐవో డా.విశ్వేశ్వరరెడ్డి, కర్నూలు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డా.జి.నరేంద్రనాథ్‌ రెడ్డి, కేఎంసీ ప్రిన్సిపాల్‌ డా.పీఎన్‌ జిక్కి, డిప్యూటీ సూపరింటెండెంట్‌ డా.సి.ప్రభాకర్‌ రెడ్డి, డా.ఏ.భగవాన్‌ తదితరులు పాల్గొన్నారు. 

నగరంలోని రోజా వీధి అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌లో తొలిరోజున 37 మందికి నలుగురు వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. కర్నూలు జీజీహెచ్‌కు చెందిన సీనియర్‌ అసిస్టెంట్‌ ముక్తియార్‌ హుశేన్‌కు ఆఫీసర్‌ శోభారాణి టీకాను వేశారు. కర్నూలు నగర మున్సిపల్‌ హెల్త్‌ ఆఫీసర్‌ డా.భాస్కర్‌ రెడ్డి మాట్లాడుతూ తొలివిడతలో హెల్త్‌కేర్‌ వర్కర్లకు టీకాను వేస్తామన్నారు. కార్యక్రమంలో కర్నూలు అర్బన్‌ తహసీల్దార్‌ తిరుపతిసాయి, కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ఆఫీసర్లు శివజ్యోతి, ఈనా, మెడికల్‌ ఆఫీసర్‌ డా.మధు, సీమెచ్‌వో సుభాన్‌, స్టాఫ్‌నర్సు గాయత్రి, అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలు రుక్మిణి, భూలక్ష్మి పాల్గొన్నారు. 

రోజావీధి అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ కొవిడ్‌ టీకా పంపిణీ కేంద్రాన్ని శనివారం మధ్యాహ్నం కలెక్టర్‌ వీర పాండియన్‌, జేసీ రామసుందర్‌రెడ్డి అకస్మికంగా తనిఖీ చేశారు. రెగ్యులర్‌ ఓపీకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సచివాలయం 12లో నిర్వహించాలని కలెక్టర్‌ సిబ్బందిని ఆదేశించారు. అనంతరం 123, 124 వార్డు సచివాలయాలను కలెక్టర్‌, జేసీ, కర్నూలు నగర పాలక సంస్థ కమిషనర్‌ డీకే బాలాజి తనిఖీ చేశారు.


జిల్లా మొత్తం టీకా వేసిన కేంద్రాలు.. వివరాలు 

కేంద్రం                 అలాట్‌     వేసినది

సీహెచ్‌సీ నందికొట్కూరు 100             62

పీహెచ్‌సీ పాములపాడు 100             65

సీహెచ్‌సీ ఆత్మకూరు 100             36

పీహెచ్‌సీ వెలుగోడు 100             80

పీపీయూ నంద్యాల         101             37

యూపీహెచ్‌సీ దళితవాడ 100             33

సీహెచ్‌సీ ఆళ్లగడ్డ         100             43

పీహెచ్‌సీ చాగలమర్రి 100             76

పీపీయూ ఆదోని         100             48

యూపీహెచ్‌సీ అరుంధతినగర్‌ 100     38

సీహెచ్‌సీ ఎమ్మిగనూరు         31      23

పీహెచ్‌సీ గోనెగండ్ల                 100     35

పీహెచ్‌సీ మద్దికెర                    99     79

పీహెచ్‌సీ తుగ్గలి                     100    59

పీహెచ్‌సీ సి.బెళగల్‌            100    65

పీహెచ్‌సీ గూడూరు                 101     69

ఓల్డ్‌ గైనిక్‌ బ్లాక్‌, కర్నూలు         100 22

యూపీహెచ్‌సీ రోజా-1         37 4

సీహెచ్‌సీ బనగానపల్లె         55 33

పీహెచ్‌సీ రేవనూరు         100 55

పీహెచ్‌సీ చిన్నమల్కాపురం     100 70

పీహెచ్‌సీ ప్యాపిలి             100 69

పీహెచ్‌సీ నన్నూరు     100 48

సీహెచ్‌సీ పాణ్యం             100 100

పీహెచ్‌సీ ఆస్పరి             100 65

పీహెచ్‌సీ కల్లుదేవకుంట్ల     100 41

పీహెచ్‌సీ కోసిగి             100 70

మొత్తం                2,524 1,425


కొవిడ్‌ టీకాతో రక్షణ

కొవిడ్‌ టీకా ఎంతో సురక్షితమైంది. హెల్త్‌వర్కర్లు, ఫ్రంట్‌ లైన్‌ వర్కర్లకు ఆఫీసర్‌ సరళ వ్యాక్సిన్‌ వేశారు. తొలి టీకా తీసుకున్నా. అరగంట తర్వాత కూడా ఆరోగ్యంగా ఉన్నా. - డా.బి.హేమనళిని, సీఎస్‌ఆర్‌ఎంవో, కర్నూలు జీజీహెచ్‌ 


అదృష్టంగా భావిస్తున్నా 

ఎంతోమంది ప్రాణాలను బలిగొన్న కరోనాను అంతమొందించే వ్యాక్సిన్‌ రావడం ఆనందంగా ఉంది. కొవిడ్‌ టీకాను మొట్టమొదటి రోజు తీసుకోవడం అదృష్టంగా భావిస్తున్నా. కరోనా సమయంలో ఎంతోమం దికి సేవలు అందించిన మాకు ప్రభుత్వం ప్రాధాన్యం కల్పించి టీకా ఇవ్వడం సంతోషంగా ఉంది. - డా.సరిత శ్యామేల్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, పల్మనాలజీ, కర్నూలు జీజీహెచ్‌


ప్రజల్లో ధైర్యం నింపేందుకే..

ప్రజల్లో ధైర్యం నింపేందుకే జీజీహెచ్‌లో టీకాను తీసుకున్నాను. కొవిడ్‌ కేర్‌ హాస్పిటల్‌లో కరోనా బాదితులకు చికిత్స చేస్తుండగా నాకూ పాజిటివ్‌ వచ్చింది. వ్యాక్సిన్‌ను అందరూ వేయించుకోవాలి. 

- డా.శ్యాంధర్‌, ఆర్థోపెడిక్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ 


వ్యాక్సినేషన్‌ విజయవంతం

తొలిరోజు వ్యాక్సినేషన్‌ విజయవంతమైనట్లు డీఎంహెచ్‌వో రామగిడ్డయ్య తెలిపారు. జిల్లాలోని 218 ప్రభుత్వ ఆసుపత్రులు, అర్బన్‌ హెల్త్‌ సెంటర్లలో 2,524 మంది హెల్త్‌ వర్కర్లకు వ్యాక్సిన్‌ వేయాల్సి ఉండగా.. శనివారం 1,425 మందికి టీకా వేసినట్లు చెప్పారు. ప్రతి కేంద్రంలో వంద మందికి టీకా వేయాల్సి ఉందని, పాణ్యం సీహెచ్‌సీలో అత్యధికంగా 100 మందికి, వెలుగోడు సీహెచ్‌సీలో 80 మందికి టీకాలు వేశారు. అత్యల్పంగా నగరంలోని అర్బన్‌ హెల్త్‌ సెంటర్లలో 37 మందికి నలుగురు టీకా వేయించుకున్నారు.

 

ఎనిమిది కరోనా కేసులు 

జిల్లాలో మరో 8 మంది కరోనా వైరస్‌ బారిన పడ్డారు. దీంతో బాధితుల సంఖ్య 60,733కు చేరింది. ఇందులో 97 యాక్టివ్‌ కేసులు కాగా ఇప్పటివరకు 60,139 మంది డిశ్చార్జి అయ్యారు.



Updated Date - 2021-01-17T06:00:10+05:30 IST