ltrScrptTheme3

100 శాతం టీకా ఇంకెంత దూరం?

Oct 26 2021 @ 00:57AM

రెండు డోస్‌లూ తీసుకున్నవారు 16,51,979 మంది మాత్రమే

ఒక్క డోసే తీసుకున్నవారు 28,75,866 మంది 

వ్యాక్సిన్‌కు దూరంగా 4,72,155 మంది 


‘నెలల తరబడి ఇంటింటి సర్వే కొనసాగుతున్నా కరోనా వ్యాక్సిన్‌ వేయించుకోనివారు ఎందుకు ఉన్నారు? కుటుంబంలో 45 ఏళ్ల వయసు పైబడినవారు టీకాలు వేయించుకోగా.. అదే కుటుంబంలో 18 నుంచి 44 సంవత్సరాల వయసువారు ఎందుకు టీకాలు తీసుకోవడం లేదు? లక్ష్య సాధనలో పెండింగ్‌ ఉండటానికి వీల్లేదు. జిల్లావ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ శాతం రోజురోజుకూ పెరగాల్సిందే...’ - వ్యాక్సినేషన్‌ ప్రక్రియపై కలెక్టర్‌ నివాస్‌ 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : జిల్లాలో 50 లక్షల మందికి కొవిడ్‌ వ్యాక్సిన్‌ అందించాలనేది లక్ష్యం కాగా.. అధికారిక గణాంకాల ప్రకారం ఇప్పటి వరకు 16,51,979 మందికి మాత్రమే రెండు డోసుల వ్యాక్సిన్‌ ఇచ్చారు. 28,75,866 మంది మొదటి డోసు మాత్రమే తీసుకున్నారు. ఎక్కువ మంది వ్యాక్సిన్‌ తీసుకునేందుకు నిరాకరిస్తున్నట్టు వార్డు వలంటీర్లు, వైద్య సిబ్బంది చెబుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా ఉన్న సచివాలయాలకు లక్ష్యాలను నిర్దేశించి వ్యాక్సినేషన్‌ ప్రక్రియను 100 శాతం పూర్తి చేసేలా జిల్లా అధికారులు కిందిస్థాయి అధికారులు, సిబ్బందిని పరుగులు తీయిస్తున్నారు. సరఫరా అవుతున్న వ్యాక్సిన్‌ డోసులను ఏరోజుకారోజే వినియోగించాలంటూ సచివాలయాలకు లక్ష్యాలను నిర్దేశిస్తున్నారు. అయినా జిల్లాలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వంద శాతానికి దూరంగానే ఉంది.


185 సచివాలయాల్లోనే వంద శాతం 

జిల్లావ్యాప్తంగా మొత్తం 1,285 గ్రామ, వార్డు సచివాలయాలు ఉన్నాయి. వాటిలో ఇప్పటి వరకు 185 సచివాలయాల్లో మాత్రమే 100 శాతం వ్యాక్సినేషన్‌ పూర్తయింది. ఇంకా 1100 సచివాలయాల్లో వ్యాక్సినేషన్‌ పెండింగ్‌లోనే ఉంది. వీటిలో కూడా గ్రామ సచివాలయాల్లో పరిస్థితి కొంత మెరుగ్గానే ఉండగా.. విజయవాడ నగరం సహా జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో ఎక్కువ పెండింగ్‌ ఉన్నట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి.  


ప్రజల్లో చైతన్యం వచ్చినా నత్తనడకే.. 

జిల్లాలో ఈ ఏడాది జనవరి 16న కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభం కాగా, తొలినాళ్లలో ప్రజలకు సరైన అవగాహన లేక దూరంగా ఉండిపోయారు. ఏప్రిల్‌, మే మాసాల్లో కరోనా సెకండ్‌ వేవ్‌ సృష్టించిన విలయంతో ప్రజలు అప్రమత్తమయ్యారు. కరోనా రక్కసి నుంచి కాపాడేది వ్యాక్సిన్‌ ఒక్కటేనని వైద్యనిపుణులు విస్తృతంగా ప్రచారం చేయడంతో ప్రజలు టీకా తీసుకునేందుకు ముందుకొచ్చారు. వ్యాక్సిన్‌ కొరత కారణంగా ఒక దశలో కొవిడ్‌ టీకాలకు ఎక్కడ లేని డిమాండ్‌ ఏర్పడింది. తదనంతర కాలంలో కేంద్ర ప్రభుత్వం నుంచి కరోనా వ్యాక్సిన్‌ సరఫరా క్రమంగా పెరిగింది. మొదట్లో ప్రత్యేక కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ సెంటర్లను ఏర్పాటు చేసి, ప్రజలకు టీకా ఇచ్చిన జిల్లా యంత్రాంగం.. ఇప్పుడు గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఈ కార్యక్రమాన్ని వేగవంతం చేసింది. ఆయా సచివాలయాల పరిధిలో ఉన్న అర్హులైనవారందరికీ వ్యాక్సినేషన్‌ ఇచ్చేలా, జిల్లా అధికారులు లక్ష్యాలను నిర్దేశించారు. మధ్యలో ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించి, ఒకేరోజు ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు లక్ష డోసులకు పైగా పంపిణీ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయినా ఇంకా జిల్లాలో దాదాపు ఐదు లక్షల మంది ఒక్క డోసు కూడా తీసుకోకపోవడం, రెండో డోసు తీసుకోవలసినవారు అత్యధికంగా ఉండడం అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది. 


కారణాలెన్నో.. 

జిల్లాలో ఇంకా 4,72,155 మంది కొవిడ్‌ టీకాలకు దూరంగా ఉండిపోవడానికి వైద్యసిబ్బంది రకరకాల కారణాలు చెబుతున్నారు. ప్రస్తుతం కరోనా సెకండ్‌ వేవ్‌ తగ్గుముఖం పట్టడంతో ఇక వైరస్‌ తగ్గిపోయిందనే భావనతో చాలామంది ముందుకు రావడం లేదని చెబుతున్నారు. అలాగే మొదటి డోసు తీసుకున్నవారిలో ఎక్కువ మంది నిర్ణీత గడువు పూర్తయినప్పటికీ రెండో డోసు తీసుకోవడంలో అశ్రద్ధ వహిస్తున్నారని, ఇంకొందరు గడువు ఉండటం వల్ల సెకండ్‌ డోస్‌ కోసం వెయిటింగ్‌లో ఉన్నారని వైద్య సిబ్బంది చెబుతున్నారు. అలాగే ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినవారి వివరాలు వెబ్‌సైట్‌లో పెండింగ్‌ చూపిస్తున్నాయనేది కూడా వైద్యసిబ్బంది వాదన. అయితే అధికారులు ఈ సమాధానాలతో సంతృప్తి చెందడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ సంతృప్తికరంగా ఉండగా, అర్బన్‌లో ఎక్కువ పెండింగ్‌ ఉంటోందని, ఇందుకు సచివాలయాల అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని అంటున్నారు. అందుకే ఉన్నతాధికారులు అర్బన్‌ సచివాలయాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.  


ఇంటింటి సర్వే ద్వారా వంద శాతం వ్యాక్సినేషన్‌

ఇంటింటి సర్వే ద్వారా వంద శాతం వ్యాక్సినేషన్‌ పూర్తి చేయడంపై అధికారులు దృష్టి సారించారు. ఇందులో భాగంగా గృహాల మ్యాపింగ్‌కు వినియోగించే యాప్‌పై విజయవాడ సబ్‌ కలెక్టర్‌ జి.ఎస్‌.ఎస్‌.ప్రవీణ్‌చంద్‌ ఆదివారం నగరంలోని పలువురు వలంటీర్లకు అవగాహన కల్పించారు. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.