Advertisement

ఇదేం యాతన

Apr 23 2021 @ 01:32AM
కాకినాడ రంగరాయ మెడికల్‌ కళాశాలలో గురువారం వ్యాక్సిన్‌ కోసం క్యూలో నిలబడిన జనం

  • కొవిడ్‌ రెండో డోసు వ్యాక్సిన్‌ కోసం జనం అగచాట్లు
  • చాలినన్ని డోసులు రాక ఎక్కడికక్కడ ఎగబడ్డ జనం
  • కాకినాడ ఆర్‌ఎంసీలో తీవ్ర గందరగోళంతో తోపులాట
  • అటు వందల్లో నమోదవుతున్న కేసులు.. గురువారం 992 మందికి పాజిటివ్‌
  • వైరస్‌ బారినపడుతున్న వారిలో ఎక్కువ మందికి దగ్గు, జ్వరం, ఒళ్లునొప్పులు
  • అంతకుమించి సమస్యలున్న వారిని ప్రభుత్వ ఆసుపత్రులకు తరలింపు
  • మరోపక్క వైరస్‌ భయంతో క్రమేపీ మూతపడుతున్న ప్రైవేటు క్లినిక్‌లు
  • ఇతర అనారోగ్య సమస్యలొస్తే వైద్యులు దొరక్క అల్లాడుతున్న జనం

కొవిడ్‌ వ్యాక్సిన్‌ కోసం జనం అగచాట్లు పడుతున్నారు. డిమాండ్‌కు సరిపడా వ్యాక్సిన్లు అందుబాటులో లేక, మొదటి డోసు పూర్తయిన వారికి రెండో డోసు దొరక్క నరకయాతన పడుతున్నారు. మలివిడత డోస్‌కు సమయం మించిపోవడం, డిమాండ్‌కు తగ్గ లభ్యత లేకపోవడంతో ఉన్న కొద్దిపాటి డోసుల కోసం బారులు తీరుతున్నారు.  అటు జిల్లాలో పాజిటివ్‌ల పరంపర కొనసాగుతోంది. వేలల్లో కేసులు వస్తుండడంతో ఆసుపత్రుల్లో పడకలు నిండిపోతున్నాయి. దీంతో హోంఐసోలేషన్‌కు ప్రాధాన్యత ఇస్తున్నారు. రోజువారీ వస్తున్న పాజిటివ్‌ల్లో ఎక్కువ మందికి దగ్గు, జ్వరం, ఒళ్లు నొప్పులు కనిపిస్తుండడంతో ఇంట్లో  చికిత్సకు అనుమతిస్తున్నారు. మరోపక్క వైరస్‌ మహమ్మారి పల్లె, పట్టణం, నగరం తేడా లేకుండా చుట్టేస్తుండడంతో ఆయా ప్రాంతాల్లో చిన్నచిన్న హెల్త్‌ క్లినిక్కులు మూత పడుతున్నాయి. వైరస్‌ భయంతో అనేకమంది వైద్యులు సేవలు అందించడం లేదు. దీంతో ఇతర అనారోగ్య సమస్యలు వస్తే ఏంచేయాలో తెలీక జనం ఇబ్బందులు పడుతున్నారు.

(కాకినాడ-ఆంధ్రజ్యోతి)

జిల్లాలో కొవిడ్‌ వ్యాక్సిన్‌ కొరతతో జనం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలినంత స్టాకు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో లేకపోవడంతో అల్లాడుతున్నారు. ఒకపక్క వైరస్‌ దాడి తీవ్రంగా ఉండడంతో వ్యాక్సిన్‌ తీసుకుంటే కొంతలో కొంత రక్షణగా ఉంటుందనే ఉద్దేశంతో వ్యాక్సిన్‌ వైపు మొగ్గుచూపుతున్నారు. తీరా అవి అందుబాటులో లేకపోవడంతో ఎదురుచూపులు చూస్తున్నారు. ఇప్పటివరకు దాదాపుగా 14 లక్షల మందికి వ్యాక్సిన్లు అందించారు. జిల్లా జనాభాతో పోల్చితే ఇవి ఏమూలకు చాలని పరిస్థితి. అటు ఇప్పటికే తొలి డోసు వేసుకున్న వారికి మలి డోస్‌కు సమయం అయిపోయినా వ్యాక్సిన్‌ రాలేదు. చాలారోజుల నిరీక్షణ తర్వాత 35 వేల సెకండ్‌ డోస్‌ వ్యాక్సిన్లు జిల్లాకు రావడంతో గురువారం జిల్లాలో 174 కేంద్రాల్లో వీటిని పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేశారు. అయితే అనేక చోట్ల గందరగోళం చోటుచేసుకుంది. ఈ డోస్‌ కోసం ఎక్కడికక్కడ జనం పోటెత్తారు. తమకంటే తమకు వ్యాక్సిన్‌ గడువు అయిపోయిందని ఎగబడ్డారు. దీంతో ఎవరికి వ్యాక్సిన్‌ ఇవ్వాలో వద్దో తెలియక అనేకచోట్ల పరిస్థితి గందరగోళంగా మారింది. ముఖ్యంగా కాకినాడ రంగరాయ మెడికల్‌ కాలేజీ వద్ద వ్యాక్సిన్‌ కేంద్రం వద్ద రెండు వేల వరకు వరకు వ్యాక్సిన్లు అందుబాటులో ఉంటే అయిదు వేల వరకు జనం వచ్చేశారు. దీంతో తోపులాట చోటుచేసుకుంది. భానుగుడి-నాగమల్లితోట జంక్షన్‌ రోడ్డులో చాలాసేపు ట్రాఫిక్‌ నిలిచిపోయింది. వ్యాక్సిన్‌ కేంద్రంలో లోపల, బయట జనం ఉండిపోవడం తో పోలీసులు వచ్చి అదుపులోకి తీసుకువచ్చారు. అయితే గురువారం జిల్లావ్యాప్తంగా 174 కేంద్రాల్లో 27,235 మందికి సెకండ్‌ డోస్‌ వ్యాక్సిన్‌ అందించినట్టు అధికారులు పేర్కొన్నారు. అయితే మలివిడత డోసు కావలసిన వారి సంఖ్య ఇంకా వేలల్లో ఉంది. ఈ నేపథ్యంలో మళ్లీ టీకా ఎప్పుడు వస్తుం దో తెలియని పరిస్థితి. కాగా జిల్లాలో మళ్లీ వ్యాక్సిన్‌ సున్నా స్థాయికి చేరింది. కేంద్రం నుంచి వస్తేనేగాని మళ్లీ అందించే పరిస్థితి లేదు. ఈలోగా ఈనెల 28 నుంచి 18 ఏళ్లు నిండినవాళ్లు వ్యాక్సిన్‌ తీసుకోవడానికి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని కేంద్రం ప్రకటించింది. వ్యాక్సిన్‌ కోసం మళ్లీ ఎగబడాల్సిన పరిస్థితి. 

పిట్టల్లా రాలిపోతున్నారు...

కొవిడ్‌ కేసులు జిల్లాలో రోజూ వందల్లోనే నమోదవుతున్నాయి. దీంతో వరుసగా బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. అటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పడకలు నిండిపోతుండడంతో 90 శాతం హోంఐసోలేషన్‌కు ప్రాధాన్యత ఇస్తున్నారు. ముఖ్యంగా జలుబు, దగ్గు, జ్వరం, ఒళ్లునొప్పులు తదితర లక్షణాలున్న వారికి ఇంట్లోనే చికిత్స తీసుకునేలా మెడికల్‌ కిట్‌ అందిస్తున్నారు. అంతకుమించిన సమస్యలుంటే జీజీహెచ్‌, డీహెచ్‌, కిమ్స్‌కు సిఫార్సు చేస్తున్నారు. కాగా చాలామంది కొవిడ్‌తో ఆరోగ్యం విషమించి కన్నుమూస్తున్న ఘటనలు జిల్లాలో క్రమే పీ పెరుగుతున్నాయి. జగ్గంపేటకు చెందిన దంత వైద్యుడు తక్కువ వయస్సులోనే కొవిడ్‌బారిన పడి ఆరోగ్యం విషమించి కన్నుమూశాడు. బుధవారం ఒక్కరోజే కొవిడ్‌తో నలుగురు మృతిచెందగా, గురువారం మరో ఇద్దరు చనిపోయారు. దీంతో జిల్లాలో కొవిడ్‌ మరణాల సంఖ్య 645కు చేరుకుంది. అటు కేసులు సైతం వరుసపెట్టి ఉధృతంగా నమోదవుతున్నాయి. గురువారం జిల్లావ్యాప్తంగా 992 మందికి వైరస్‌ సోకింది. ఇందులో అత్యధిక పాజిటివ్‌లు కాకినాడ, రాజమహేంద్రవరం, కోనసీమలో ఉన్నాయి. మొత్తం పాజిటివ్‌ల సంఖ్య జిల్లాలో 1,32,611కు చేరుకున్నాయి. ఇదంతా ఒకెత్తయితే వైరస్‌ ఉధృతితో ఎక్కువగా వైద్యులు దీని బారినపడుతున్నారు. పలుచోట్ల కన్నుమూసిన సంఘటనలు కూడా ఉన్నాయి. దీంతో జిల్లాలో అనేకచోట్ల ప్రైవేటు క్లినిక్‌లు మూసివేస్తున్నారు. కొన్నిరోజులపాటు ఓపీ సేవలు నిలిపివేస్తున్నట్టు ప్రకటిస్తూ బోర్డులు వేలాడదీస్తున్నారు. మొదట్లో కొవిడ్‌ జాగ్రత్తలతో పేషెంట్లను చూసిన వైద్యులు ఇప్పుడు వైరస్‌ తీవ్రతతో ఏకంగా మూసివేస్తూ నిర్ణయం తీసుకోవడంతో ఇతర అనారోగ్య సమస్యలున్న వారికి సమస్యలు ఎదురవుతున్నాయి. మరోపక్క కాకినాడ, రాజమహేంద్రవరం తదితర ప్రాంతాల్లో మరో 22 థియేటర్లు మూతపడ్డాయి. ఆలయాలు సైతం భక్తులు లేక కళ తప్పాయి.

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.