జీతాల్లేని జీవితాలు.. కొవిడ్‌ వారియర్స్‌కు వేతనాలివ్వని ప్రభుత్వం

ABN , First Publish Date - 2020-11-04T14:51:37+05:30 IST

ప్రాణాలకు తెగించి కరోనా విధులు నిర్వహిస్తున్న కొవిడ్‌ వారియర్స్‌ వారు..

జీతాల్లేని జీవితాలు.. కొవిడ్‌ వారియర్స్‌కు వేతనాలివ్వని ప్రభుత్వం

మూడు నెలలుగా ఇదే పరిస్థితి

కాంట్రాక్టు పద్ధతిలో ప్రాణాంతక విధులు

అయినా స్పందించని సర్కార్‌

వేతనాల కోసం వారం రోజులుగా వేడుకుంటున్న సిబ్బంది

జిల్లావ్యాప్తంగా ఆగిపోయిన ఐమాస్క్‌ బస్సులు


విజయవాడ, ఆంధ్రజ్యోతి: ప్రాణాలకు తెగించి కరోనా విధులు నిర్వహిస్తున్న కొవిడ్‌ వారియర్స్‌ వారు. ప్రమాదమని తెలిసినా.. ప్రత్యామ్నాయం లేక తాత్కాలికంగా ఈ విధుల్లో చేరారు. అలాంటి వారికి అన్నీ ఇచ్చి ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఆపదలోకి నెట్టేసింది. మూడు నెలలుగా కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు జీతాలు ఆపేయడంతో ప్రస్తుతం వారంతా వేతనాల కోసం విధులు బహిష్కరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 


కరోనా వ్యాప్తిని నియంత్రించడంతో పాటు వైరస్‌ బారినపడిన బాధితులకు మెరుగైన వైద్యసేవలందించి ప్రాణాలను కాపాడేందుకు ఎన్ని నిధులైనా ఖర్చు చేస్తామని చెబుతున్న ప్రభుత్వం సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితిలో ఉందా? ప్రభుత్వ ఖజానా మొత్తం ఖాళీ అయిపోయిందా? పరిస్థితులు చూస్తుంటే అలాగే అనిపిస్తున్నాయి. జిల్లాలో ప్రాణాలకు తెగించి కరోనా మహమ్మారితో పోరాడుతున్న ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు మూడు నెలలుగా జీతాలు లేవు. వారంతా వారం రోజులుగా జీతాల కోసం అందరినీ వేడుకుంటున్నారు. ఫలితం లేక కరోనా నిర్ధారణ పరీక్షల నిమిత్తం జిల్లావ్యాప్తంగా ప్రజల నుంచి నమూనా (స్వాబ్‌)లు సేకరించే ఐమాక్స్‌ బస్సులను మంగళవారం నిలిపివేశారు. నెలకు రూ.15వేల నుంచి రూ.20వేల వరకు జీతాలు చెల్లించేలా, కాంట్రాక్టు పద్ధతిలో తాత్కాలిక ప్రాతిపదికన కొవిడ్‌ విధుల్లోకి తీసుకున్న ఈ సిబ్బంది జీతాలు లేక ఇతరత్రా ఉపాధి మార్గాలను వెతుక్కుంటున్నారు. 


ప్రాణాలకు తెగించి విధులు

జిల్లావ్యాప్తంగా కరోనా పరీక్షలు నిర్వహించేందుకు, స్వాబ్‌ సేకరించేందుకు, వాటిని ల్యాబ్‌లలో పరీక్షించి 24 గంటల్లోగా ఫలితాలను వెల్లడించడంతో పాటు పాజిటివ్‌ బాధితులను ఆసుపత్రుల్లో చేర్పించేందుకు జిల్లా అధికార యంత్రాంగం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది. ఇందుకు నిపుణులైన వైద్యులు మొదలు నర్సులు, ల్యాబ్‌ టెక్నీషియన్లు, డేటా ఆపరేటర్లు, ఎంఎన్‌వోలు, ఎఫ్‌ఎన్‌వోలు, హాస్పిటల్‌ పారిశుధ్య సిబ్బంది వెంటనే కావాలంటూ కలెక్టర్‌ ఇంతియాజ్‌ రెండు, మూడు విడతలుగా వాక్‌-ఇన్‌-ఇంటర్వ్యూలు నిర్వహించి అదనపు సిబ్బందిని నియమించారు. విజయవాడలోని రాష్ట్రస్థాయి కొవిడ్‌ ఆసుపత్రిలో, జిల్లాలోని ఇతర ప్రభుత్వ కొవిడ్‌ ఆసుపత్రుల్లో కొంతమందికి పోస్టింగ్‌ ఇచ్చారు. మరికొందరిని ఐమాక్స్‌ బస్సుల్లో కొవిడ్‌ నమూనాలు (స్వాబ్‌) తీసేందుకు కేటాయించారు. వీరు జిల్లాలో మొత్తం 24 కొవిడ్‌ ఐమాస్క్‌ బస్సుల ద్వారా నమూనాలు సేకరిస్తున్నారు. ఈ బస్సుల్లో మొత్తం 50 వైద్యబృందాలు పనిచేస్తున్నాయి. ఒక్కో బృందంలో ముగ్గురు చొప్పున 150 మంది కాంట్రాక్టు సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. 


కొవిడ్‌ ఆసుపత్రిలోని కాంట్రాక్టు సిబ్బందిదీ ఇదే దుస్థితి

విజయవాడ లోని రాష్ట్రస్థాయి కొవిడ్‌ ఆసుపత్రిలో కరోనా పాజిటివ్‌ బాధితులకు సేవలందిస్తున్న కాంట్రాక్టు వైద్య సిబ్బందికి కూడా నెలల తరబడి  జీతాలు చెల్లించడం లేదు. ప్రస్తుతం ఐమాక్స్‌ బస్సుల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు సిబ్బంది విధులను బహిష్కరించి నిరసన తెలుపుతున్న తరుణంలో కొవిడ్‌ ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఎంఎన్‌వోలు, ఎఫ్‌ఎన్‌వోలు, ఇతర సిబ్బంది కూడా ఆందోళన బాట పట్టేందుకు సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం.   


నిలిచిన ఐమాక్స్‌ బస్సులు

తమ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్దామంటే.. తాత్కాలిక ఉద్యోగాలే. ఉద్యోగ భద్రత లేకపోవడంతో గట్టిగా పోరాడలేని నిస్సహాయ స్థితిలో ఇతరత్రా ఉపాధి మార్గాలను వెతుక్కునే పనిలో పడ్డారు. దీంతో వారు పనిచేస్తున్న ఐమాక్స్‌ బస్సులు నిలిచిపోయాయి. మంగళవారం జిల్లాలో ఎక్కడా ఐమాక్స్‌ బస్సులు కనిపించకపోవడంతో ఆ వాహనాలను నిర్వహించే ఆపరేషన్స్‌ ఇన్‌చార్జి గణేశ్‌ను ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధి వివరణ కోరారు. వివరాలు చెప్పడానికి తాను ఆథరైజ్డ్‌ పర్సన్‌ను కాదని, మంగళవారం తమ మేనేజ్‌మెంట్‌ సెలవు ప్రకటించిందంటూ పొంతనలేని సమాధానాలు చెప్పారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి ఎం.సుహానిసిని వివరణ కోరేందుకు ప్రయత్నించగా, ఆమె అందుబాటులో లేరు. 

Updated Date - 2020-11-04T14:51:37+05:30 IST