‘స్పాట్‌’కు స్వస్తి.. ‘స్లాట్‌’తో కుస్తీ

ABN , First Publish Date - 2021-05-05T05:43:40+05:30 IST

కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ నమోదుకు కొత్త పద్ధతి అమల్లోకి వచ్చింది. అక్కడికక్కడే మాన్యువల్‌గా చేసే రిజిస్ట్రేషన్‌కు ప్రభుత్వం స్వస్తి పలికింది. టీకా వేయించుకొనే ప్రతిఒక్కరూ ఇక నుంచి ఆన్‌లైన్‌లో స్లాట్‌ బుకింగ్‌ చేసుకోవాల్సిందే. 18 నుంచి 44 ఏళ్లు నిండిన వారే కాకుండా.. 45 ఏళ్ల పైబడిన వారు కూడా ఈ పద్ధతినే పాటించాల్సి ఉంటుంది. మొన్నటి వరకు ఎలాంటి బుకింగ్‌ లేకుండా నేరుగా వెళ్లి వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. మంగళవారం నుంచి కొత్త పద్ధతిని ప్రభుత్వం అమలు చేస్తుండటంతో గ్రామీణులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఆన్‌లైన్‌పై అవగాహన లేనివారు మీ-సేవా కేంద్రాల్లో స్లాట్‌ బుక్‌ చేసుకుంటే రూ.50 నుంచి రూ.100 వరకు చెల్లించుకోవాల్సిందే. ఫ్రీగా వచ్చే టీకాకు ఇలా డబ్బులు చెల్లించి కొనుగోలు చేయాల్సి వస్తోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

‘స్పాట్‌’కు స్వస్తి.. ‘స్లాట్‌’తో కుస్తీ

ఇక ఆన్‌లైన్‌లో వ్యాక్సినేషన్‌ రిజిస్రేషన్‌

నేరుగా బుక్‌ చేసుకొనే విధానం బంద్‌

పరిమితంగానే టీకా ప్రక్రియ

ఒక్కో సెంటర్‌లో రోజుకు వంద మందికి మాత్రమే..

45 ఏళ్లు నిండిన వారు కూడా స్లాట్‌ బుక్‌ చేసుకోవాల్సిందే..

మీ-సేవా కేంద్రాల్లో డబ్బులు కట్టాల్సిందే..

ఇలా కష్టమేనంటున్న  గ్రామీణులు 


(ఆంధ్రజ్యోతి, భూపాలపల్లి)

స్లాట్‌ బుకింగ్‌ ద్వారా వ్యాక్సినేషన్‌ రిజిస్ర్టేషన్‌ చేసుకొనే విధానం రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. 18 నుంచి 44 ఏళ్ల వయసు వారే కాకుండా 45ఏళ్ల పైబడిన వారు కూడా టీకా తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. మొన్నటి వరకు టీకా కేంద్రాలకు ఆధార్‌ కార్డుతో వెళ్తే వివరాలు ఆన్‌లైన్‌లో నమో దు చేసుకొని టీకా ఇచ్చేవారు. మంగళవారం నుంచి స్పాట్‌ రిజిస్ట్రేషన్‌ను ప్రభుత్వ రద్దు చేసింది. స్లాట్‌ బుకింగ్‌ అమల్లోకి రావటంతో చాలా మంది టీకా కేంద్రాల నుంచి వ్యాక్సిన్‌ తీసుకోకుండా వెనుతిరిగి వెళ్లారు. ముందుగా స్లాట్‌ బుక్‌ చేసుకున్న తర్వాతే కేంద్రాలకు రావాలని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం 45ఏళ్లు పైబడిన వారికి మాత్రమే టీకా వేస్తున్నారు. టీకా కావాలంటే స్మార్ట్‌ ఫోన్‌లో ఆరోగ్య సేతు యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. కోవిన్‌ పోర్టల్‌ ద్వారా వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. ఆధార్‌ కార్డు నంబరు, జిల్లా పేరుతోపాటు ఏ కేంద్రంలో టీకా తీసుకుంటారో వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. అదే రోజు స్లాట్‌ బుక్‌ కావచ్చు. లేదంటే మరుసటి రోజు అయినా అయ్యే అవకాశం ఉంది. స్లాట్‌ బుక్‌ అయినా తేదీన కేంద్రానికి వెళ్తే టీకా వేస్తారు. ఒక సెల్‌ఫోన్‌ నంబరుతో ఐదుగురు స్లాట్‌ బుక్‌ చేసుకొనే అవకావం ఉంది. 

టీకా కోసం ఎదురుచూపు

  మే 1 నుంచి 18 ఏళ్ల నుంచి 44 ఏళ్ల వయసు వారికి టీకాలు ఇచ్చేందుకు ఆన్‌లైన్‌లో స్లాట్‌ బుక్‌ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం కోరింది. దీనికి ప్రత్యేకంగా ఆరోగ్య సేతు యాప్‌తో కోవిన్‌ పోర్టల్‌లో వ్యాక్సిన్‌ బుక్‌ చేసుకొనే సౌకర్యం కల్పించారు. మీ-సేవా కేంద్రాలు, ఆన్‌లైన్‌ కేంద్రాల్లో కూడా ఈ సేవలను అందుబాటులోకి తెచ్చారు. 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉన్నవారిలో చాలా మంది అక్షరాస్యులై ఉంటారు. యువతరం కాబట్టి స్థానికంగా ఇంటర్నెట్‌ అందుబాటులో లేకున్నప్పటికీ మండల కేంద్రాలకు వెళ్లయినా స్లాట్‌ బుక్‌ చేసుకొనే అవకాశం ఉంది. దీంతో చాలా మంది వ్యాక్సిన్‌ కోసం ఆన్‌లైన్‌లో బుకింగ్‌ చేసుకున్నారు. భూపాలపల్లి, ములుగు జిల్లాల నుంచి 25 వేలకు పైగా దరఖాస్తులు ఆన్‌లైన్‌లో వచ్చినట్టు సమాచారం. అయితే వ్యాక్సిన్‌ కొరత నేపథ్యంలో మే 1 నుంచి 18-44 ఏళ్ల వయస్సు వారికి రాష్ట్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్‌ను అమలు చేయ టం లేదు. దీంతో చాలా వరకు స్లాట్‌ బుకింగ్‌ నిలిచిపోయింది. వ్యాక్సిన్‌ కొరత తీవ్రంగా ఉండటంతో గత శని, ఆదివారాల్లోనూ టీకా కార్యక్రమాన్ని కూడా నిలిపివేశారు. సోమవారం మళ్లీ వ్యాక్సినేషన్‌ మొదలు పెట్టారు.

ఇక బాదుడేనా..?

 స్లాట్‌ బుకింగ్‌ ఉంటేనా టీకా ఇస్తామని ప్రభుత్వం ప్రకటించటంతో గ్రామీణ ప్రాంత ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో చాలా వరకు ఏజెన్సీ గ్రామాలే ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్‌  కూడా లేదు. నెట్‌ సౌకర్యం ఉన్న 45 ఏళ్లు పైబడిన వారిలో ఎక్కువ మంది నిరాక్ష్యరాస్యులే ఉంటారు. ఇలాంటి వారు స్మార్ట్‌ ఫోన్‌లో వ్యాక్సిన్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకోవటం కష్టమే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.  అయితే మీ-సేవా కేంద్రాల్లో కూడా స్లాట్‌ బుక్‌ చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించింది. ఒక స్లాట్‌ బుక్‌ చేయాలంటే కనీసం ఐదారు నిమిషాలకంటే ఎక్కువ సమయం పడుతుంది. కరోనా విజృంభిస్తున్న పరిస్థితుల్లో గ్రామీణులు మీ-సేవా కేంద్రాల వద్దకె వెళ్లి స్లాట్‌ బుకింగ్‌ చేసుకోవటం కష్టంతో కూడిన పని అని పలువురు అంటున్నారు. అన్ని గ్రామాల్లో కూడా మీ-సేవా కేంద్రాలు లేవు. దీంతో ఇతర ప్రాంతాలకు ప్రయాణం ఈ సమయంలో మంచిది కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పైగా మీ-సేవా కేంద్రాల్లో కూడా స్లాట్‌ బుకిం గ్‌ ఉచితంగా చేసే వారుండరు. ప్రభుత్వం ప్రత్యేక సైట్‌ కూడా ఏమీ ఇవ్వలేదు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో జనరల్‌ సైట్‌లలోనే బుక్‌ చేస్తున్నారు. అయితే స్లాట్‌ బుకింగ్‌కు కనీసం ఎంత తీసుకోవాలో కూడా ప్రభుత్వం ధర నిర్ణయించలేదు. ప్రస్తుతం మొదటి రోజు కావటంతో కొన్ని చోట్ల రూ.20 వరకు తీసుకుంటున్నారు. స్లాట్‌ బుకింగ్‌కు డిమాండ్‌ పెరిగితే రూ.50 నుంచి రూ.100 వరకు వసూలు చేస్తారని తెలుస్తోంది. కరోనా టైంలో రిస్కు తీసుకొని పని చేయాల్సి రావటంతో నిర్వహకులు కూడా ఎక్కువగానే డిమాండ్‌ చేసే అవకాశం ఉంది. ఈ కరువు కాలంలో ప్రయాణ ఖర్చులు, స్లాట్‌ బుకింగ్‌ ఖర్చులు తడిసిమోపెడు అవుతాయని గ్రామీణలు ఆందోళన చెందుతున్నారు. 45 ఏళ్ల పైబడిన వారికి ఎలాంటి స్లాట్‌ బుకింగ్‌ లేకుండా స్పాట్‌ రిజిస్ర్టేషన్‌ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

రోజుకు వంద మందికే వ్యాక్సిన్‌

ప్రస్తుతం 45 ఏళ్ల పైబడిన వారికి మాత్రమే వ్యాక్సిన్‌ ఇస్తున్నారు. ఇప్పటికే భూపాలపల్లి, ములుగు జి ల్లాల్లో  1,30,000 మందికి వ్యాక్సినేషన్‌ చేశారు. రోజు కు ఇంతా అనే పరిమితి లేకుండా టీకాలు వేయటంతో వ్యాక్సిన్‌ కేంద్రాలకు భారీగా జనం వస్తున్నారు. దీంతో కూడా కరోనా వ్యాపించే అవకాశం ఉందని భావించిన ప్రభుత్వం రోజు వారీ వ్యాక్సినేషన్‌కు పరిమితి విధించింది. ప్రతి కేంద్రంలో రోజుకు 100 మందికి మాత్రమే టీకాలు వేయాలని ఆదేశించింది. దీంతో భూపాలపల్లి జిల్లాలో 12 పీహెచ్‌సీలు, చిట్యాల, మహదేవపూర్‌తో పాటు సింగరేణి ఏరియా ఆస్పత్రుల్లో వ్యాక్సినేషన్‌ జరుగుతోంది. మొత్తం 15 కేంద్రాల్లో ఇక నుంచి రోజుకు వంద చొప్పున 1,200 మందికి మాత్రమే టీకా వేయనున్నారు. గతంలో రోజుకు 5 వేలకు పైగా టీకాలు వేశారు. ప్రభుత్వ నిర్ణయంతో టీకాలు పరిమి తం కానున్నాయి. ములుగు జిల్లాలో కూడా 18 పీహెచ్‌సీలు, ములుగు, ఏటూరునాగారం ఏరియా ఆస్పత్రు లు ఉన్నాయి. ఈ 20 కేంద్రాల్లో రోజుకు 100 చొప్పున రెండు వేల టీకాలు వేసే అవకాశం ఉంది. రెండు జిల్లాలో రోజుకు 2,500 టీకాలు వేయనున్నారు. స్లాట్‌ బుకింగ్‌ కూడా సెంటర్‌కు రోజుకు వంద వరకే అనుమతి ఇవ్వనున్నారు. వ్యాక్సిన్‌ కొరత లేకుండా జనం ఒకే చోట చేరకుండా ఈ ప్రక్రయను కొనసాగేలా ప్రభుత్వ చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.


Updated Date - 2021-05-05T05:43:40+05:30 IST