ప్రైవేటుకు రూ.600 రాష్ట్రాలకు 400

ABN , First Publish Date - 2021-04-22T07:16:10+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు ఆస్పత్రులకు నేరుగా విక్రయించనున్న కొవిషీల్డ్‌ టీకా ధరలను సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఐఐ) బుధవారం ప్రకటించింది. వ్యాక్సిన్‌ ఒక్కో డోసును ప్రైవేటు ఆస్పత్రులకు రూ.600కు, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.400కు...

ప్రైవేటుకు రూ.600  రాష్ట్రాలకు 400

  • కొవిషీల్డ్‌ టీకా ధరపై ‘సీరం’ ప్రకటన.. మే నెలాఖరుకల్లా ఉత్పత్తి వేగవంతం
  • మార్కెట్లోకి అదనంగా 20శాతం డోసులు
  • జూలై తర్వాత ప్రతినెలా 10కోట్ల డోసులు
  • నాలుగైదు నెలల తర్వాత.. రిటైల్‌ మార్కెట్లోనూ టీకా: పూనావాలా

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 21 : రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు ఆస్పత్రులకు నేరుగా విక్రయించనున్న కొవిషీల్డ్‌ టీకా ధరలను సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఐఐ) బుధవారం ప్రకటించింది. వ్యాక్సిన్‌ ఒక్కో డోసును ప్రైవేటు ఆస్పత్రులకు రూ.600కు, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.400కు అందించనున్నట్లు వెల్లడించింది. ఈమేరకు ఎస్‌ఐఐ సీఈఓ అదర్‌ పూనావాలా బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. మే 1 నుంచి 18 ఏళ్లకు పైబడిన వారందరికీ వ్యాక్సినేషన్‌ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతున్న కీలక తరుణంలో టీకా ధరలపై ‘సీరం’ నుంచి ప్రకటన వెలువడటం గమనార్హం. అయితే కేంద్ర ప్రభుత్వానికి మాత్రం మునుపటిలాగే ఒక్కో కొవిషీల్డ్‌ డోసును రూ.150కి సరఫరా చేయనుంది. అమెరికా వ్యాక్సిన్ల ధర సగటున రూ.1500కుపైగా, రష్యా, చైనా టీకాలు రూ.750 కంటే ఎక్కువే ఉన్నాయని అదర్‌ పూనావాలా ఈసందర్భంగా గుర్తుచేశారు. వాటితో పోల్చుకుంటే భారత్‌లో కొవిషీల్డ్‌ తక్కువ ధరకే లభిస్తోందని చెప్పారు. తాము ఉత్పత్తి చేయనున్న టీకా డోసులలో 50 శాతాన్ని కేంద్ర ప్రభుత్వానికి రిజర్వ్‌ చేశామని, మిగతా సగం డోసులను రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు ఆస్పత్రులకు విక్రయిస్తామన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కార్పొరేట్‌ కంపెనీలు, వ్యక్తులకు నేరుగా డోసులను సరఫరా చేయలేమని, వారంతా రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు ఆస్పత్రుల ద్వారా టీకాలను పొందాలని ఆయన సూచించారు. మే నెలాఖరు కల్లా కొవిషీల్డ్‌ ఉత్పత్తి వేగాన్ని పుంజుకుంటుందని, ఇప్పటి నుంచి జూలై వరకు మార్కెట్లో 15 నుంచి 20 శాతం డోసుల లభ్యత పెరుగుతుందని పూనావాలా తెలిపారు. జూలై తర్వాత ఉత్పత్తి 40 శాతం మేర పెరుగుతుందని, ప్రతినెలా 10 కోట్ల డోసులు మార్కెట్లోకి విడుదలవుతాయన్నారు.

Updated Date - 2021-04-22T07:16:10+05:30 IST