HYD : Police Station లోకి భయం భయంగా పెట్టిన మహిళ.. సీన్ కట్ చేస్తే... కేవలం ఐదు నిమిషాల్లోనే..!

ABN , First Publish Date - 2021-12-02T15:55:06+05:30 IST

Police Station లో భయం భయంగా పెట్టిన మహిళ.. సీన్ కట్ చేస్తే... కేవలం ఐదు నిమిషాల్లోనే..!

HYD : Police Station లోకి భయం భయంగా పెట్టిన మహిళ.. సీన్ కట్ చేస్తే... కేవలం ఐదు నిమిషాల్లోనే..!

  • పోలీసింగ్‌పై ఫోకస్..
  • పనితీరుపై సీపీ డెకాయ్‌ ఆపరేషన్‌
  • సివిల్‌ దుస్తుల్లో కొత్త ఎస్సైలు
  • ఫిర్యాదుదారులుగా ఠాణాలకు..
  • సరిగ్గా స్పందించని కొందరు.. 

భాగ్యనగర పోలీసింగ్‌ తీరుపై సీపీ అంజనీకుమార్‌ డెకాయ్‌ ఆపరేషన్‌ నిర్వహించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ తీరు ఎలా ఉంది, పోలీసులు ఫిర్యాదుదారులతో ఎలా వ్యవహరిస్తున్నారు, సదరు ఫిర్యాదుపై ఎలా స్పందిస్తున్నారు అన్న విషయాలను తెలుసుకుని ఠాణాల వారీగా మార్కులు వేశారు. నగరంలో కొత్తగా చేరిన ఎస్సైలను ముఖ్యంగా మహిళా ఎస్సైలను సివిల్‌ దుస్తుల్లో స్టేషన్లకు పంపించి ఈ డెకాయి ఆపరేషన్‌ చేయడం పోలీస్‌ శాఖలో చర్చనీయాంశంగా మారింది.


హైదరాబాద్‌ సిటీ : మంగళవారం మధ్యాహ్నం.. ఓ మహిళ పోలీ‌స్‌స్టేషన్‌లోకి భయం.. భయంగా అడుగు పెట్టింది. రిసెప్షన్‌లో ఉన్న సిబ్బంది ఆమెను కూర్చొబెట్టి నీళ్లు అందించారు. ‘ఏం జరిగిందమ్మా’ అని ప్రశ్నించారు. షేరింగ్‌ ఆటోలో ప్రయాణిస్తుండగా, తోటి ప్రయాణికుడు కత్తితో బెదిరించి మంగళసూత్రాన్ని లాక్కోబోయాడని ఆయాస పడుతూ చెప్పింది. ప్రతిఘటించడంతో తన బ్యాగ్‌లోని రూ. 5వేలు తీసుకుని పారిపోయాడని వివరించింది. రిసెప్షన్‌లో ఉన్నవారు ఆమెకు ధైర్యం చెబుతూ, వెంటనే ఉన్నతాధికారికి సమాచారం అందించారు. రాతపూర్వక ఫిర్యాదు తీసుకోవాలని సూచించిన మరో ఉన్నతాధికారి వెంటనే సిబ్బందిని అలర్ట్‌ చేశారు. ఆటో వెళ్లిన రూట్‌లో సీసీ కెమెరాలు పరిశీలించాలని ఆదేశించారు. ఇదంతా కేవలం ఐదు నిమిషాల్లో జరిగింది. ఎస్సై వచ్చి మహిళకు అభయమిస్తూ, నిందితుడిని పట్టుకుంటామని చెప్పారు. సీన్‌ కట్‌ చేస్తే ఠాణాకు వచ్చింది ప్రొబేషనరీ ఎస్సై. ఆమె ఈ ఉదంతాన్నంతా సీపీ దృష్టికి తీసుకెళ్లి, ఠానాకు మంచి మార్కులిచ్చింది.


నగరంలోని పోలీ‌స్‌స్టేషన్లలో ఎవరైనా ఫిర్యాదు చేయడానికి వస్తే, అధికారులు, సిబ్బంది ఎంత వేగంగా స్పందిస్తున్నారు? సామాన్యులకు ఏ మాత్రం మర్యాదనిస్తున్నారు? ఫిర్యాదు ఇచ్చిన వెంటనే ఎంత వేగంగా రంగంలోకి దిగుతున్నారు? పోలీస్‌ స్టేషన్‌కు వచ్చిన వారితో ఎలా వ్యవహరిస్తున్నారనే పలు అంశాలపై సీపీ డెకాయ్‌ ఆపరేషన్‌ నిర్వహించారు. నూతనంగా విధుల్లో చేరిన 200 మంది ప్రొబేషనరీ ఎస్సైలతో 52 బృందాలను ఏర్పాటు చేసి, నగర కమిషనరేట్‌ పరిధిలో ఉన్న మొత్తం పోలీస్‌స్టేషన్లలో 55 పోలీస్‌ స్టేషన్లలో ఈ ఆపరేషన్‌ నిర్వహించారు. రెండు రోజులపాటు రెండు షిఫ్టుల్లో కొత్త ఎస్సైలు ఫిర్యాదుదారులుగా సివిల్‌ డ్రస్‌ల్లో వెళ్లారు. వారు అక్కడ ఎదురైన అనుభవాలను అధికారులకు విరించారు. కాగా, మొత్తం 55 పోలీస్‌స్టేషన్లలో 3-4 పీఎస్‌లు మినహా మిగతా అన్నింట్లో సిబ్బంది పనితీరు బాగుందని సీపీకి నివేదిక అందింది. ఆ ఠాణాలలో సిబ్బందికి కౌన్సెలింగ్‌ ఇచ్చి, వాటినీ సరిదిద్దుతామని సీపీ అంజనీకుమార్‌ ఈ సందర్భంగా వెల్లడించారు.


నగర కమిషనరేట్‌ పరిధిలో సుమారు 60 మంది మహిళా ఎస్సైలతో పాటు మొత్తం 203 మంది ఎస్సైలు విధుల్లో చేరనున్నారు. 162 మంది ఇప్పటికే చేరగా మిగతా వారు కూడా నెలరోజుల్లో చేరతారు. ఈ నేపథ్యంలో నూతన ఎస్సైలకు ఈ ఆపరేషన్‌ ఓ శిక్షణలా ఉపయోగపడనుంది. అయితే, సీపీ చేపట్టిన ఈ ఆపరేషన్‌లో తమ ఠాణాలకు ఎలాంటి మార్కులు పడ్డాయో అన్న చర్చ సాగుతోంది. అలాగే, సరిగ్గా స్పందించని ఠాణాలు ఏవో అన్న చర్చ కూడా సాగుతోంది.  ఈ ఆపరేషన్‌తో నగర పోలీస్‌ శాఖ అలర్ట్‌ అయింది.

Updated Date - 2021-12-02T15:55:06+05:30 IST