తెలుగు సూర్యుడు సీపీ బ్రౌన్‌

ABN , First Publish Date - 2020-11-26T05:51:38+05:30 IST

కాలగర్భంలో కలిసిపోతున్న ఎన్నో పద్యాలు, వేమన...

తెలుగు సూర్యుడు సీపీ బ్రౌన్‌
బ్రౌన్‌ గ్రంథాలయం

ఆయన పేరుతో కడపలో గ్రంథాలయం

గ్రంథాలయం నుంచి పరిశోధన కేంద్రం దాకా.. 

29, 30 తేదీలలో రజతోత్సవాలు

పలువురు ప్రముఖులు హాజరు


తెలుగు సూర్యుడు, కారణజన్ముడు అయిన బ్రౌన్‌ మనకు మిగిల్చిపోయిన అక్షర సామ్రాజ్యం ఎంత విస్తారమైంది! ఎంత విలువైంది!

- బంగోరె

ఇవాళ తెలుగుభాషా సాహిత్యాలు ఇంత వెలుగు వెలుగుతూ వుండడానికి కారణభూతుడు ఛార్లెస్‌ ఫిలిప్‌ బ్రౌన్

- ఆరుద్ర

బ్రౌన్‌కు మొదటి నుంచీ వాడుకభాష పట్లే మొగ్గు. గురువులు కావ్యభాష చదవమని పోరితే చదివాడుగానీ ఆయన ప్రాణమంతా వాడుకభాష పైన ఉండేది.

- ఎన్‌.గోపి

ఆ బంగళా (బ్రౌన్‌ కాలేజి) కేవలం భవనం కాదు. తెలుగు సాహిత్యభారతి గజ్జెకట్టి నాట్యమాడిన శారదామందిరం.

- సీకే సంపత్‌కుమార్‌


కడప(ఆంధ్రజ్యోతి): కాలగర్భంలో కలిసిపోతున్న ఎన్నో పద్యాలు, వేమన శతకాలు, ప్రాచీన సాహిత్యం క్రోడీకరించి తెలుగు భాషకు జీవం నింపాడు చార్లెస్‌ ఫిలిప్‌ బ్రౌన్‌. తెలుగుభాష కోసం ఆయన ఎనలేని కృషి చేశారు. ఆయన పేరిట కడపలో ఏర్పడిన గ్రంథాలయం ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ఎదిగి కమ్మనైన తెలుగుభాష ఖ్యాతిని నలుదిశలా చాటుతోంది. సీపీ బ్రౌన్‌ గంథాలయంగా మొదలై నేడు తెలుగుభాష పరిశోధన కేంద్రంగా విరాజిల్లుతోంది. నవంబరు 29, 30 తేదీల్లో రజతోత్సవాలకు ముస్తాబవుతోంది.


తెలుగుభాష సముద్ధారకుడు సీపీ బ్రౌన్‌

ఆంగ్లేయుల పాలనలో డిప్యూటీ కలెక్టరుగా ఈ ప్రాంతంలో అడుగుపెట్టి, తెలుగుభాష ఉన్నతికి ఎన్నో అడుగులు వేసిన మహోన్నతుడు చార్లెస్‌ ఫిలిప్‌ బ్రౌన్‌ (1798-1884). ఈయన కలకత్తాలో క్రైస్తవ కుటుంబంలో పుట్టినా జీవిత పర్యంతం కృషి చేసింది మాత్రం తెలుగుభాషకోసమే. సీపీ బ్రౌన్‌ ఈస్టిండియా కంపెనీ ఉద్యోగిగా 1820లో కడప జిల్లా కలెక్టరుకు రెండో సహాయకుడిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించాడు. ఈయన అప్పట్లో ఎర్రముక్కపల్లెలోని 15 ఎకరాల తోట, ఒక బంగ్లాను 3 వేల వరహాలకు కొనుగోలు చేశాడు. అప్పట్లో ఒక వరహా అంటూ రూ.4తో సమానం. తెలుగుభాషపై ప్రావీణ్యం పెంచుకునేందుకు కవులు, కళాకారుల తో చర్చలు జరిపాడు. వసుచరిత్ర, మనుచరిత్ర, భారతం, రామాయణం తదితర వాటిని ఎత్తి రాయించాడు. వేమనపద్యాలు, తాళ్లపాక పత్రాలను పదిలపరిచాడు. తెలుగు, ఆంగ్ల నిఘంటువులను కూర్చాడు. ఇప్పటికీ ‘బ్రౌణ్య నిఘంటువులు’ అందుబాటులో ఉన్నాయి. విధినిర్వహణలో భాగంగా జిల్లాలో పర్యటించేటప్పుడు ప్రజలు వినతిపత్రాలు ఇస్తే వాటికి తెలుగులోనే సమాచారం ఇచ్చేవాడు. ఆయన ఉంటున్న నివాసాన్ని బ్రౌన్‌ కాలేజీ అని పిలిచేవారు. పదవీ విరమణ అనంతరం ఇంగ్లాండు వెళ్లిన తరువాత అక్కడ తెలుగు ప్రొఫెసరుగా పనిచేస్తూ చివరి శ్వాస వరకూ తెలుగుభాషా సాహిత్యానికి ఎనలేని కృషి చేశారు.


సీపీ బ్రౌన్‌ గ్రంథాలయానికి తొలి అడుగులు

తెలుగుభాషోద్ధరణకు సీపీ బ్రౌన్‌ ఎనలేని కృషి చేశారని గుర్తించి డాక్టర్‌ ఆరుద్ర, ఆచార్య జీఎన్‌ రెడ్డి, బండి గోపాల్‌రెడ్డి, ఆచార్య కేతు విశ్వనాధరెడ్డి కలిసి 1976లో కడపలో బ్రౌన్‌ బంగ్లాను పరిశీలించారు. కొన్ని పుస్తకాలు, రికార్డుల ఆధారంగా దీనిని ఆయన నివాస స్థలంగా గుర్తించారు. వీరు అప్పటి కడప కలెక్టరు పీఎల్‌ సంజీవరెడ్డిని కలిసి తెలుగుసాహిత్యం కోసం ఎంతో కృషి చేసిన సీపీ బ్రౌన్‌ స్మృతి చిహ్నంగా ఆయన నివసించిన స్థలంలో ఓ గ్రంథాలయం ఏర్పాటు చేయాలని కోరారు. తెలుగుసాహిత్యంపై అభిమానం ఉన్న కలెక్టరు వెంటనే స్పందించి కడప ప్రభుత్వ కళాశాలలో ఆంగ్ల ఉపాధ్యాయునిగా, కడప జిల్లా రచయితల సంఘం కార్యదర్శిగా పనిచేస్తున్న జానమద్ది హనుమచ్ఛాస్త్రితో గ్రంథాలయం ఏర్పాటుపై చర్చించారు. అప్పటి కడప జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు డాక్టర్‌ మల్లెమాల వేణుగోపాల్‌రెడ్డితో కలిసి భవన నిర్మాణానికి తొలి అడుగు వేశారు. 


రాళ్లెత్తిన కూలీలెందరో..

బ్రౌన్‌ నివసించిన బంగ్లా అప్పటికే ఆడిటర్‌గా పనిచేస్తున్న పి.ఆర్‌ క్రిష్ణస్వామి ఆధీనంలో ఉండేది. అయితే బంగ్లా మొండిగోడలు మాత్రం మిగిలాయి. కలెక్టరు క్రిష్ణస్వామితో చర్చించడంతో బంగ్లా 20 సెంట్ల స్థలాన్ని బ్రౌన్‌ స్మృతి చిహ్నంగా నిర్మించే గ్రంథాలయానికి  ఆయన విరాళంగా ఇచ్చారు. 1987లో జంధ్యాల హరినారాయణ కలెక్టరుగా వచ్చారు. వారి సూచనలతో డిసెంబరులో సీపీ బ్రౌన్‌ స్మారక ట్రస్టును ఏర్పాటు చేశారు. కలెక్టరు ట్రస్టు ప్రధాన పోషకుడుగా ఉండగా అధ్యక్షుడిగా సంపత్‌కుమార్‌, ఉపాధ్యక్షులుగా క్రిష్ణమూర్తి, పసుపులేటి బ్రహ్మయ్య, కార్యదర్శిగా జానమద్ది హనుమచ్ఛాస్త్రి మరికొందరు ఉన్నారు. గ్రంథాలయం నిర్మాణానికి తెలుగు గ్రామీణ పథకం నుంచి కలెక్టరు రూ.3.05 లక్షలు మ్యాచింగ్‌ గ్రాంటు మంజూరు చేశారు. 1987 జనవరి 22న గ్రంథాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఆ నిధులు చాలకపోవడంతో గ్రంథాలయ నిర్మాణం కోసం విరాళాలు సేకరించారు. 1995 నవంబరు 29న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, స్వాతంత్య్ర సమరయోధులు డాక్టర్‌ వావిలాల గోపాలక్రిష్ణయ్య గ్రంథాలయాన్ని ప్రారంభించారు.


ఇంతింతై వటుడింతై అన్నట్లుగా సీపీ బ్రౌన్‌ గ్రంథాలయం ఎదిగి భాషా పరిశోధన కేంద్రంగా మారింది. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీకి అనుబంధంగా 2005 అక్టోబరు 1న  సీపీ బ్రౌన్‌ ప్రాంతీయ తెలుగుభాషా సాహిత్యాల పరిశోధన కేంద్రంగా ఆవిర్భవించింది. 2006 మేలో రాష్ట్ర ప్రభుత్వం కడపలో యోగివేమన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసింది. అదే ఏడాది అక్టోబరు 1న గ్రంథాలయాన్ని సీపీ బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రంగా మార్చి యోగివేమన విశ్వవిద్యాల యానికి అనుబంధ సంస్థగా అప్పగించారు.


పరిశోధన కేంద్రం

సీపీ బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రంలో పుస్తకాలతో పాటు వివిధ రకాల రాతప్రతులు, తాళపత్ర గ్రంథాలు, చేతులతో తయారు చేసిన కాగితపు ప్రతులు ఉన్నాయి. భవిష్యత్‌తరాల కోసం పుస్తకాలను భద్రపరిచేందుకు డిజిటలైజేషన్‌ చేస్తున్నారు. అలాగే  వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన సిద్ధాంత గ్రంథాలు, పురాతన పుస్తకాలు ఉన్నాయి. కేంద్రంలో తెలుగు, ఇంగ్లీషు, హిందీ, కన్నడ, తమిళ, ఉర్దూ భాషల్లో సుమారు 70వేల పుస్తకాలున్నాయి. మద్రాసులోని ప్రభుత్వ ప్రాచ్యలిఖిత గ్రంథాలయం నుండి 42 సంపుటుల మెకంజీ కైఫీయత్తులను సేకరించారు. విద్యాన్‌ కట్టా నరసింహులు, ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి, ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి తదితరులు ఇక్కడ పనిచేశారు.


రాయలసీమ అధ్యయన విభాగం ఏర్పాటు

రాయలసీమ చరిత్ర, సాంస్కృతిక, సాహిత్యాన్ని తెలియజేసేందుకు రాయలసీమ అధ్యయన విభాగాన్ని ఏర్పాటు చేశారు. తెలుగుపరిశోధన విద్యార్థులకు ఈ విభాగం ఎంతో ఉపయోగకరంగా ఉంటోంది.


మన సాహిత్యం పేరిట

నెలనెలా మన జిల్లా సాహిత్యం పేరిట జిల్లాకు చెందిన కవులు, రచయితల సాహిత్యంపై ప్రసంగాలు ఏర్పాటు చేస్తున్నారు. దీపిపి ఇప్పుడు నెలనెలా సీమ సాహిత్యం పేరుగా మార్చారు. ఇప్పటివరకు 23 పుస్తకాలు ప్రచురించారు.


బ్రౌన్‌ శాస్ర్తి.. జానమద్ధి

సీపీ బ్రౌన్‌ గ్రంథాలయం ఏర్పాటుకు ఎందరోకృషి చేసినా జీవిత చరమాంకం దాకా పాటుపడిన వ్యక్తి జానమద్ది హనుచ్ఛాస్ర్తి. సీపీ బ్రౌన్‌ ఆంగ్లేయుడయితే హనుమచ్ఛాస్ర్తి ఆంగ్ల అధ్యాపకుడు. సీపీ బ్రౌన్‌ మెమోరియల్‌ ట్రస్టుకు ఈయన వ్యవస్థాపక కార్యదర్శి. గ్రంథాలయం నిర్వహణకు అవసరమైన నిధులు, పుస్తకాలు సేకరించేదానికి విరామమెరుగని కృషి చేశారు. తొలినాళ్లలో పుస్తకం, లేదా విరాళం అనే విధంగా తిరిగేవారు. జానుమద్ది హనుమచ్ఛాస్త్రి సీపీ బ్రౌన్‌కు ఆరాధకుడు. ఈయన తెలుగుభాషా సాహిత్య సేవను గుర్తించి బ్రౌన్‌ శాస్త్రి బిరుదుతో జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డాక్టర్‌ సి.నారాయణరెడ్డి సత్కరించారు. సీపీ బ్రౌన్‌ గ్రంథాలయం ఏర్పాటుకు తన జీవితాన్ని ధారపోసిన ఈయన 2014 ఫిబ్రవరి 28న మరణించారు. 


ఔన్నత్యం ఉట్టిపడేలా ఉత్సవాలు: మూలమల్లిఖార్జునరెడ్డి, సీపీ బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రం ఇన్‌ఛార్జ్‌ 

సీపీ బ్రౌన్‌ గ్రంథాలయ రజతోత్సవాలను తెలుగుఔన్నత్యం ఉట్టిపడేలా నిర్వహిస్తాం. గ్రంథాలయం అధికారికంగా ప్రారంభించి 25 సంవత్సరాలు పూర్తవుతోంది. 29, 30 తేదీలలో సాహితీ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. పుస్తకాల ఆవిష్కరణ, అవధానాలు, సమీక్షలు ముఖ్యంగా 25 సంవత్సరాల అభివృద్ధి సూచిస్తూ ప్రత్యేక సంచికలను ఆవిష్కరిస్తాం. లైబ్రరీకి సహాయసహకారాలు అందించిన వారిని సన్మానించనున్నాం.


రజతోత్సవాలను ఘనంగా నిర్వహిస్తాం: వీసీ సూర్యకళావతి

కడప: నగరంలోని సీపీబ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రం రజతోత్సవాలను ఈనెల 29 నుంచి ఘనంగా నిర్వహించనున్నామని వైవీయూ వీసీ సూర్యకళావతి తెలిపారు. గ్రంథాలయంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించి ఆమె మాట్లాడారు. రజతోత్సవాలకు ముఖ్యమంత్రితో పాలు పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, సాహిత్యకారులను ఆహ్వానించామన్నారు. తెలుగు సూర్యుడు నివసించిన స్థలంలో డాక్టర్‌ జానమద్ది హనుమచ్ఛాస్త్రి ఎంతో శ్రమపడి సాహితీ సేవకులతో కలసి సీపీ బ్రౌన్‌ లైబ్రరరీ ఏర్పాటు చేశారన్నారు. 2005లో భాషా పరిశోధన కేంద్రం శ్రీ వెంకటేశ్వర యూనివర్శిటీకి అనుబంధంగా ఉండేదని, 2006 నుంచి వైవీయూ అనుబంధంగా పనిచేస్తోందన్నారు.


రిజిస్ట్రార్‌ విజయరాఘవప్రసాద్‌ మాట్లాడుతూ ప్రారంభ సన్నాహక కార్యక్రమాల్లో భాగంగా 25, 26 తేదీల్లో విశ్వవిజ్ఞాన వేదిక గ్రంథాలయం అనే అంశంపై అంతర్జాల శతాధిక కవి సమ్మేళనం, 27, 28 తేదీల్లో సీపీ బ్రౌన్‌ జీవితం, సాహిత్య కృషి అనే అంశంపై అంతర్జాల సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. 29, 30 తేదీల్లో సీపీ బ్రౌన్‌ భాషా పరిశోధనకేంద్రం ప్రచురించిన పలు పుస్తకాల ఆవిష్కరణ ఉంటుందన్నారు. గ్రంథాలయ బాధ్యులు డాక్టర్‌ మూల మల్లికార్జునరెడ్డి, యూనివర్శిటీ ప్రిన్సిపల్‌ సాంబశివారెడ్డి పాల్గొన్నారు.


Updated Date - 2020-11-26T05:51:38+05:30 IST