బస్సు చార్జీల పెంపుపై వామపక్షాల ఆగ్రహం

ABN , First Publish Date - 2022-07-03T06:41:39+05:30 IST

ఆర్టీసీ బస్సు చార్జీల పెంపుపై వామపక్షాలు భగ్గుమన్నాయి.

బస్సు చార్జీల పెంపుపై వామపక్షాల ఆగ్రహం
ఏలూరు కొత్త బస్టాండ్‌ వద్ద వామపక్షాల ధర్నా

ధర్నాలు, రాస్తారోకోలతో నిరసన


ఆర్టీసీ బస్సు చార్జీల పెంపుపై వామపక్షాలు భగ్గుమన్నాయి. శనివారం సీపీఐ, సీపీఎం, ఇతర పార్టీల నాయకులు ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. పెంచిన చార్జీలు తక్షణం తగ్గించాలని నినాదాలు చేశారు.  అధికారంలోకి రాకముందు ధరలు పెంచనని హామీ ఇచ్చిన జగన్‌  ఇప్పుడు ధరల పెంపుతో సామాన్యుడి నడ్డివిరుస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఏలూరు కలెక్టరేట్‌, జూలై 2 :  ఆర్టీసీ ఛార్జీలు పెంపును నిరసిస్తూ సీపీఎం, సీపీఐ, సీపీఐ ఎంఎల్‌ (న్యూ డెమోక్రసీ) పార్టీల ఆధ్వర్యంలో శనివారం కొత్త బస్టాండ్‌ వద్ద ధర్నా నిర్వహించారు. ఆయా పార్టీల నాయకులు బండి వెంకటేశ్వరరావు, పి. కిషోర్‌, బద్దా వెంకట్రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రెండు నెలలు గడవకముందే రెండోసారి ఆర్టీసీ ఛార్జీలను పెంచిందన్నారు.  ఆర్టీసీ నష్టాల్లోకి వెళ్ళడానికి కారణం ప్రభుత్వ విధానాలే అన్నారు.  ఉప్పులూరి హేమశంకర్‌, ఆర్‌. లింగరాజు, డీఎన్‌వీడీ ప్రసాద్‌, డి. శ్యామలరాణి, కె విజయలక్ష్మి, ఆదిశేషు, ఎం. లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు. 

బుట్టాయగూడెం:   సీపీఎం ఆధ్వర్యం లో బుట్టాయగూడెం బస్టాండ్‌ సెంటరులో శనివారం ధర్నా నిర్వహించారు. మండల కార్యదర్శి తెల్లం రామకృష్ణ, మొడియం నాగమణి మాట్లాడుతూ  పెంచిన బస్సు చార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్‌ చేశారు. నాయకులు వెంకట్రావు, సిరిబత్తుల సీతారామయ్య, కొండలరావు, పోలోజు నాగేశ్వరావు, పొడియం రాజు తదితరులు పాల్గొన్నారు.

కుక్కునూరు: వామపక్షాల ఆధ్వర్యంలో శనివారం  ప్రధాన రహదారిపై ఽధర్నా నిర్వహించారు. పెరిగిన చార్జీలతో సామాన్యులపై తీవ్ర భారం పడుతుందన్నారు. సీపీఎం మండల కార్యదర్శి వై.నాగేంద్రరావు, సీపీఐ మండల కార్యదర్శి ఎం.వెంకటాచారి, నాయకులు పాల్గొన్నారు. 

కొయ్యలగూడెం: రాష్ట్ర ప్రభుత్వం పెంచిన బస్సు ఛార్జీలు వెంటనే తగ్గించాలని సీపీఐ రాష్ట్ర జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్‌ డిమాండ్‌ చేశారు.  శనివారం కొయ్యలగూడెంలో జాతీయ రహదారిపై సీపీఐ ఆధ్వర్యంలో నిరసన రాస్తారోకో నిర్వహించారు. రాష్ట్ర సమితి సభ్యులు ఎండీ మునీర్‌, మండల కార్యదర్శి జమ్మి శ్రీనివాసరావు, సహాయ కార్యదర్శి ఆంజనేయరాజు, ఎస్‌కే బాజీ, తదితరులు పాల్గొన్నారు. 

కామవరపుకోట:  సీపీఐ  ఆధ్వర్యంలో శనివారం కామవరపుకోట చౌతనా సెంటర్‌లో ధర్నా నిర్వహించారు.  పార్టీ మండల కార్యదర్శి టీవీఎస్‌ రాజు మాట్లాడుతూ  విద్యుత్‌ చార్జీల పెంపుతో ప్రజలు అల్లాడుతున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం బస్‌ చార్జీలు పెంచడం అన్యాయమని, వెంటనే ఉప సంహరించుకోవాలని కోరారు. సీపీఐ అనుబంధ సంస్థల ప్రతినిధులు కంకిపాటి బుచ్చిబాబు, మీనుగుల దుర్గారావు, జి.సత్యనారాయణ, వెంకటేశ్వరరావు, రాజారావు తదితరులు పాల్గొన్నారు.  

జంగారెడ్డిగూడెం టౌన్‌:  వామపక్షాల ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద ఆందోళన చేపట్టారు.  న్యూ డెమోక్రసీ జిల్లా కమిటీ సభ్యుడు కేవీ  రమణ,  సీపీఐ మండల కార్యదర్శి కృష్ణ చైతన్య, సీపీఎం పట్టణ కార్యదర్శి చల్లారి మాణిక్యాలరావు, సీపీఐ (యు) నాయకులు పెన్మత్స అప్పలరాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బస్సు, విద్యుత్‌ చార్జీలు పెంచమని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను మోసం చేసిందన్నారు. పెంచిన చార్జీలను తగ్గించకుంటే  పెద్దఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.  

చింతలపూడి:  వామపక్షాల ఆధ్వర్యంలో కొత్తబస్టాండ్‌ వద్ద శనివారం ధర్నా, ర్యాలీ నిర్వహించారు. సీపీఎం కన్వీనర్‌ ఆర్‌వీ సత్యనారాయణ మాట్లా డుతూ బస్సు చార్జీలు పెంపు సామాన్యులకు భారంగా మారిందన్నారు.  వామపక్ష నాయకులు జంగా రామచంద్రారెడ్డి, కంచర్ల గురవయ్య, పి.సోమశేఖర్‌, టి.బాబు, బోడా వజ్రం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-03T06:41:39+05:30 IST