వందేళ్ల వర్గపోరాట వక్రీభవనం

ABN , First Publish Date - 2020-10-17T06:03:14+05:30 IST

సిపిఐ, సిపిఎం తదితర పార్టీల సారథ్యంలోని సామరస్య వర్గ పోరాట ప్రవాహం, వివిధ సిపిఐ (ఎంఎల్‌) పార్టీల నాయకత్వంలోని సాయుధ వర్గ పోరాట ప్రవాహం– రెండూ భారతదేశ నిర్దిష్ట....

వందేళ్ల వర్గపోరాట వక్రీభవనం

సిపిఐ, సిపిఎం తదితర పార్టీల సారథ్యంలోని సామరస్య వర్గ పోరాట ప్రవాహం, వివిధ సిపిఐ (ఎంఎల్‌) పార్టీల నాయకత్వంలోని సాయుధ వర్గ పోరాట ప్రవాహం– రెండూ భారతదేశ నిర్దిష్ట పరిస్థితుల నుంచి తమ కార్యక్రమాన్ని రూపొందించుకోవడంలో విఫలమయ్యాయి. సామరస్య పోరాట ప్రవాహం పాశ్చాత్య దేశాల విప్లవానుభవాన్ని అనుకరించేందుకు ప్రయత్నించగా, సాయుధ పోరాట ప్రవాహం చైనా అనుభవాన్ని మక్కీకి మక్కీ అన్వయించేందుకు ప్రయత్నించి ఘోరంగా భంగపడ్డాయి. కులం, మతం, జాతి, లింగం, ప్రాంతం తదితర అస్తిత్వ సమస్యల పునాదిగా కమ్యూనిస్టు ఉద్యమ కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుని ప్రజలను విముక్తి బాటలో నడిపించలేకపోయాయి.


భారత కమ్యూనిస్టు ఉద్యమానికి నేటితో (అక్టోబర్‌ 17) వందేళ్ళు నిండుతాయి. మెక్సికన్‌ కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపకుడు, కమ్యూనిస్టు ఇంటర్నేషనల్‌ కార్యనిర్వాహక కమిటీ సభ్యుడు అయిన ఎమ్‌ఎన్‌ రాయ్‌ సారథ్యంలో 1920, అక్టోబర్‌ 17న సోవియట్‌ యూనియన్‌లోని తాష్కెంట్‌లో భారత కమ్యూనిస్టు పార్టీ ఏర్పాటయింది. భారత్‌లో బ్రిటిష్‌ వలస పాలనను కూలదోసే లక్ష్యంతో ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్న భారతీయ విప్లవకారులను సమీకరించి, రష్యాలో విజయవంతమైన అక్టోబర్‌ విప్లవ స్ఫూర్తితో ఏర్పాటు చేసిన ఈ పార్టీని కమ్యూనిస్టు ఇంటర్నేషనల్‌ 1921లో గుర్తించింది. ఉత్తర్‌ప్రదేశ్‌లో 1925 డిసెంబర్‌ 25వ తేదీ నుంచి 28వ తేదీవరకు జరిగిన బహిరంగసభలో ఎమ్‌ఎన్‌ రాయ్‌ నేతృత్వంలో దేశవ్యాప్త విస్తృత పునాదిపై ఈ కమ్యూనిస్టు పార్టీ పునర్నిర్మాణం జరిగింది.


వందేళ్ళుగా ఉనికిలో ఉన్న సామాజిక, ఆర్థిక, రాజకీయ ఆధిపత్య శక్తుల దోపిడీ, అణచివేత, నిరంకుశత్వాలకు వ్యతిరేకంగా జరిగిన సాహసోపేతమైన ప్రతిఘటనలకు వివిధ భారతీయ కమ్యూనిస్టులు నాయకత్వం వహించారు. వలస విముక్తి, రాజకీయ, ఆర్థిక, సామాజిక స్వేచ్ఛా స్వాతంత్ర్యాల కోసం వందలాది, వేలాది విప్లవకారులు భారత కమ్యూనిస్టు ఉద్యమంలో తమ సర్వస్వం త్యాగం చేశారు. వారంతా కుల, మత, జాతి, లింగ తదితర అస్తిత్వరూపాల్లో సాగుతున్న సామాజిక, ఆర్థిక, రాజకీయ అణచివేతలకు వ్యతిరేకంగా రాజీలేని పోరాటాలను నడిపించిన త్యాగధనులు. భారతీయ కమ్యూనిస్టులు తుపాకులు పట్టి సాయుధ పోరాటాన్ని సాగించారు, ఓట్ల ద్వారా చట్టసభల్లోకి వెళ్ళి పోరాడారు. ప్రభుత్వాల్లోకి వచ్చి పలు పాలనా సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. చెమట చిందించారు, కుట్ర కేసుల్లో ఇరుక్కున్నారు. జైల్లో చిత్రహింసలను భరించడం సహా పలు నిర్బంధాలను ఎదుర్కొన్నారు. రక్తాన్ని ధారపోశారు, ప్రాణత్యాగాలు చేశారు. దేశీయ సామాజిక, ఆర్థిక సమస్యలపై వారు దృష్టి కేంద్రీకరిస్తూనే, అంతర్జాతీయంగా వివిధ ప్రజా ఉద్యమాలకు సంఘీభావం తెలుపుతూ నికార్సయిన అంతర్జాతీయవాదులుగా నిలిచారు. ఆ క్రమంలో పలు కీలక సమయాల్లో తప్పటడుగులు వేసి, అనేక చారిత్రక సందర్భాల్లో అందివచ్చిన అవకాశాలను చేజార్చుకున్నారు. 


బ్రిటిష్‌ ప్రభుత్వం నిషేధం విధించిన సమయంలో సొంతంగా రహస్య పార్టీని, బహిరంగ ప్రజాసంఘాలను నిర్మించి విప్లవోద్యమాన్ని బలోపేతం చేయడంలో విఫలమై, కాంగ్రెస్‌ పార్టీలో భాగస్వామి కావడం ఒక చారిత్రక తప్పిదం. అదే తీరులో, రెండో ప్రపంచయుద్ధంలో బ్రిటిష్‌ ప్రభుత్వానికి సహకరిస్తూ క్విట్‌ ఇండియా ఉద్యమంలో భాగస్వామి కాకపోవడం భారత కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం చేసిన మరో ఘోరమైన తప్పిదం. ఈ రెండు తప్పిదాలు విప్లవ విజయావకాశాలను కాలరాచాయన్నది చారిత్రక వాస్తవం. ఆ తర్వాత సాయుధ పోరాటానికి, వర్గ శత్రు నిర్మూలనకు తేడా అర్థం చేసుకోకుండా వీరులే చరిత్ర నిర్మాతలనే తీరులో నాయకత్వం దుందుడుకుగా వ్యవహరించింది. ప్రజా సంఘాలను ఉపగ్రహాలుగా మార్చే పనివిధానం, దళాలు, సాయుధ చర్యల కేంద్రంగా ఉద్యమ నిర్మాణం వంటి అనేక రాజకీయ, సైద్ధాంతిక, నిర్మాణ తప్పిదాలతో, స్వయంకృత అపరాధాలతో తీవ్ర నిర్బంధానికి గురై, భారత ప్రజల విశ్వాసాన్ని చూరగొనడంలో విప్లవ పార్టీలు విఫలమయ్యాయి. సిపిఐ, సిపిఎం తదితర పార్టీల సారథ్యంలోని సామరస్య వర్గ పోరాట ప్రవాహం, వివిధ సిపిఐ (ఎంఎల్‌) పార్టీల నాయకత్వంలోని సాయుధ వర్గ పోరాట ప్రవాహం– రెండూ భారతదేశ నిర్దిష్ట పరిస్థితుల నుంచి తమ కార్యక్రమాన్ని రూపొందించుకోవడంలో విఫలమయ్యాయి. సామరస్య పోరాట ప్రవాహం పాశ్చాత్య దేశాల విప్లవానుభవాన్ని అనుకరించేందుకు ప్రయత్నించగా, సాయుధ పోరాట ప్రవాహం చైనా అనుభవాన్ని మక్కీకి మక్కీ అన్వయించేందుకు ప్రయత్నించి ఘోరంగా భంగపడ్డాయి. కులం, మతం, జాతి, లింగం, ప్రాంతం తదితర అస్తిత్వ సమస్యల పునాదిగా కమ్యూనిస్టు ఉద్యమ కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుని ప్రజలను విముక్తి బాటలో నడిపించలేకపోయాయి.


ఉత్తరార్థగోళ పారిశ్రామిక దేశాల్లో బలప్రయోగాన్ని ప్రధానంగాను, భావజాలాన్ని ద్వితీయంగాను అక్కడి పాలకవర్గాల రాజ్యం వినియోగిస్తుంది. దక్షిణార్థగోళ వ్యవసాయక, జీవవైవిధ్య దేశాల్లో పాలకవర్గ రాజ్యం ప్రధానంగా భావజాలం, భావజాల సంబంధాలు, వ్యవస్థలు, సంస్థలపై ఆధారపడి సమాజాన్ని నియంత్రిస్తున్నాయి. ఇక్కడ బలప్రయోగ వ్యవస్థలు, సంస్థలు భావజాల సాధనాలకు అనుబంధంగా, సహాయకంగా, ద్వితీయంగా మాత్రమే వినియోగంలో ఉంటాయి. అందుకనే ప్రాచీన భారతీయ సమాజంలో మొట్టమొదటగా ఆవిష్కృతమైన బౌద్ధవిప్లవం ప్రధానంగా ప్రత్యామ్నాయ భావజాల ప్రచారం, ప్రత్యామ్నాయ భావజాల సంబంధాలు, వ్యవస్థలు, సంస్థల ఏర్పాటు పైన ఆధారపడి ఉనికిలోకి వచ్చింది. దాని ఫలితంగా, అధికార బలప్రయోగ యంత్రాంగాన్ని కలిగిన రాజ్యం కూడా చివరకు లొంగి వచ్చింది. దక్షిణార్థగోళ వ్యవసాయక సమాజాల్లో రాజ్యాధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు ముఖ్యంగా పాలకవర్గ భావజాలం, భావజాల సంబంధాలు, వ్యవస్థల, సంస్థలు, వాటిని నియంత్రించే యంత్రాంగంతో పోరాడుతూనే, ప్రజల్లో ప్రత్యామ్నాయ విప్లవ భావజాల సంస్థల్ని, వ్యవస్థల్ని, సంబంధాల్ని నిర్మించడం ద్వారా రాజ్యాధికారాన్ని హస్తగతం చేసుకోగలమని బౌద్ధవిప్లవం నిరూపించింది. సామరస్య, సాయుధ వర్గపోరాట కమ్యూనిస్టు పార్టీలు రెండూ పాశ్చాత్య దేశాల్లోని బలప్రయోగ కేంద్రక విప్లవ గమనాన్ని మాత్రమే ఆదర్శంగా తీసుకున్నాయి. బౌద్ధ విప్లవానుభవాన్ని విస్మరించాయి. పుట్టడమే సైద్ధాంతిక బాల్యారిష్టంతో వర్గపోరాటాన్ని ప్రారంభించి దారి తప్పాయి. 2008 నుంచి సామాజిక, ఆర్థిక, పర్యావరణ సంక్షోభం కొనసాగుతోంది. విప్లవశక్తలు అత్యంత బలహీనంగా ఉండడంతో, ప్రపంచ పాలకవర్గ శక్తులు ఫాసిజాన్ని సంక్షోభ పరిష్కారంగా ముందుకు తీసుకొచ్చి ప్రజలపై తీవ్ర నిర్బంధాన్ని అమలు చేస్తాయి. పర్యవసానంగా అంతర్జాతీయ సమాజం అనాగరికయుగంలోకి జారిపోయే ప్రమాదం ఉంది. భారతీయ సమాజాన్ని సవ్యంగా అర్థం చేసుకుని, కమ్యూనిస్టు ఉద్యమ గమ్యాన్ని దక్షిణార్థగోళ వ్యవసాయ దేశాల్లోని రాజ్య స్వభావాన్ని అవగాహన చేసుకుంటూ ఉద్యుమ గమనాన్ని రూపొందించుకోవలసి ఉంటుంది.


వెన్నెలకంటి రామారావు

Updated Date - 2020-10-17T06:03:14+05:30 IST