కరోనా మరణాలకు ప్రభుత్వాలదే బాధ్యత

ABN , First Publish Date - 2021-05-11T04:49:24+05:30 IST

కరోనాతో బాధితులు మెరుగైన చికిత్స అందక మృత్యువాత పడ్తున్నారని, అందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ఆంజనేయులు డిమాండ్‌ చేశారు.

కరోనా మరణాలకు ప్రభుత్వాలదే బాధ్యత
సమావేశంలో మాట్లాడుతున్న సీపీఐ జిల్లా కార్యదర్శి ఆంజనేయులు

- జిల్లా కేంద్రంలో సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ ఏర్పాటు చేయాలి 

- సీపీఐ జిల్లా కార్యదర్శి ఆంజనేయులు

గద్వాల టౌన్‌, మే 10 : కరోనాతో బాధితులు మెరుగైన చికిత్స అందక మృత్యువాత పడ్తున్నారని, అందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ఆంజనేయులు డిమాండ్‌ చేశారు. జిల్లా కేంద్రంలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నాయకులకు ఎన్నికలపై ఉన్న శ్రద్ధ ప్రజల ఆరోగ్యంపై లేదని విమర్శించారు. దేశంలో కరోనా విలయతాండవం చేస్తున్నా, పాలకులు చోద్యం చూస్తున్నారని ఆరోపించారు. బాధితులు పిట్టల్లా రాలిపోతున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సరైన వైద్యం అందక కొవిడ్‌ బాధితులు చనిపోతున్నారని, దీంతో వారి కుటుం బాలు చిన్నాభిన్నం అవుతున్నాయన్నారు. బాధిత కుటుంబాలకు తక్షణమే రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించాలని డిమాండ్‌ చేశారు. కేసులు విపరీతంగా పెరుగుతున్నా, రాష్ట్రంలో లాక్‌డౌన్‌ విధించకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో ఫార్మా కంపెనీలు డ్రగ్‌ మాఫియా చేతిలో కీలుబొమ్మలుగా మారాయని ఆరోపించారు. అందరికీ వ్యాక్సిన్‌ అందించేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలన్నారు. పీఎం కేర్‌ నుంచి వచ్చే నిధులు ఎక్కడ ఖర్చు చేస్తున్నారో చెప్పాలన్నారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు కృష్ణకుమార్‌, నాయకులు శివ, సురేష్‌, వంశీ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-11T04:49:24+05:30 IST