Mega Family Vs Narayana: శాంతించిన నాగబాబు

ABN , First Publish Date - 2022-07-21T00:53:49+05:30 IST

సీపీఐ నారాయణ (CPI Narayana) ఈయన్ను ప్రత్యేకంగా పరిచయం చేయనక్కరలేదు. తన అభిప్రాయాన్ని ఏమాత్రం వణకకుండా

Mega Family Vs Narayana: శాంతించిన నాగబాబు

అమరావతి: సీపీఐ నారాయణ (CPI Narayana) ఈయన్ను ప్రత్యేకంగా పరిచయం చేయనక్కరలేదు. తన అభిప్రాయాన్ని ఏమాత్రం వణకకుండా, బెదరకుండా బ్రేకుల్లేకుండా వ్యక్తం చేస్తుంటారు. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌లపై నారాయణ ఏకకాలంలో తీవ్రమైన విమర్శలు చేసిన విషయం తెలిసిందే. జనసైనికులు, మెగా అభిమానులు ఒక్కసారిగా దండెత్తడంతో నారాయణ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని, క్షమాపణలు చెబుతున్నట్లు ఓ వీడియోను విడుదల చేశారు. దీంతో చిరంజీవి సోదరుడు నాగబాబు శాంతించారు. మెగా అభిమానులకు, జనసేన కార్యకర్తలకు ఓ విజ్ఞప్తి చేశారు. నారాయణపై సోషల్ మీడియాలో చేసిన ట్రోలింగ్స్‌ను ఆపేయాలని నాగబాబు కోరారు. తప్పు ఎవరు చేసినా క్షమాపణలు చెబితే వదిలేయాలన్నారు. ఇది మెగా, జనసైనికుల ధర్మమని పేర్కొన్నారు. నారాయణ పెద్ద వయస్సును దృష్టిలో పెట్టుకుని, ట్రోల్ చేయడం మానుకోవాలని నాగబాబు విజ్ఞప్తి చేశారు. 


చిరంజీవితో పాటు పవన్‌ కళ్యాణ్‌(Pawan kalyan)పై నారాయణ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. భీమవరంలో అల్లూరి సీతారామరాజు(Alluri sitaramaraju) విగ్రహావిష్కరణకు చిరంజీవి హాజరైన విషయాన్ని తప్పుపట్టారు. విగ్రహావిష్కరణ కార్యక్రమానికి అల్లూరి సీతారామరాజుగా నటించి ప్రేక్షకులకు అల్లూరిని పరిచయం చేసిన సూపర్ స్టార్ కృష్ణ(Krishna)ను పిలవకుండా చిల్లర బేరగాడు చిరంజీవిని స్టేజి మీదకు తీసుకువచ్చి పక్కన కూర్చోబెట్టుకున్నారని విమర్శించారు. అలాగే పవన్ ఒక ల్యాండ్ మైన్  లాంటివాడని అది ఎప్పుడు పేలుతుందో ఎవరికీ తెలియదని చెప్పుకొచ్చారు. నారాయణ వ్యాఖ్యలపై చిరు, పవన్ కళ్యాణ్ అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడిన విషయం తెలిసిందే. 


నారాయణ వ్యాఖ్యలపై నాగబాబు(Nagababu) ట్విట్టర్ ద్వారా కౌంటర్ ఇచ్చారు. ‘‘కొంత మంది చేసిన తెలివి తక్కువ... వెర్రి వ్యాఖ్యలపై జన‌సైనికులు,‌ మెగా అభిమానులు  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానీ మన కుర్రాళ్ళకి నేను చెప్పదలుచుకొందేంటంటే.. ఈ సీపీఐ నారాయణ అనే వ్యక్తి చాలా కాలం నుంచి అన్నం తినడం మానేసి, కేవలం ఎండి గడ్డి, చెత్తా చెదారం తింటున్నాడు.. కాబట్టి మన మెగా అభిమానులందరూ వెళ్లి అతనితో గడ్డి తినడం మాన్పించి...కాస్త అన్నం పెట్టండి ...! తద్వారా అతను మళ్లీ తెలివి తెచ్చుకుని మనిషిలా ప్రవర్తిస్తాడు’’ అంటూ ఘాటుగా విమర్శలు గుప్పిస్తూ నాగబాబు ట్వీట్ చేశారు. 


నారాయణపై విమర్శలు రావడంతో చిరంజీవిపై ఆయన చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు. భాషా దోషంగా భావించి తాను చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. చిరంజీవి కుటుంబంతో తనకు ఆత్మీయ సంబంధం ఉందన్నారు. రాజకీయంగా విమర్శలు చేయటం సహజమని నారాయణ పేర్కొన్నారు.

Updated Date - 2022-07-21T00:53:49+05:30 IST