గుడివాడ ప్రతిష్టను దిగజార్చారు!

ABN , First Publish Date - 2022-01-28T06:39:24+05:30 IST

కళలకు కాణాచి గుడివాడను కేసినో, జూదాలకు కేంద్ర బిందువుగా మార్చడం అత్యంత హేయమని సీపీఐ జిల్లా కార్యదర్శి అక్కినేని వనజ ఆవేదన వ్యక్తం చేశారు.

గుడివాడ ప్రతిష్టను దిగజార్చారు!

 సీపీఐ జిల్లా కార్యదర్శి అక్కినేని వనజ 

గుడివాడ, జనవరి 27 : కళలకు కాణాచి గుడివాడను కేసినో, జూదాలకు కేంద్ర బిందువుగా మార్చడం అత్యంత హేయమని సీపీఐ జిల్లా కార్యదర్శి అక్కినేని వనజ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్జీవో హోమ్‌లో గురువారం ఆమె విలేకరుల సమావేశంలో   మాట్లాడారు.  రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసినో వ్యవహారంలో దోషులు ఎంతటి వారైనా శిక్షించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. ఇప్పటికైనా డీజీపీ, సీఎం స్పందించాలని డిమాండ్‌ చేశారు. విలువైన రాజకీయాలు అందించాల్సిన ప్రజా ప్రతినిధులే కేసీనో, జూదాలను ప్రోత్సహించడం విష సంస్కృతికి బీజాలు నాటడమేనని విమర్శించారు. ఎంతో విశిష్టమైన తెలుగు సంస్కృతి, సంప్రదాయాలపై విదేశీ విష సంస్కృతిని తీసుకువచ్చి రుద్దడం భావ్యం కాదన్నారు. గుడివాడలో జరిగిన పరిణామాలను వదిలేస్తే భవిష్యత్తులో మరొక ప్రాంతంలో నిర్వహిస్తారని హెచ్చరించారు. కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి, ఎన్‌.టి.రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, ఘంటసాల వెంకటేశ్వరరావు, నార్ల తాతారావు, నార్ల వెంకటేశ్వరరావు,   గూడవల్లి రామబ్రహ్మం, హోమియో పితామహుడు ఎం.గురురాజు వంటి ఎంతో మంది లబ్ధప్రతిష్టులు పుట్టిన గుడివాడ ప్రతి ష్టను దిగజార్చే హక్కు ఎవరికీ లేదన్నారు. క్యాసినోనిర్వహించిన వారిని పోలీసులు వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు.   ఉద్యోగుల ప్రయోజనాలు హరించే పీఆర్సీ చీకటి జీవోలను వెంటనే రద్దు చేసి పాత జీతాలను ఇవ్వాలని కోరారు.  పీఆర్సీ విష యంలో ఉద్యోగుల పోరాటానికి సీపీఐ మద్దతు ఇస్తోందన్నారు.  ఉద్యోగులు సమ్మెకు దిగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం దారుణమన్నారు. ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు నార్ల వెంకటేశ్వరరావు, మహిళా సమాఖ్య రాష్ట్రకోశాధికారి పి.దుర్గాంబ, నియోజకవర్గ కార్యదర్శి గూడపాటి ప్రకా్‌షబాబు, తదితరులు పాల్గొన్నారు. 

 సీపీఐ  సీనియర్‌ నేత

 సువిశ్వేశ్వరరావుకు పరామర్శ

గుడివాడటౌన్‌  : భారత కమ్యూనిస్టు పార్టీ సీనియర్‌ నాయకుడు గూడపాటి సువిశ్వేశ్వరరావును సీపీఐ జిల్లా కార్యదర్శి అక్కినేని వనజ గురువారం పరామర్శించారు. గుడివాడ ప్రాంతంలో కార్మికోద్యమ నాయకునిగా  బాధ్యతలు నిర్వహించిన గూడపాటి పెదఎరుకపాడులోని స్వగృహంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. గుడివాడ విచ్చేసిన సీపీఐ నాయకులతో కలిసి గూడపాటి ఇంటికి వెళ్లి ఆమె పరామర్శించారు. సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు నార్ల వెంకటేశ్వరరావు, మహిళా సమాఖ్య కోశాధికారి పంచదార్ల దుర్గాంబ, ఏరియా కార్యదర్శి గూడపాటి ప్రకా్‌షబాబు, జి.నిర్మల జ్యోతి, భవాని తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-28T06:39:24+05:30 IST