AP: రాష్ట్రంలో పంట నష్టం తీవ్రంగా ఉంది... రైతులు అల్లాడుతున్నారు: మధు

ABN , First Publish Date - 2021-11-22T17:18:04+05:30 IST

రాష్ట్రంలో నాలుగు జిల్లాల్లో వందేళ్ల చరిత్రలో కనీ వినీ ఎరుగని రీతిలో వరదలు వచ్చాయని మధు అన్నారు.

AP: రాష్ట్రంలో పంట నష్టం తీవ్రంగా ఉంది... రైతులు అల్లాడుతున్నారు: మధు

తూ.గో. జిల్లా: రాష్ట్రంలో నాలుగు జిల్లాల్లో వందేళ్ల  చరిత్రలో కనీ వినీ ఎరుగని రీతిలో వరదలు వచ్చాయని, ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. సోమవారం ఆయన రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ రాజకీయంగా స్పందించి అఖిలపక్షం సమావేశం నిర్వహించాలన్నారు. పంట నష్టం తీవ్రంగా ఉందని, రైతులు అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరానికి ఇన్ పుట్ సబ్సిడీ రూ. 20 వేలు తక్షణమే మంజూరు చేయాలన్నారు. ఇళ్ళు కూలిపోయిన వారికి తక్షణ సాయంగా రూ.15 వేలు ఇవ్వాలన్నారు. వరద బాధితులకు సీపీఎం కార్యకర్తలు సహాయక చర్యలు చేపట్టారన్నారు. 


తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు తెలంగాణ తరహాలో ఏపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని మధు సూచించారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే రైతుల పక్షాన సీపీఎం పోరాటాలు చేస్తుందన్నారు. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యేలు చేసిన అనుచిత వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి జగన్ స్పందించి ఇరుపక్షాలను సర్దుబాటు చేయాలన్నారు. మూడు రాజధానులు ఏర్పాటు చేసుకోవాలని చెప్పిన బీజేపీ ఇప్పుడు అమరావతి రైతుల పాదయాత్రను ప్రోత్సాహిస్తోందని మధు అన్నారు.

Updated Date - 2021-11-22T17:18:04+05:30 IST