మోదీని గద్దె దించడం అనివార్యం

ABN , First Publish Date - 2022-09-25T09:48:23+05:30 IST

‘‘ప్రధాని నరేంద్ర మోదీని గద్దె దించడం అనివార్యం. మోదీ ప్రభుత్వాన్ని ఓడించాలంటే ప్రతిపక్ష లౌకికవాద పార్టీలన్నీ ఐక్యతను ప్రదర్శిస్తూ దేశంలో అతిపెద్ద లౌకిక ప్రత్యామ్నాయాన్ని సృష్టించాల్సిన అవసరం ఉంది.

మోదీని గద్దె దించడం అనివార్యం

లౌకికవాద, ప్రతిపక్షాలన్నీ ఐక్యతను చాటాలి

ఎటువైపన్నది జగన్‌ తేల్చుకోవాలి: సీతారాం ఏచూరి

విజయవాడలో ‘దేశ రక్షణ భేరీ’ బహిరంగ సభ


అమరావతి, సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి): ‘‘ప్రధాని నరేంద్ర మోదీని గద్దె దించడం అనివార్యం. మోదీ ప్రభుత్వాన్ని ఓడించాలంటే ప్రతిపక్ష లౌకికవాద పార్టీలన్నీ ఐక్యతను ప్రదర్శిస్తూ దేశంలో అతిపెద్ద లౌకిక ప్రత్యామ్నాయాన్ని సృష్టించాల్సిన అవసరం ఉంది. ఈ దిశగా సీపీఎం కృషి చేస్తోంది’’ అని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తెలిపారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ శనివారం విజయవాడలోని జింఖానా గ్రౌండ్స్‌లో నిర్వహించిన ‘దేశ రక్షణ భేరీ’ సభలో ఆయన ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. ‘‘దేవీలాల్‌ జన్మదినం సందర్భంగా హర్యానాలో జరిగే బహిరంగ సభకు ప్రతిపక్ష పార్టీల నాయకులందరినీ ఆహ్వానించారు. మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించాలంటే లౌకిక పార్టీలన్నీ కలిసి పోరాడాల్సిన అవసరం ఉందని ప్రకటించబోతున్నాం.


ఏపీలో పాలక పార్టీ వైసీపీ కూడా ఈ విషయంలో కీలక నిర్ణయం తీసుకోవాలి. వైసీపీ అధ్యక్షుడు, సీఎం జగన్‌ ఎటువైపు ఉంటారనేది చెప్పాలి’’ అని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర విభజన సమయంలో రాజ్యసభలో ప్రత్యేక హోదాపై వెంకయ్య నాయుడు హామీ ఇచ్చిన తీరును గుర్తు చేశారు. ఏడేళ్లుగా కేంద్రంలో బీజేపీనే అధికారంలో ఉన్నా ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో ఒక్క అడుగు ముందుకు వేయలేదన్నారు. పైగా కేంద్రం రాష్ట్రానికి ఇవ్వాల్సిన రూ.36వేల కోట్ల నిధులు బకాయి పెట్టిందని విమర్శించారు. ‘‘మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక, నిరంకుశ విధానాలపై ఎలాంటి వైఖరి తీసుకుంటారనేది వైసీపీ నిర్ణయంచుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా వెళితే ఎర్రజెండా పట్టుకుని పోరాడతాం. ప్రజా పోరాటాలను బలపరుస్తాం’’ అని ఏచూరి స్పష్టం చేశారు. ‘‘ఏడేళ్లుగా దేశ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా సర్వనాశనం చేసే విధానాలు, పద్ధతులను మోదీ అనుసరిస్తున్నారు.


రూ.వందల, వేల కోట్ల దేశ సంపదను తన మిత్రులైన బడా పెట్టుబడిదారులకు రాయితీలుగా దోచిపెడుతున్నారు. మోదీ ప్రధాని కాకముందు ప్రపంచ సంపన్నుల జాబితాలో 330వ స్థానంలో ఉన్న అదానీ.. మోదీ ప్రధాని అయ్యాక రెండో స్థానానికి చేరాడు. నిన్నగాక మొన్న వేదాంత అనే బడా పెట్టుబడిదారునికి గుజరాత్‌లో మైనింగ్‌ చేసుకోవడానికి మోదీ ప్రభుత్వం రూ.80 వేల కోట్ల సబ్సిడీ ఇచ్చింది. ఈ విధంగా ఐదుగురు మోదీ మిత్రులు అపర కోటీశ్వరులుగా ఎదిగారు. మోదీ మిత్రులైన బడా పెట్టుబడిదారులు ఈ ఏడేళ్లలోనే బ్యాంకుల నుంచి తీసుకుని ఎగ్గొట్టిన రూ.11 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేశారు. పెట్టుబడుదారులకు రూ.2లక్షల కోట్ల పన్నుల భారాన్ని తగ్గించి, సామాన్య ప్రజలపై భారాన్ని పెంచారు.


దేశంలో 20 నుంచి 25ఏళ్ల వయసు యువతీ యువకుల్లో 42శాతం నిరుద్యోగులుగా మిగిలిపోయారు. దేశంలో 10లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా పడి ఉన్నాయి. నిరాశతో 11,000మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు. ఏ రాజ్యాంగం వల్ల మోదీ ప్రధాని అయ్యాడో.. అదే రాజ్యాంగాన్ని ధ్వంసం చేయడానికి పూనుకుంటున్నారు. దేశంలో లౌకికవాదాన్ని సర్వనాశనం చేస్తున్నారు. ఎన్నికల్లో ఓడిపోతున్నా తమ చేతిలో ఉన్న ఈడీ, సీబీఐ అనే ఆయుధాలను ఉపయోగించి ప్రతిపక్ష నేతలను లొంగదీసుకుని ప్రభుత్వాలను బీజేపీనే ఏర్పాటు చేస్తోంది. ఇది ప్రజాస్వామ్యమా?’’ అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా పలు రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన తీరును గుర్తుచేశారు. ప్రజావ్యతిరేక విధానాలను మానుకోకపోతే ప్రతిపక్షాలన్నీ కలిసి మోదీ ప్రభుత్వాన్ని గద్దెదించి.. ప్రజలకు అనుకూలమైన ప్రభుత్వాన్ని తీసుకువచ్చి విధానాలను మారుస్తాం’’ అని సీతారాం ఏచూరి పేర్కొన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, నేతలు సీహెచ్‌ బాబూరావు, గఫూర్‌, పి.మధు తదితరులు మాట్లాడారు. 

Updated Date - 2022-09-25T09:48:23+05:30 IST