సీపీఎస్‌..సీక్రెట్‌!

ABN , First Publish Date - 2022-08-14T08:05:49+05:30 IST

సీపీఎస్‌..సీక్రెట్‌!

సీపీఎస్‌..సీక్రెట్‌!

మరో నాటకానికి తెర లేపారా?

రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లో అధ్యయనం

రంగంలోకి నిఘా విభాగం

ఐదుగురు ఉద్యోగ నేతలతో కలిసి

ఐదు రోజుల రహస్య పర్యటన

అక్కడ సీపీఎస్‌ రద్దు సాఫీగా అమలు

ఇబ్బందే లేదన్న ఆ రాష్ట్రాల అధికారులు

సర్కారుకు నిఘా విభాగం నివేదిక!

ఓపీఎస్‌ కుదరదని తేల్చిచెప్పిన జగన్‌

ఇప్పుడు రహస్య అధ్యయనం ఎందుకు?

ఎన్నికల ముందు మభ్యపెట్టేందుకేనా?


ఉద్యోగులను తీవ్ర అసంతృప్తి, ఆగ్రహానికి గురి చేస్తున్న కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌పై వైసీపీ సర్కారు కొత్త నాటకానికి తెర లేపుతోందా? ఎన్నికల ముందు ఉద్యోగులను ప్రసన్నం చేసుకునేందుకు మరో కాలయాపన వ్యూహం రచిస్తోందా? గుట్టుగా సాగుతున్న ‘అధ్యయనం’ వెనుక లక్ష్యమేమిటి? నిజంగా  సీపీఎస్‌ను రద్దు చేయాలనుకుంటే... అంత గోప్యత ఎందుకు? అధికారులు చేయాల్సిన పనిని నిఘా వర్గాలతో చేయించడం ఎందుకు? ఇలా ఎన్నెన్నో ప్రశ్నలు!


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

రాజస్థాన్‌లో నీటి యాజమాన్య పద్ధతులపైనా, ఛత్తీ్‌సగఢ్‌లో అటవీ సంరక్షణ విధానాలపైనా అధ్యయనం చేయాలనుకుంటే... రాష్ట్రం నుంచి అధికార బృందాలను పంపించవచ్చు. అక్కడి విధానాల్లో మంచి ఏముందో తెలుసుకోవచ్చు! అదేవిధంగా... ఛత్తీ్‌సగఢ్‌, రాజస్థాన్‌ ప్రభుత్వాలు సీపీఎ్‌సను రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని ఎలా అమలు చేస్తున్నాయో తెలుసుకునేందుకూ ఒక బృందాన్ని పంపొచ్చు. జగన్‌ సర్కారు కూడా అదే పని చేసింది. కానీ... అత్యంత రహస్యంగా, గుట్టుగా, గోప్యంగా ఈ పనిచేయడమే అనేక అనుమానాలకు తావిస్తోంది. అందులోనూ... ఆర్థిక శాఖ అధికారులు, ఉద్యోగ సంఘాల నేతలు చేయాల్సిన ఈ పని ‘నిఘా విభాగం’ ప్రత్యక్ష పర్యవేక్షణలో సాగడం గమనార్హం! విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... కొందరు ఉద్యోగ సంఘాల నాయకులు, ఇంటెలిజెన్స్‌ సిబ్బంది రాజస్థాన్‌, ఛత్తీ్‌సగఢ్‌ రాష్ట్రాలకు వెళ్లి అక్కడ సీపీఎస్‌ రద్దు, మళ్లీ ఓపీఎస్‌ అమలు చేస్తున్న విధానంపై అధ్యయనం చేసినట్లు తెలిసింది. ఈ వ్యవహారం బయటకు పొక్కకూడదని, గుట్టుగా సాగాలని ఇంటెలిజెన్స్‌ అధికారులకు ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లు సమాచారం. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇంటెలిజెన్స్‌ సిబ్బందితో పాటు ఐదుగురు సీపీఎస్‌ ఉద్యోగ సంఘాల నేతలను రాజస్థాన్‌, ఛత్తీ్‌సగఢ్‌ రాష్ట్రాలకు పంపారు. సీపీఎస్‌ రద్దు, ఓపీఎస్‌ అమలుపై 5 రోజుల పాటు పరిశీలించి తిరిగి రాష్ట్రానికి వచ్చారు. తొలుత రాజస్థాన్‌, తర్వాత ఛత్తీ్‌సగఢ్‌లో వీరు పర్యటించినట్లు తెలిసింది. ఆ రాష్ట్రాలు సీపీఎస్‌ రద్దు చేసి, ఆ వెంటనే ఓపీఎస్‌ అమలు చేస్తున్న విధానం, ఎన్‌ఎ్‌సడీఎల్‌ నుంచి సీపీఎస్‌ ఉద్యోగుల డబ్బులు తిరిగి తెచ్చుకోవడానికి అనుసరించే విధానంపై నివేదికను సిద్ధం చేసి ఇంటెలిజెన్స్‌ డీజీకి అందజేసినట్లు సమాచారం. ఆ నివేదిక అక్కడ నుంచి ప్రభుత్వానికి చేరింది. ఓపీఎస్‌ అమలు వల్ల రాష్ట్రాలకు పెద్దగా ఆర్థిక భారం పడదని ఆ రాష్ట్రాల అధికారులు వివరించినట్లు తెలిసింది.


రాజస్థాన్‌లో ‘రద్దు’ ఇలా...

సీపీఎస్‌ రద్దు చేయాలన్న ఉద్యోగుల వినతులను రాజస్థాన్‌ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది. పాత పెన్షన్‌ స్కీం అమలు చేయడం వల్ల రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం చేసే ఖర్చులో ఒక్క రూపాయి కూడా తగ్గదని ప్రకటించింది. రద్దు నిర్ణయం ప్రకటించిన ఒకట్రెండు నెలల్లోనే ఓపీఎస్‌ అమల్లోకి తెచ్చినట్లు అక్కడి ఉద్యోగులు ఏపీ బృందానికి వివరించినట్టు తెలిసింది. సీపీఎస్‌ రద్దు చేశాక ఉద్యోగులకు పీఎఫ్‌ ఖాతాలు తెరిచి, పాత పెన్షన్‌ ప్రకారం పీఎఫ్‌ కట్‌ చేస్తున్నట్లు ఏపీ ఉద్యోగుల బృందం గుర్తించినట్లు సమాచారం. సీపీఎస్‌ నుంచి ఓపీఎ్‌సకు మారితే... ఇప్పటి వరకు నేషనల్‌ సెక్యూరిటీ డిపాజిటరీ లిమిటెడ్‌(ఎన్‌ఎ్‌సడీఎల్‌)లో ఉన్న సీపీఎస్‌ ఉద్యోగుల డబ్బుల సంగతి ఏంటని ఏపీ బృందం ప్రశ్నించింది. దీనిపై రాజస్థాన్‌ రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి స్పష్టత ఇచ్చారు. ఆ రాష్ట్రానికి చెందిన సీపీఎస్‌ ఉద్యోగుల డబ్బులు రూ.39 వేల కోట్లు ఎన్‌ఎ్‌సడీఎల్‌లో ఉన్నాయని.. ఆ డబ్బులు తిరిగి ఇవ్వబోమని కేంద్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఎంవోయూలో లేదని, ఆ నిధులు తిరిగి తెచ్చుకుంటామని స్పష్టం చేసినట్లు తెలిసింది. ఒకవేళ కేంద్రం ఇవ్వకపోతే ఆర్టికల్‌ 131 ప్రకారం స్టేట్‌ సెంట్రల్‌ డిస్ట్రిబ్యూట్స్‌ కోర్టుకు వెళతామని తెలిపినట్లు తెలిసింది. 


ఛత్తీ్‌సగఢ్‌లోనూ చకచకా..  

ఛత్తీ్‌సగఢ్‌లో కూడా సీపీఎస్‌ రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత ఓపీఎస్‌ అమలుకు పెద్దగా సమయం తీసుకోలేదని అక్కడి ఉద్యోగులు ఏపీ బృందానికి వివరించినట్టు తెలిసింది. సెక్రటరీ, జాయింట్‌ సెక్రటరీ, డిప్యూటీ సెక్రటరీ అధికారులు ముగ్గురు కూర్చుని సీపీఎస్‌ రద్దు, ఓపీఎస్‌ అమలు ప్రక్రియ పూర్తి చేసినట్లు సమాచారం.  సీపీఎస్‌ రద్దు చేశాక 2.93 లక్షల మంది ఉద్యోగులకు వెంటనే పీఎఫ్‌ ఖాతాలు తెరవడం, ఓపీఎస్‌ అమలుకు జీవోలు ఇవ్వడం, అమలు చేయడం చకచకా జరిగిపోయిందని అక్కడివారు వెల్లడించినట్టు తెలుస్తోంది. చర్చలు, సమావేశాలు, కమిటీల పేరుతో కాలయాపన చేయకుండా ప్రభుత్వం ఓపీఎస్‌ అమలు చేసిన తీరుపై ఏపీ బృందం ఒకింత ఆశ్చర్యానికి గురైనట్లు తెలిసింది. ఛత్తీ్‌సగఢ్‌ ప్రభుత్వం పాత పెన్షన్‌లోకి సీపీఎస్‌ ఉద్యోగులను మార్చకముందే 4 శాతం కార్పస్‌ ఫండ్‌  ఏర్పాటు చేసినట్లు అక్కడి అధికారులు స్పష్టం చేశారు. ‘‘సీపీఎస్‌ అయితే ఒక్కో ఉద్యోగికి 14 శాతం చెల్లించాల్సి ఉంటుంది. కార్పస్‌ ఫండ్‌ ఏర్పాటు చేయడం వల్ల 4 శాతమే కట్‌ అవుతుంది. దీనివల్ల ప్రభుత్వానికి 10 శాతం మిగులుతుంది. సీపీఎస్‌ విధానం కంటే ఓపీఎస్‌ వల్ల ప్రభుత్వానికి ఆర్థిక భారం తగ్గుతుంది. ఉద్యోగుల పదవీ విరమణ ప్రభావం ఎప్పుడో 30 ఏళ్లకు కొద్దిగా పడుతుంది. దానివల్ల ప్రభుత్వానికి పెద్దగా ఇబ్బంది ఉండదు’’ అని ఛత్తీ్‌సగఢ్‌ అధికారులు ఏపీ బృందానికి వివరించినట్టు తెలిసింది. ఎన్‌ఎ్‌సడీఎల్‌లో ఆ రాష్ట్రానికి చెందిన ఉద్యోగుల డబ్బులు రూ.18 వేల కోట్లు ఉన్నాయని,  వాటిని ప్రభుత్వం తిరిగి తీసుకోనున్నట్లు సమాచారం. 


గుట్టుగా ఎందుకో..? 

సీపీఎస్‌ రద్దు విషయం గురించి తెలుసుకునేందుకు జగన్‌ సర్కార్‌ నేరుగా రాజస్థాన్‌, ఛత్తీ్‌సగఢ్‌ ప్రభుత్వాలతో సంప్రదింపులు జరుపవచ్చు. ఆ రాష్ట్రాల్లో అమలవుతున్న విధానంపై నివేదికలు తెప్పించుకోవచ్చు. లేదా ప్రభుత్వ స్థాయిలో అధికారులు, ఉద్యోగ సంఘాల నేతలతో కమిటీ వేసి అధికారికంగానే అక్కడికి పంపవచ్చు. అలా చేయకుండా ఇంటెలిజెన్స్‌ను రంగంలోకి దించడం గమనార్హం. పాత పెన్షన్‌ పద్ధతిని అమలు చేయలేమని జగన్‌ సర్కారు ఇప్పటికే తేల్చిచెప్పింది. ఓపీఎ్‌సవల్ల భవిష్యత్తులో మోయలేనంత భారం పడుతుందని కోట్లు ఖర్చుపెట్టి ప్రకటనలు కూడా జారీ చేసింది. ‘గ్యారెంటీడ్‌ పెన్షన్‌ స్కీమ్‌’ (జీపీఎ్‌స)ను తెరపైకి తెచ్చింది. ఎన్నికల ముందు వారంలో సీపీఎ్‌సను రద్దుచేస్తామని, ఇప్పుడు మాటతప్పడంపై ఉద్యోగులు భగ్గుమంటున్నారు. సీపీఎస్‌, జీపీఎ్‌సలకు అంగీకరించేది లేదని, ఓపీఎస్‌ మాత్రమే కావాలని తేల్చి చెబుతున్నారు. నయానో భయానో ఉద్యమాలను ప్రభుత్వం అణచివేసినప్పటికీ... ఉద్యోగులు మాత్రం లోలోపల రగిలిపోతున్నారు. రాష్ట్రంలో సుమారు 2 లక్షల మంది సీపీఎస్‌ ఉద్యోగులున్నారు. అటు... పీఆర్సీలో తమకు అన్యాయం జరిగిందంటూ మొత్తం ప్రభుత్వ ఉద్యోగులు మండిపడుతున్నారు. ఎన్నికలకు మరో 20 నెలల సమయం కూడా లేదు. ఈ నేపథ్యంలో... ఉద్యోగులను మరోసారి మభ్యపెట్టేందుకు మరో వ్యూహాన్ని రచించారనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఛత్తీ్‌సగఢ్‌, రాజస్థాన్‌లకు నిఘా వర్గాలను పంపి ఈ నివేదిక తెప్పించుకోవడం వెనుక ఉద్దేశం ఏంటి? సీపీఎస్‌ రద్దు కుదరదు.. జీపీఎస్‌ అంటూ మళ్లీ పాతపాట పాడుతుందా? సీపీఎస్‌ రద్దు చేస్తుందా? ఏదో జరుగుతుందని సీపీఎస్‌ ఉద్యోగులను మభ్యపెట్టడమే అసలు లక్ష్యమా? ఇలా ఇలా ఎన్నో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 

Updated Date - 2022-08-14T08:05:49+05:30 IST