అంతా జీరోనే..

ABN , First Publish Date - 2021-11-02T06:22:07+05:30 IST

జిల్లాలో జీరో వ్యాపారం జోరుగా సాగుతోంది. రూ.కోట్లు విలువైన టపాసులు తెచ్చి వ్యాపారం చేసేసిన వ్యాపారులు పన్ను చెల్లించకుండా జీరో వ్యాపారానికి తెరలేపారు.

అంతా జీరోనే..

మొదలైన టపాసుల వ్యాపారం

ఆ ముగ్గురు వ్యాపారులే కీలకం

25 శాతం పన్ను కూడా చెల్లించకుండానే అమ్మకాలు

జిల్లా వ్యాప్తంగా అధికారికంగా 448 షాపులు 

అనధికారికంగా మరో వెయ్యికిపైగా దుకాణాలు 

పన్ను ఎగవేతతో ప్రభుత్వాదాయానికి భారీగా గండి

అనంతపురం కార్పొరేషన, నవంబరు1: జిల్లాలో జీరో వ్యాపారం జోరుగా సాగుతోంది. రూ.కోట్లు విలువైన టపాసులు తెచ్చి వ్యాపారం చేసేసిన వ్యాపారులు పన్ను చెల్లించకుండా జీరో వ్యాపారానికి తెరలేపారు. ప్రతి ఏటా దీపావళి పండుగ సమయంలో పన్నుల శాఖ ద్వారా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండి పడుతూనే ఉంది. ఈ సారి కూడా అక్రమార్కులు అదే వ్యవహారం నడిపారు. వాస్తవానికి టపాసుల వ్యాపారం నిర్వహించే వారు పన్నుల శాఖకు 28శాతం  జీ ఎస్టీ చెల్లించాలి. అంటే రూ.లక్ష సరుకుకు రూ.28 వేలు చెల్లించక తప్పదు. కానీ ఇక్కడ అలా జరగడం లేదు. మేగజైన అనుమతి ఉన్న దుకాణాలు జిల్లాలో మూడు మాత్రమే ఉన్నాయి. గుంతకల్లులో ఒకే వ్యాపారి రెండు ట్రేడర్స్‌(రాయలసీమ వ్యాప్తంగా)తో, అనంతపురంలో మరో ట్రేడర్‌ పేరుతో కీలక వ్యాపారి విక్రయాలు జరుపుతుంటారు. ఒక్కో వ్యాపారి దీపావళి సందర్భంలో రూ.5 కోట్లకు పైగా టపాసులు గోడౌనలో స్టాక్‌ ఉంచుతారని అంచనా. వీళ్ల నుంచే జిల్లాలోని అన్ని ప్రాంతాల వ్యాపారులకు టపాసులు సరఫరా అవుతాయి. కానీ పన్నుల శాఖకు ఆ స్టాయి లో పన్నులు రావడం లేదనే విమర్శలున్నాయి. 


ఆ మూడు ట్రేడర్స్‌ నుంచే రూ.కోటికిపైగా ఎగనామం

గుంతకల్లులో ఒకే వ్యాపారి రెండు ట్రేడర్స్‌ పేర్లతో వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఏడాది పొడవునా వీరికి వ్యాపారం నిర్వహించే అనుమతి ఉంటుంది. ఆ వ్యాపారం సంగ తి అలా ఉంచితే దీపావళిలో దుకాణాల ఏర్పాటుకు భారీగానే విక్రయాలు జరుపుతారు. రాయలసీమ వ్యాప్తంగా అమ్మకాలుంటాయి. ఆ మేరకు  రూ.కోట్లలోనే శివకాశి నుంచి తెచ్చిన టపాసులను విక్రయించేస్తారు. ఈ సారి కూడా భారీగానే సరుకు రవాణా చేసినట్లు తెలిసింది. నగరంలోని పలు దుకాణాలతో పాటు జిల్లా వ్యాప్తంగా వందల సంఖ్యలో దుకాణాలకు సరఫరా చేసినట్లు సమాచారం. ఒక్కో దుకాణానికి రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు సరఫరా చేసి ఉంటారు. కనీసం 400 దుకాణాలకు లెక్కవేసినా రూ.2.5 కోట్లుపైగా సరఫరా జరిగి ఉంటుంది. ఆ మేరకు పన్నులశాఖకు రూ.70 లక్షలైనా చెల్లించాలి. మొత్తం విక్రయాలు జరిపిన తరువాత చెల్లిస్తామనడం...ఆ తరువాత చెల్లించకపోవడం పరిపాటిగా మారింది. నగరంలోని మరో కీలక వ్యాపారి గార్లదిన్నె మండలం లోలూరులో ఓ భారీ గోడౌనలో సరుకు ఉంచుతారు. ఈయన కూడా జిల్లా వ్యాప్తంగా వందల సంఖ్యలోనే టపాసుల షాపులకు సరుకు పంపుతారు. ఈయనకు అదనంగా ఇస్కాన టెంపుల్‌ సమీపంలో ఓ ప్రత్యేక గోడౌన ఉంది. ఈయన కూడా రూ.2 కోట్లకు పైగా సరుకు సరఫరా చేస్తాడనే పేరుంది. ఈయన చాలా తక్కువ శాతం పన్ను కడుతున్నారని తాజాగా జరిగిన సమావేశంలో ఇతర దుకాణాల వ్యాపారులే ఆరోపించినట్లు సమాచారం. ఆ మూడు ట్రేడర్స్‌ నుంచి రూ.కోటికిపైగా పన్ను ఎగనామం జరిగి ఉంటుందని పన్నుల శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.


పన్ను కట్టకుండా తప్పించుకు తిరుగుతున్న ఆ వ్యాపారి ఎవరు...?

ఓ ట్రేడర్‌ పేరుతో ప్రతి ఏటా శివకాశి నుంచి టపా సులు తీసుకురావడం గుట్టుచప్పుడు కాకుండా జిల్లాలోని పలు దుకాణాలకు టపాసులు విక్రయించడం ఆ వ్యాపారి స్పెషాలిటీ. రెండేళ్ల కిందట అతడి లారీలు రెండు  పట్టు బడటం గమనార్హం.  ప్రతి ఏటా నగరంలో ఆ వ్యాపారి ఏర్పాటు చేసే దుకాణానికి తప్ప మిగిలిన సరుకుకు  పన్నుల శాఖకు ఒక్క రూపాయి కూడా పన్ను చెల్లించకుండా తప్పించుకుతిరుగుతాడని సమాచారం. పాతూరులోని గాంధీబజార్‌లో ఓ దుకాణం నిర్వహించే ఈ వ్యాపారి ఈ సారి రూ.అరకోటిపైగానే సరుకు విక్రయాలు జరిపినట్లు సమాచారం. అంటే ఆ వ్యాపారి కూడా రూ.20 లక్షలపైగా పన్ను ఎగవేసినట్లు తెలుస్తోంది.


జిల్లాకేంద్రంలోనే 100 షెడ్లు

జిల్లా వ్యాప్తంగా మొత్తం కలెక్టరేట్‌లో 448 దరఖాస్తులు టపాసుల అమ్మకానికి అనుమతి పొందినట్లు తెలిసింది. వీరు అగ్నిమాపక, పన్నుల శాఖకు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే జిల్లా వ్యాప్తంగా అనధికారికంగా మరో వెయ్యికిపైగా దుకాణాల ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. పట్టణాలు, మండల కేంద్రాల్లో అనుమతి లేకుండానే చాలా మంది షాపుల్లో టపాసులు విక్రయించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఈ సారి అనంతపురం నగరంలో 100 దుకాణాలు ఏర్పాటు చేయనున్నారు. మంగళవారం లాటరీ తీయనున్నారు. 


హోసూరు నుంచి ముందే టపాసులు

గత కొన్ని సంవత్సరాల నుంచి దుకాణాలు నిర్వహించి వ్యాపారాలు చేస్తున్న విక్రయదారులు ఈ సారి కాస్త ముందుగానే జాగ్రత్తపడ్డారు. కర్ణాటక రాష్ట్రం హోసూరు నుంచి పలువురు వారం రోజుల నుంచి టపాసులు తె ప్పించుకున్నారు. ఒక్కో వ్యాపారి రూ.4లక్షల నుంచి రూ.8 లక్షల వరకు సరుకును తెప్పించుకున్నట్లు తెలిసింది. కానీ ఈ సారి ఏ ఒక్క వాహనమూ పట్టుపడకపోవడం గమ నార్హం. 


పన్ను పెంచిన అధికారులు

గత కొన్నేళ్లుగా ప్రతి ఏటా దీపావళి సందర్భంగా ఏర్పా టు చేసే దుకాణాలకు రూ.15 వేలు పన్ను విధించి సరి పుచ్చిన పన్నుల శాఖ అధికారులు ఎట్టకేలకు పెంచేశారు. ఈ సారి మున్సిపాలిటీ ప్రాంతాల్లో అనుమతి ఉన్న దుకా ణాలకు రూ.35 వేలు, మండల కేంద్రాల్లో షాపులకు రూ.30 వేలు చొప్పున పన్ను విధించారు. గతంతో పోల్చితే పన్నుల శాఖకు దుకాణాల విషయంలో ఈ ఏడాది ఆదాయం పెరగనుంది. 


ఒక్కో షెడ్డుకు రూ.30 వేలు వసూలు...

ఈ సారి కూడా నగరంలోని దుకాణాలు సవీరా ఆస్పత్రి వెనుక భాగంలోనే ఏర్పాటు చేయనున్నారు. ఈసారి ముగ్గురు వ్యక్తులు షెడ్ల ఏర్పాటు వసూళ్లలో కీలకంగా వ్యవహరించినట్లు సమాచారం. అధికార పార్టీకి చెందిన ఇద్దరు నాయకులు, మరో సినీహీరో అభిమాన సంఘం నాయకుడు ఏకమైనట్లు తెలిసింది. దుకాణాల వ్యాపారులతో ఎలాంటి సమావేశం నిర్వహించకుండానే ఆదివారం వ్యాట్సా్‌పలో ఒక్కో షెడ్డుకు రూ.35 వేలు ఇవ్వా లని సమాచారం పంపారట. అందరి నుంచి వ్యతిరేకత రావడంతో రూ.30 వేలు వసూలు చేయాలని నిర్ణయించా రట. దుకాణాలు కూడా ఎప్పటిలాగే కనీసం మూడు అడుగులు వదలకుండా పక్కపక్కనే ఏర్పాటు చేయడం గమనార్హం. మరి వసతులు, రక్షణ భద్రతను ఎలా ఏర్పాటు చేస్తారో వేచి చూడాల్సిందే. 

Updated Date - 2021-11-02T06:22:07+05:30 IST