స్కేటింగ్‌కు క్రేజ్‌

ABN , First Publish Date - 2022-05-17T05:27:21+05:30 IST

స్కేటింగ్‌ అనే ఆట గురించి వినడం, టీవీల్లో చూడటమే తప్ప నేర్చుకోవాలంటే అందని ద్రాక్షగానే ఉండేది. మహానగరాలకు మాత్రమే ఈ క్రీడ పరిమితమయ్యేది. కాళ్లకు చక్రాలు కట్టుకుని రయ్యిన పోవాలంటే ఒకింత భయం.. ఒకింత సంబరం కూడా ఉంటుంది. కానీ ఇటీవల సిద్దిపేటలో పరిచయమైన ఈ వెస్ట్రన్‌ గేమ్‌కు చిన్నారులు ఆకర్షితులయ్యారు. పోటీపడి నేర్చుకుంటున్నారు.

స్కేటింగ్‌కు క్రేజ్‌
సిద్దిపేటలోని కోమటిచెరువు ఓపెన్‌ ఏయిర్‌ ఆడిటోరియం వద్ద స్కేటింగ్‌లో శిక్షణ

మహానగరాల నుంచి పట్టణాలకు

సిద్దిపేటలో ఆకర్షిస్తున్న వెస్ట్రన్‌ గేమ్‌

నేర్చుకునేందుకు చిన్నారుల ఆసక్తి

రింక్‌ ఏర్పాటు చేస్తే మరింత ప్రొత్సాహం


సిద్దిపేట క్రైం, మే 16 : స్కేటింగ్‌  అనే ఆట గురించి వినడం, టీవీల్లో చూడటమే తప్ప నేర్చుకోవాలంటే అందని ద్రాక్షగానే ఉండేది. మహానగరాలకు మాత్రమే ఈ క్రీడ పరిమితమయ్యేది. కాళ్లకు చక్రాలు కట్టుకుని రయ్యిన పోవాలంటే ఒకింత భయం.. ఒకింత సంబరం కూడా ఉంటుంది. కానీ ఇటీవల సిద్దిపేటలో పరిచయమైన ఈ వెస్ట్రన్‌ గేమ్‌కు చిన్నారులు ఆకర్షితులయ్యారు. పోటీపడి నేర్చుకుంటున్నారు.

అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో అగ్రస్థానాన ఉన్న సిద్దిపేట రాష్ట్ర, జాతీయస్థాయి క్రీడలకు వేదికగా నిలిచింది. దాదాపు 16 క్రీడలకు ఉన్నతమైన వసతులు ఉన్నాయి. ఫ్లడ్‌లైట్లతో క్రికెట్‌ స్టేడియం, అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో స్విమ్మింగ్‌పూల్‌, ఫుట్‌బాల్‌, వాలీబాల్‌, బాస్కెట్‌బాల్‌, సాఫ్ట్‌బాల్‌, బ్యాడ్మింటన్‌, టెన్నిస్‌, కబడ్డీ, ఖోఖో కోర్టులు, కరాటే, టేబుల్‌ టెన్నిస్‌, స్నూకర్‌, చెస్‌ వసతులు ఉన్నాయి. అథ్లెటిక్స్‌కు కూడా చర్యలు చేపట్టారు. చిన్నారులు ఆసక్తి చూపుతున్న స్కేటింగ్‌పై కూడా దృష్టి సారించాలి.


నాడు అనాసక్తి.. నేడు పోటాపోటీ

సిద్దిపేటకు చెందిన సంపత్‌కుమార్‌ అనే యువకుడు స్కేటింగ్‌ నేర్చుకుని యూనివర్సిటీ స్థాయిలో ప్రతిభ కనబరిచాడు. ఇప్పుడు అదే యువకుడు సిద్దిపేటలో మరింత మంది క్రీడాకారులను తీర్చిదిద్దడానికి ఈ క్రీడను అరంగేట్రం చేశాడు. మూడేళ్ల క్రితమే ఒకరిద్దరు విద్యార్థులను చేరదీసే ప్రయత్నం చేయగా తల్లిదండ్రులెవరూ ఆసక్తి చూపించలేదు. కాళ్లకు ప్రమాదమని భావించారు. అయినా తన ప్రతిభతో కొందరికి మెలకువలు నేర్పించాడు. ఇంతలోనే కరోనా రావడంతో తన ప్రయత్నానికి బ్రేక్‌ పడింది. అయినప్పటికీ పట్టువదలకుండా తన సంకల్పాన్ని కొనసాగించడాడు. ప్రస్తుతం స్కేటింగ్‌ నేర్చుకునేవారి సంఖ్య 100 మందికిపైగానే ఉంది. తనకు తెలిసిన క్రీడను నలుగురికి పంచడమే తప్ప ఇది బతుకుదెరువు కాదని, తాను మార్కెటింగ్‌ జాబ్‌ చేస్తున్నానని సంపత్‌ అంటారు. ఒకప్పుడు ఆసక్తి చూపించని వారే ఇప్పుడు తమ పిల్లలను చేర్పించడమే తన విజయంగా చెబుతాడు. 


రింక్‌ నిర్మాణానికి విన్నపం

కోమటిచెరువు ఆడిటోరియం సమీపంలోని ఖాళీ స్థలంలో స్కేటింగ్‌ శిక్షణ ఇస్తున్నారు. స్కేటింగ్‌లో ప్రతిభావంతులను తీర్చిదిద్దాలంటే రోలార్‌ స్కేటింగ్‌ రింక్‌లో ప్రాక్టీస్‌ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం సిద్దిపేటలో ఆ వసతి లేదు. 16 క్రీడలకు ప్రత్యేక వసతులు ఏర్పాటు చేయించిన మంత్రి హరీశ్‌రావు చొరవచూపి రింక్‌ నిర్మాణానికి అనుమతివ్వాలని విన్నవిస్తున్నారు. ఇప్పటికే కొందరు పిల్లలు మంచి ప్రతిభ చూపిస్తున్నారని.. రింక్‌ ఏర్పాటు చేయిస్తే మరింత ఉత్సాహంగా శిక్షణ తీసుకోవచ్చని పిల్లలు, తల్లిదండ్రులు కోరుతున్నారు. సిద్దిపేట మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పాల సాయిరాం, స్కేటింగ్‌ గౌరవ అధ్యక్షుడు పిండి అరవింద్‌లు తాత్కాలిక ఏర్పాట్లు చేయడంలో చొరవ చూపించారు.  


హైదరాబాద్‌ తర్వాత సిద్దిపేటలోనే

వేసవి సెలవులు రావడంతో మా ఇద్దరు అబ్బాయిలకు స్కేటింగ్‌ నేర్పించాలని అనుకున్నా. స్కేటింగ్‌ నేర్పించేవారు హైదరాబాద్‌లో మాత్రమే ఉన్నారని తెలిసింది. ఓ మిత్రుడి ద్వారా సిద్దిపేటలో ఉన్న స్కేటింగ్‌ గురించి తెలియగానే సంతోషించి ఇక్కడ జాయిన్‌ చేశాను. చాలా బాగా నేర్పిస్తున్నారు. 

- జక్కుల చంద్రశేఖర్‌, ఉపాధ్యాయుడు


రెండో స్టేజీకి చేరాను

స్కేటింగ్‌ గురించి టీవీల్లో చూశాను. స్కూల్‌లో అన్ని గేమ్స్‌ నేర్పిస్తారు. కానీ స్కేటింగ్‌ ఉండదు. ఇక్కడ స్కేటింగ్‌ నేర్పిస్తున్నారని తెలిసి వచ్చాను. ఇప్పుడు రెండో స్టేజీకి చేరాను. కాంపిటీషన్స్‌కు కూడా వెళ్లాలని ఉంది. ఇంకా ప్రాక్టీస్‌ ఎక్కువగా చేస్తాను. 

- భవిక, విద్యార్థిని, 4వ తరగతి


స్కేటింగ్‌తో ఉజ్వల భవిష్యత్తు

చిన్నతనం నుంచి స్కేటింగ్‌ నేర్చుకుంటే ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. రాష్ట్ర,జాతీయ స్థాయితోపాటు ఒలింపిక్స్‌లోనూ ఈ క్రీడకు ప్రాతినిథ్యం ఉంది. స్పోర్ట్స్‌ కోటాలో ఉద్యోగాలు, చదువులోనూ ప్రతిభావంతులకు అవకాశాలు వచ్చాయి. నేను స్వచ్ఛందంగానే నేర్పాలని అనుకున్నా. సిద్దిపేటలో రింక్‌ ఏర్పాటు చేయిస్తే మెరికల్లాంటి క్రీడాకారులు తయారవుతారు.

- సంపత్‌కుమార్‌, కోచ్‌, సిద్దిపేట

Updated Date - 2022-05-17T05:27:21+05:30 IST