Advertisement

కొవిడ్ కాలంలోనూ మురిపించిన క్రికెట్

Aug 29 2020 @ 00:28AM

ఇటీవలి వారాలలో క్రికెట్ మ్యాచ్‌లను నేను చాలా ఉల్లాసంగా వీక్షించాను. కరోనా మహమ్మారి కారణంగా, ఇటువంటి ఆనందప్రదమైన క్రికెట్ అనుభవం లభించగలదని నేను ఊహించలేదు. బ్లాక్ లైవ్స్ మ్యాటర్ ఉద్యమస్ఫూర్తితో జాతిపరమైన వివక్షలో మీ అనుభవాలు ఏమిటన్న ఒక యాంకర్ ప్రశ్నకు చాలా ఉద్వేగంతోనూ, అనుపమానమైన 

వచో నైపుణ్యంతోనూ మైఖెల్ హోల్డింగ్ ప్రతిస్పందించిన తీరు కలకాలం మరచిపోలేనిది.


ఏప్రిల్ తొలి దినాలు. కరోనా తన ప్రతాపాన్ని పూర్తి స్థాయిలో చూపడం ప్రారంభమయింది. ఇంగ్లాండ్‌లో ప్రతి వేసవి ఒక క్రికెట్ రుతువు. మరి కరోనా ఈ ‘రుతుశోభ’ను హరించివేస్తుందేమోనని అందరూ భయపడ్డారు. నిజంగా అలా జరిగినట్టయితే రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన అనంతరం ఇంగ్లాండ్‌లో క్రికెట్ ఆడని మొదటి వేసవి 2020 వేసవే అయి ఉండేది. అదృష్టవశాత్తు అలా జరగలేదు. పరిస్థితులు మెరుగుపడ్డాయి. ఈ వేసవీ క్రికెట్ రుతువే అయింది. ఆరు టెస్ట్ మ్యాచ్‌లు జరిగాయి. మూడు వెస్టీండీస్‌తో, మరో మూడు పాకిస్థాన్‌తో జరిగాయి. స్టేడియంలలో ఒక్కరూ లేరు. అయితేనేం అన్ని మ్యాచ్‌లనూ ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం చేశారు. నా అభిమాన ఆటను వీక్షించడంలో, కరోనా కష్టాల నుంచి సాంత్వనం పొందాను. వెస్టీండీస్, పాకిస్థాన్ ప్రతిభావంతమైన పోటీనిచ్చినప్పటికీ ఆరు మ్యాచ్‌లలోనూ ఇంగ్లాండ్ విజయం సాధించింది. క్రికెట్ ఆటకు సంబంధించినంతవరకూ ఈ వేసవి ఆనందప్రదంగా ముగిసింది. ప్రశస్త క్రికెటర్ జిమ్మీ ఆండర్సన్ తన 600వ టెస్ట్ వికెట్ తీశాడు. స్పిన్నర్స్‌కు మాత్రమే ప్రత్యేకమైన ఒక ప్రతిష్ఠను సాధించుకున్న తొలి ఓపెనింగ్ బౌలర్‌గా జిమ్మీ చరిత్ర కెక్కాడు. 


ఇంగ్లాండ్‌లో టెస్ట్‌మ్యాచ్‌లు సాయంత్రం మూడున్నర గంటలకు ప్రారంభమవడం పరిపాటి. అధ్యయనం, రచనా వ్యాసంగాలలో ఉండే నాకు ఇది చాలా సుకరంగా ఉంటుంది. ఇప్పుడు నేను ఇంగ్లాండ్‌లో టెస్ట్ మ్యాచ్‌లను టెలివిజన్‌లో వీక్షిస్తున్నాను. నా బాల్యంలోనూ, యవ్వనంలోనూ నేను వాటిని చూడడానికి బదులు ‘ప్రత్యక్షం’గా వినేవాణ్ణి. క్రికెట్‌లో అభిరుచిని, పరిజ్ఞానాన్ని రేడియో ద్వారా సంతరించుకున్న భారతీయుల సంఖ్య అంతకంతకూ తగ్గిపోతున్నది. నేనూ ఈ మైనారిటీ వర్గంలో ఒకడిని. టెస్ట్‌మ్యాచ్‌ల గురించి రన్నింగ్ కామెంటరీని నేను మొట్టమొదట నా ఎనిమిదేళ్ళ వయస్సులో విన్నాను. 1966 వేసవిలో జరిగిన టెస్ట్‌మ్యాచ్ అది. ఇంగ్లాండ్‌పై వెస్టీండీస్ విజయం సాధించింది. మహోన్నత క్రికెటర్, వెస్టిండీస్ కెప్టెన్ గారీ సోబెర్స్ తన ప్రతిభావంతమైన బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌తో తన జట్టుకు విజయం సమకూర్చాడు. ఆనాటి నుంచి ప్రతి వేసవిలోనూ ఇంగ్లాండ్‌లో జరిగే టెస్ట్ మ్యాచ్‌లను రేడియో లేదా టెలివిజన్ ద్వారా వినడం లేదా వీక్షిస్తూనే ఉన్నాను. ఒక్క 1986లో మాత్రమే ఇందుకు మినహాయింపు. ఆ ఏడాది నేను అమెరికాలో ఉన్నాను. రేడియో, టెలివిజన్ నాకు అందుబాటులో లేవు. తత్కారణంగా కపిల్‌దేవ్ జట్టు ఇంగ్లాండ్ జట్టుపై మూడు టెస్ట్ మ్యాచ్‌లలో సాధించిన అద్భుత విజయాన్ని వీక్షించలేక పోయాను. 


టెలివిజన్‌లో నా అభిమాన క్రికెట్ వ్యాఖ్యాతలు మూడు దేశాలకు చెందినవారు. వారు మైఖెల్ అథెర్టన్ (ఇంగ్లాండ్), మైఖెల్ హోల్డింగ్ (వెస్టిండీస్), షేన్ వార్‌్న (ఆస్ట్రేలియా). ఈ వేసవిలో కూడా ఆ ఆరు టెస్ట్‌మ్యాచ్‌లకు వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. అథెర్టన్, హోల్డింగ్ మొదటి నుంచీ ఉండగా వార్‌్న మధ్యలో వచ్చి వారితో చేరాడు. అథెర్టన్ ప్రముఖ టెస్ట్ క్రికెటర్. హోల్డింగ్ ఆయన కంటే మెరుగైన టెస్ట్ క్రికెటర్. ముగ్గురిలోనూ ఉత్కృష్ట ఆటగాడు షేన్‌ వార్‌్న. అయితే అథెర్టన్ ఎప్పుడూ తాను టెస్ట్‌మ్యాచ్‌‌లు ఆడిన రోజుల గురించి ప్రస్తావించడు. హోల్డింగ్ అరుదుగా ప్రస్తావిస్తాడు. వార్‌్న అప్పుడప్పుడూ తన క్రికెట్ నైపుణ్యాల గురించి ప్రస్తావిస్తాడు గానీ అదేదో మహా గొప్ప విషయమన్నట్టుగా ఉండదు. క్రికెట్‌లో మూడు విభిన్న అంశాలలో వారు శిఖర సమానులు. అథెర్టన్ బ్యాటింగ్ గురించి సమగ్ర అవగాహనతో మాట్లాడగలడు. ఫాస్ట్ బౌలింగ్‌పై హోల్డింగ్ అవగాహన అద్వితీయమైనది. ఇక స్పిన్‌బౌలింగ్ విషయంలో షేన్‌ వార్‌్న ప్రతిభ గురించి చెప్పనవసరం లేదు. టెస్ట్‌మ్యాచ్‌‌లపై వ్యాఖ్యానంలో ఈ ముగ్గురూ పరస్పర సంపూరకాలు అని చెప్పవచ్చు. 


హోల్డింగ్ 1975లో టెస్ట్ క్రికెట్‌లోకి ప్రవేశించాడు. వార్‌్న 2011లో కూడా ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడాడు. క్రికెట్ ఆడడంలో తమ నాలుగు దశాబ్దాల అనుభవాన్ని వారు తమ వ్యాఖ్యానాలలో రంగరించారని చెప్పవచ్చు. హోల్డింగ్, వార్‌్నలిరువురూ వరల్డ్ కప్ క్రికెట్‌లో సుప్రసిద్ధ విజయాలు సాధించిన జట్లలో ఆడారు. ఆ విజయాల గురించి వారు సగర్వంగా చెప్పుకుంటారు. అథెర్టన్ ఇంగ్లాండ్ తరపున ఆడిన కాలంలో ఆ దేశం ఘన విజయాలు సాధించలేదు. అదృష్టవశాత్తూ ఈ ఉమ్మడి విజయరాహిత్యం ఆయనలోని వినయ గుణానికి వన్నె చేకూర్చింది. అథెర్టన్, హోల్డింగ్, వార్‌్న వ్యక్తిత్వాలు భిన్నమైనవి . అయితే అవి ఆకర్షణీయమైనవి. గౌరవాదరాలను పొందేవి. వ్యక్తిత్వాలు, సాంస్కృతిక నేపథ్యాలలో ఎన్ని తేడాలున్నప్పటికీ ముగ్గురిలోనూ రెండు ఉమ్మడి గుణాలున్నాయి. ఒకటి- క్రికెట్ చరిత్ర, పద్ధతుల గురించిన పరిపూర్ణమైన అవగాహన. రెండు- జాతీయ పక్షపాత వైఖరులను అధిగమించే సామర్థ్యం. 


నేను ఎంతగానో అభిమానించే ఈ ముగ్గురు క్రికెట్ వ్యాఖ్యాతల గురించి నా స్నేహితుడు, క్రికెట్ అభిమాని అయిన ప్రముఖ పాత్రికేయుడు రాజ్‌దీప్ సర్దేశాయికి చెప్పగా ఆయన ఆ జాబితాకు మరొక పేరును జోడించారు. ఆ నాలుగో వ్యాఖ్యాత నాసిర్ హుస్సేన్. నేనూ హుస్సేన్ వ్యాఖ్యానాన్ని బాగా ఇష్టపడతాను. ఆయన వ్యాఖ్యానాలు సూటిగా, నిష్కపటంగా ఉంటాయి. అథెర్టన్ వలే హుస్సేన్‌కు కూడా ఎటువంటి సంకుచితత్వం లేదు. జాతిపరమైన, మతపరమైన అహంకారాలు ఏవీ ఆయనకు లేవు. అయితే ఇంగ్లాండ్‌కు చెందిన క్రికెట్ వ్యాఖ్యాతలు అందరూ ఇలాంటివారు కాదు. బ్రియాన్ జాన్‌స్టన్నే తీసుకోండి. నేను యవ్వనంలోకి ప్రవేశిస్తున్నకాలంలో ఆయన సుప్రసిద్ధ బిబిసి రేడియో క్రికెట్ వ్యాఖ్యాత. బ్రిటన్‌లో ఆయన వ్యాఖ్యానాలకు మంచి స్పందన ఉండేది. అయితే ఆ వ్యాఖ్యానాలలో బ్రిటీషేతర క్రికెటర్లపై సంకుచిత వ్యాఖ్యలు ఉండేవి. 1976లో వెస్టిండీస్ క్రికెటర్ల బౌలింగ్‌పై ఆయన అవమానకరమైన వ్యాఖ్యలను నేను స్వయంగా విన్నాను. వెస్టిండీస్ క్రికెటర్లే కాదు, పాకిస్థానీ జావీద్ మియాందద్, మన ఎస్. వెంకటరాఘవన్‌పై కూడా జాన్‌స్టన్ సంకుచిత వ్యాఖ్యలు చేశాడు.

 

అథెర్టన్, హుస్సేన్ వయస్సులో నాకంటే పది సంవత్సరాలు చిన్నవారు. బ్రియాన్ జాన్‌స్టన్ వ్యాఖ్యానాలను వారు విన్నారో లేదో నాకు తెలియదు. ఆయన గురించి వారిరువురి అభిప్రాయమేమిటో కూడా నాకు తెలియదు. అయితే వ్యక్తిత్వాలు, జీవితానుభవాల దృష్ట్యా వారిరువురినీ జాన్ స్టన్ కంటే మరో మహా వ్యాఖ్యాత ఎర్లాట్‌కు వారసులను చేస్తున్నాయని చెప్పవచ్చు. అథెర్టన్ వెస్టిండీస్ మహిళను వివాహం చేసుకున్నాడు. హుస్సేన్ తండ్రి మద్రాసు వాసి. ఈ నేపథ్యాలు ఆ ఇరువురి ఆలోచనా తీరుతెన్నులను ప్రభావితం చేశాయి. ఇదిలావుండగా బ్రిటిష్ సమాజం గతంలో కంటే ఇటీవలికాలంలో వివిధ దేశాలు, జాతులకు చెందినవారికి నెలవుగా ఉన్నది. సాంస్కృతిక వ్యత్యాసాలు ఎంతగా ఉన్నప్పటికీ సర్దుబాటు చేసుకునే సహన ధోరణిని బ్రిటిష్ సమాజం బాగా అలవరచుకున్నది. 


ఇటీవలి వారాలలో క్రికెట్ మ్యాచ్‌లను నేను చాలా ఉల్లాసంగా వీక్షించాను. కరోనా మహమ్మారి కారణంగా, ఇటువంటి ఆనందప్రదమైన క్రికెట్ అనుభవం లభించగలదని నేను ఊహించలేదు. ఏమైనా ఈ వేసవిలో క్రికెట్ వ్యాఖ్యానంలో క్రీడాపరమైన అంశాలకంటే రాజకీయ, నైతిక సంబంధిత అంశం ఒకటి ప్రాధాన్యం పొందింది. బ్లాక్ లైవ్స్ మ్యాటర్ ఉద్యమ ప్రేరణతో జాతిపరమైన వివక్షతో మీ అనుభవాలు ఏమిటని మైఖెల్ హోల్డింగ్ను శ్వేత జాతీయురాలైన యాంకర్ ఒకరు ప్రశ్నించారు. చాలా ఉద్వేగంతోనూ, అనుపమానమైన వచో నైపుణ్యంతోనూ హోల్డింగ్ ప్రతిస్పందించారు. జిమ్మీ ఆండర్సన్ తీసుకున్న 600వ టెస్ట్ వికెట్‌కు సంబంధించిన వీడియో కంటే జాతి వివక్షపై హోల్డింగ్ స్ఫూర్తిదాయక వాంగ్మూలపు వీడియోనే కలకాలం నిలుస్తుంది.

 

(వ్యాసకర్త చరిత్రకారుడు)

రామచంద్ర గుహ

Follow Us on:
Advertisement

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.