రో‘హిట్’శర్మ

ABN , First Publish Date - 2020-11-29T17:29:15+05:30 IST

జీవితమే ఒక ఆట. క్రికెట్‌ అయితే మనకు పైకి కనిపించేంత కాలక్షేపం క్రీడ కాదు. టైమ్‌ బాలేనప్పుడు ఆటగాళ్లను ఒక ఆట ఆడుకుంటుంది. దశ తిరిగినప్పుడు ఆడుతూపాడుతూ

రో‘హిట్’శర్మ

జీవితమే ఒక ఆట

జీవితమే ఒక ఆట. క్రికెట్‌ అయితే మనకు పైకి కనిపించేంత కాలక్షేపం క్రీడ కాదు. టైమ్‌ బాలేనప్పుడు ఆటగాళ్లను ఒక ఆట ఆడుకుంటుంది. దశ తిరిగినప్పుడు ఆడుతూపాడుతూ సాగే ఆటలా భ్రమింపజేస్తుంది. అలాంటి బ్యాడ్‌ టైము, గుడ్‌ టైము ప్రతి ఆటగాడి జీవితంలోనూ కొద్ది కాలమే కనిపిస్తుంది. అయితే భారతీయ క్రికెటర్‌ రోహిత్‌శర్మ జీవితంలో మాత్రం.. టైమ్‌ అనేది  దాగుడుమూతలు ఆడుతుంటుంది. ఆ మంచిచెడుల కాలానికి దొరక్కుండా... అతను ఆడే ఆట అద్భుతం. ఐపీఎల్‌లో ఐదోసారి కప్పు గెలిచినా.. ఆస్ట్రేలియా టూర్‌కు సెలెక్ట్‌ కాకపోయినా.. రోహిత్‌ ఎప్పుడూ న్యూస్‌మేకరే!.


ముంబయిలోని అతి ఖరీదైన ప్రాంతం వర్లీ. అందులో ఆకాశాన్ని తాకే అహూజా టవర్స్‌... పొద్దున్నే బాల్కనీలో నుంచీ.. పైనున్న ఆకాశాన్నీ, కిందున్న సముద్రాన్నీ ఆస్వాదించవచ్చని అరవై కోట్లు పెట్టి.. ఆరువేల చదరపు అడుగుల ఫ్లాట్‌ కొన్నాడు. హైస్పీడ్‌ ఎలివేటర్‌లో 29 వ ఫ్లోర్‌కు వెళ్లినా దిగినా.. రోలర్‌ కోస్టర్‌లో తిరుగుతున్నట్లే ఉంటుంది. రోహిత్‌శర్మ నివాసమే కాదు... అతని కెరీర్‌ కూడా హైస్పీడ్‌ ఎలివేటర్‌లా కిందికీపైకీ వెళుతుంటుంది. ఈ మధ్యనే ఐదోసారి ఐపీఎల్‌ కప్పును గెలిచిన ఆనందంలో ఉన్నాడో లేదో.. అంతలోనే ఆస్ట్రేలియా టెస్టుకు ఎంపిక కాలేదన్న చేదువార్త అతన్ని వేధించింది. తల్లిదండ్రులతో కలిసి నేలమాలిగల్లాంటి చిన్న గదిలో పెరిగిన రోహిత్‌శర్మ ఇప్పుడు నింగిని తాకే ఆకాశహార్మ్యంలో నివసించేస్థాయికి ఎదిగాడు. కింద పడినప్పుడల్లా.. మళ్లీ పైకి లేవడం అతని రక్తంలోనే ఉంది. మైదానంలో బంతిని బాదినప్పుడల్లా ఆ కసి బౌండరీలు దాటుతూనే ఉంటుంది.


ఇదంతా రాత్రికి రాత్రి జరగలేదు. ఆయాచితంగా లభించిన ప్రతిభ అంతకన్నా కాదు. పాఠశాల ఫీజులు కట్టలేక... ఉపకార వేతనంతో నెట్టుకొచ్చిన రోజుల నుంచీ.. అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టే వరకు రోహిత్‌ జీవితం అనేక అడ్డంకుల మధ్యే సాగింది. తండ్రి గురునాథ్‌ శర్మ రవాణా సంస్థలో చిరుద్యోగి. తల్లి పూర్ణిమ సాధారణ గృహిణి. ఆస్తిపాస్తులేమీ లేవు. తాతయ్యలు, మావయ్యల అండ అవసరం అయ్యింది. స్కూల్‌లో స్కాలర్‌షిప్‌తో నెట్టుకొచ్చాడు రోహిత్‌. చిన్నప్పటి నుంచీ చెక్కముక్కను పట్టుకుని గల్లీలో ఆడిన పిలగాడే!. ఎందుకో క్రికెట్‌ అంటే ప్రాణం. ఆ కుర్రాడిలోని ఆసక్తిని గమనించిన మావయ్య క్రికెట్‌ క్యాంపులో చేర్పించాడు. స్పిన్నర్‌గా కెరీర్‌ ప్రారంభం అయ్యింది. అంతర కళాశాలల మధ్య జరిగిన మ్యాచ్‌లో 120 పరుగులు తీసి... అందర్నీ అబ్బురపరిచాడు. ఆరంభం అదిరిపోయినా... అంతర్జాతీయ ప్రారంభం ఆవేదననే మిగిల్చింది. ఒక విజయం.. అంతలోనే మరొక వైఫల్యం.. అతన్ని నీడలా వెంటాడాయి. 


ఆరంభం అదిరిపోలేదు..

అది జూన్‌ 23, 2007 సంవత్సరం. రోహిత్‌ వయసు ఇరవైఏళ్లు. టీమిండియా జెర్సీని ముద్దాడిన ఉద్విగ్న క్షణం. నీలిరంగు టోపీని సగర్వంగా అందుకున్న తరుణం. తొలిసారి అతను అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు మరి. ఎన్నో ఆశలు... మరెన్నో భయాలు. ఆడే అవకాశం తన వరకూ వస్తుందా? వస్తే ఆడగలనా? పెవిలియన్‌లో కూర్చున్నాడే కానీ.. స్పిన్‌ బౌలింగ్‌లో గింగిర్లు తిరుగుతూ వచ్చే బంతిలా బుర్రనిండా అవే ఆలోచనలు. ఐర్లండ్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో రోహిత్‌కు బ్యాటింగ్‌ అవకాశం రానేలేదు. ఆ మ్యాచ్‌లో భారత్‌ గెలిచింది. అదే ఏడాది మూడు నెలల తరువాత... టీ20లో ప్రవేశించాడు. పొట్టి ఫార్మాట్‌లో జరుగుతున్న తొలి ప్రపంచకప్‌ అది. అందులో అయినా తన సత్తా చాటాలనుకున్నాడు. ఇంగ్లండ్‌తో తలపడిన ఆ మ్యాచ్‌లో కనీసం ప్యాడ్‌లు కట్టుకునే అవకాశం కూడా రాలేదు. మళ్లీ చాన్స్‌ చేజారింది. ఏ క్రికెటర్‌కు అయినా తొలినాళ్లలో టెస్టులో ఆడే అవకాశం రావడం అదృష్టమే!. 2010లో లక్ష్మణ్‌కు గాయం కావడంతో... 

ఆ ఛాన్స్‌ రోహిత్‌కు వచ్చింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ వదలొద్దు అనుకున్నాడు. బాగా ఆడేందుకు సర్వశక్తుల్నీ ఏకం చేసి సిద్ధమయ్యాడు. మళ్లీ దురదృష్టం వెంటాడింది. మ్యాచ్‌కు ముందు వార్మప్‌ కోసం ఫుట్‌బాల్‌ ఆడుతూ గాయపడ్డాడు. దురదృష్టం వెంటాడటం అంటే అదే మరి. రాకరాక వచ్చిన సువర్ణావకాశం కళ్ల ముందే మాయమైంది. బ్యాట్‌ పట్టుకోవడం, జట్టులో ఉన్నానని చెప్పుకోవడమే తప్పించి... ఎప్పుడూ ఆడింది లేదు. పరుగులు చేసిందీ లేదు. మరో మూడేళ్ల దాక నిరీక్షణ తప్పలేదు.   


అయినా ఆశ వదల్లేదు..

ముచ్చటగా మూడు ఫార్మాట్‌లలో ఆడే అవకాశం వచ్చినట్లే వచ్చి వెక్కిరించి వెళ్లిపోయింది. కానీ నిరుత్సాహపడలేదు. తన కష్టానికి అర్హమైనది కాదు అనుకున్నాడు. అంతకుమించి అద్భుతమేదో జరుగుతుందన్న ఆశను మాత్రం వదల్లేదు. ప్రతి క్రికెటర్‌ జీవిత లక్ష్యం ప్రపంచకప్‌. అప్పటికే భారత జట్టులో నిలదొక్కుకున్న రోహిత్‌ అకస్మాత్తుగా 2011 వరల్డ్‌కప్‌ ముందు ఫామ్‌ కోల్పోయాడు. తన ఆట తనకే నచ్చలేదు. బ్యాటింగ్‌లో అనేక ఒడుదొడుకులు ఎదుర్కొన్నాడు. ఏ మ్యాచ్‌ ఆడినా సింగిల్‌ డిజిట్‌ స్కోరే. మైదానంలోకి అడుగుపెట్టిన కొద్దిసేపటికే తలదించుకుని పెవిలియన్‌కు వెనుదిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2012లో అయితే అతని కెరీర్‌ ఘోరం. అయిదు ఇన్నింగ్స్‌లో రోహిత్‌ స్కోర్‌ 13 పరుగులు. శ్రీలంకతో జరిగిన వన్‌డే ఇంటర్నేషనల్‌లో బలహీనమైన బ్యాటింగ్‌ చేశాడు. ఆ సిరీస్‌లోని ఐదు మ్యాచ్‌లలో అతని స్కోరు 5-0-0-4-4. సామాజిక మాధ్యమాల్లో అయితే మీద పడ్డారు క్రీడాభిమానులు. ఇక క్రీడాపండితుల విమర్శలకు కొదవ లేదు ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌లలో రోహిత్‌ మీద పనిగట్టుకుని పోస్టులు, కామెంట్లు చేసే వాళ్లు పెరిగిపోయారు. అప్పట్లో మ్యాగీ నూడుల్స్‌కు అడ్వర్‌టైజ్‌మెంట్‌ను ఇస్తుండేవాడు రోహిత్‌. అతని పేలవమైన ఆటతీరు చూసి... నెటిజన్లు అందరూ ‘మ్యాగీమాన్‌’ అంటూ దెప్పిపొడిచారు కూడా. ఇంకొందరయితే ‘ఇండియన్‌ షాహిద్‌ అఫ్రిదీ’ అటూ హేళన చేశారు. ఆ కామెంట్ల బౌన్సర్ల ధాటికి తట్టుకోలేకపోయాడు రోహిత్‌. ఒక రకంగా తనలోతానే కుంగి పోయాడు. డిప్రెషన్‌ ఆవహించింది. ఆ మానసిక ఒత్తిళ్లకు ఆరోగ్యం దెబ్బతినింది. అకస్మాత్తుగా బరువు పెరిగాడు. వ్యసనాలపైకి మనసు లాగింది. పార్టీల మత్తులో పడిపోయాడు. ఇన్నాళ్లూ అతని ఆటతీరును విమర్శించే వాళ్లు... వ్యక్తిగత అలవాట్లను కూడా దుమ్మెత్తిపోయడం ప్రారంభించారు.


ఒకసారి వెనక్కి తిరిగి చూసుకున్నాడు. స్కూల్‌లో ఉన్నప్పుడు తనుకన్న కలలు... ఉపకార వేతనాలతో చదువుకున్న గడ్డు రోజులు అన్నీ గుర్తుకొచ్చాయి. ఒక రోజు - చిన్ననాటి కోచ్‌ దినేశ్‌లాడ్‌ వద్ద తన బాధను వ్యక్తం చేశాడు. ఏం చేయాలో చెబితే వింటానన్నాడు. బ్యాట్స్‌మన్‌గా తనలోని లోపాలను సరిదిద్దుకోకపోతే... ఇక తను ఇంటికేనన్న సంగతి అర్థమైంది. కోచ్‌ సలహాలు స్వీకరించి.. జాతీయ క్రికెట్‌ అకాడమీలో కఠోర శ్రమ చేశాడు. బౌలర్‌ విసిరే ఇన్‌స్వింగ్‌ బంతులను ఎదుర్కోవడం తనలోని పెద్ద లోపం. ఆ బలహీనతను అధిగమించేలా ప్రాక్టీస్‌ చేశాడు. అప్పటి వరకు పేలవంగా ఆడిన రోహిత్‌ శర్మ.. వరల్డ్‌కప్‌ అనంతరం కొత్త శక్తితో తిరిగి భారత క్రికెట్‌ జట్టులోకి ప్రవేశించి.. రో‘హిట్‌’ శర్మగా మారడానికి ఎంతో సమయం పట్టలేదు.  


ఇక... ఆగలేదు..

అది 2013... మినీ వరల్డ్‌కప్‌గా భావించే చాంపియన్స్‌ ట్రోఫీ. రోహిత్‌ కెరీర్‌ను మలుపు తిప్పిన టోర్నీ. అప్పటిదాకా పడుతూలేస్తూ సాగిన అతని ప్రయాణాన్ని హైవే మీదికి ఎక్కించాడు ధోనీ. ఓపెనర్‌గా ప్రమోట్‌ చేశాడు. మిడిలార్డర్‌, లోయర్‌ ఆర్డర్‌లలో సరైన అవకాశాలు రాక సతమతమైన ఈ ముంబయి బ్యాట్స్‌మన్‌ ఇన్నింగ్స్‌ను ఆరంభించే పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. నిలకడైన, నమ్మకమైన ఆటతీరును ప్రదర్శించే బ్యాట్స్‌మన్‌గా మన్ననలు పొందాడు. యుద్ధంలో పది ఓటముల తరువాత.. రణభూమిలోకి దూకిన వీరునిలా విరుచుకుపడ్డాడు. అతను క్రీజ్‌లో ఉన్నాడంటే స్కోర్‌బోర్డు పరుగులు తీయాల్సిందే!. అతని పేర చరిత్ర చకచకా రాసుకుంది. వన్‌డేల్లో డబుల్‌ సెంచరీ చేయడం ఒక అద్భుతం. పరిమిత ఓవర్ల క్రికెట్‌ ఆరంభమై మూడున్నర దశాబ్దాల తర్వాత కానీ 200 స్కోరు సాధ్యం కాలేదు. అది కూడా సచిన్‌ టెండుల్కర్‌ తొలిసారి వన్డేల్లో డబుల్‌ సెంచరీతో చరిత్ర సృష్టిస్తే... ఆ విన్యాసాన్ని ముచ్చటగా మూడుసార్లు సాధించి గురువును మించిన శిష్యునిగా రోహిత్‌ ప్రపంచ రికార్డు లిఖించాడు. 2017 నుంచీ కెరీర్‌ దూసుకెళ్లింది. 2019 జనవరిలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌ను భారత్‌ కైవసం చేసుకోవడం ఒక చరిత్ర. మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌లో రోహిత్‌ చేసిన 63 పరుగులు ఎంతో కీలకం అయ్యాయి. అదే ఏడాది న్యూజిలాండ్‌తో జరిగిన వన్‌డే ఇంటర్నేషనల్‌ సీరిస్‌ను పదేళ్ల తరువాత భారత్‌ తన ఖాతాలో వేసుకుంది. ఈ సీరిస్‌లో 200 వ వన్‌డే ఇంటర్నేషనల్‌ మ్యాచ్‌ ఆడిన 14వ ఆటగాడిగా రోహిత్‌ రికార్డుల్లోకి ఎక్కాడు. అదే ఏడాది మార్చిలో మరో రికార్డు... వన్‌డేల్లో అత్యంత వేగంగా ఎనిమిదివేల పరుగులు తీసిన మూడో మొనగాడిగా నిలిచాడు. అంతకుముందు ఆ రికార్డును డివిల్లిర్స్‌, విరాట్‌కోహ్లీ సాధించిన ఘనత అది. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు... ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ ఏదో ఒక అద్భుతం చేస్తూ రో‘హిట్‌’ శర్మ అనిపించుకున్నాడు. విదేశీ పత్రికలు అయితే ‘హిట్‌మ్యాన్‌’ అంటూ కీర్తించాయి.  


ఐపీఎల్‌లో ఐదో సారి..

ప్రపంచవ్యాప్తంగా ఐపీఎల్‌కు ఉన్న క్రేజ్‌ చెప్పక్కర్లేదు. అలాంటి ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్‌కు తిరుగులేని సారథి రోహిత్‌శర్మ. తన కెప్టెన్సీలో ఫైనల్‌కు చేరిన ఐదు సార్లూ (2013, 2015, 2017, 2019, 2020) ఆ జట్టు చాంపియన్‌గా నిలిచింది. ప్రతిసారీ అండర్‌డాగ్‌గా బరిలోకి దిగే ముంబయి ఈ టైటిళ్లు సాధించడం వెనుక హిట్‌మ్యాన్‌ కృషి అమోఘం. ఇతనికి జట్టు సభ్యుల బలాలు, బలహీనతలు క్షుణ్ణంగా తెలుసు. ఒత్తిడిలో ఉన్న ఆటగాళ్లకు ధైర్యం నూరిపోస్తాడు. ప్రతిభ చూపిన వాళ్లను భుజంపై చేయి వేసి అభినందిస్తాడు. అతను చెప్పే నాలుగైదు మాటల్లో నిజాయితీ కనిపిస్తుంది. క్రికెటర్ల మనసును తాకుతుంది. అందరూ కలిసికట్టుగా ఆడేందుకు.. ప్రత్యర్థి జట్టును కసితో ఓడించేందుకు... రోహిత్‌లోని నాయకత్వ లక్షణం ఎంతో ఉపకరించింది. జట్టులో సమస్థితి వాతావరణం కల్పించడంలో రోహిత్‌ సక్సెస్‌ అయ్యాడు. అందుకే ‘ఐపీఎల్‌.. ముంబయి.. రోహిత్‌’ ఈ మూడింటినీ వేరువేరుగా చూడలేం. అతనికి స్వేచ్ఛను ఇస్తే... మరెన్నో అద్భుతాలు చేస్తాడనిపిస్తుంది. 


నెక్ట్స్‌ ఏంటి?

ఈ మధ్యనే - ఐపీఎల్‌ను ఐదోసారి గెలిపించిన రోహిత్‌ పతాక శీర్షికలకు ఎక్కాడు. అంతలోనే ఆస్ట్రేలియా టూర్‌కు వెళతాడా? లేదా? అనే సందిగ్దం అలుముకుంది. ఆ మబ్బుతెరలు కూడా వీడిపోయాయిప్పుడు. రోహిత్‌ మోకాలి కండర గాయంతో ఆ దేశానికి వెళ్లడం లేదన్న ప్రకటన వచ్చింది. ఆస్ట్రేలియాతో జరగబోయే నాలుగు టెస్టుల సిరీస్‌లో తొలి రెండు టెస్టులకి జట్టులో స్థానం దక్కలేదు. మిగిలిన సిరీస్‌కూ అనుమానమే. కెప్టెన్‌ కోహ్లితో రోహిత్‌కు పొసగడం లేదనే వాదన గత కొంతకాలంగా వినిపిస్తూనే ఉంది. కపిల్‌దేవ్‌ లాంటి దిగ్గజాలు కూడా కెప్టెన్సీని విభజించాలన్న కొత్త అభిప్రాయాలను తెర మీదకు తెచ్చారు. కోచ్‌ రవిశాస్త్రి కూడా కోహ్లికే పూర్తి మద్దతనే సంకేతాలూ ఉన్నాయి. ఐపీఎల్‌ సందర్భంగానే రోహిత్‌కు గాయమైంది. దీంతో కొన్ని మ్యాచ్‌లకూ దూరమయ్యాడు. ముంబయి ఫైనల్‌ చేరడంతో టైటిల్‌ మ్యాచ్‌ ఆడాడు. అయితే రోహిత్‌ లాంటి స్టార్‌ ఆటగాడిని రక్షించుకోవాల్సిన బాధ్యత బీసీసీఐకి ఉంది. కాసులు కురిపించే ఐపీఎల్‌కే బోర్డు ప్రాధాన్యమిస్తోందన్న విమర్శలు లేకపోలేదు. గాయం అయిన వెంటనే రోహిత్‌కు విశ్రాంతినిస్తే ఇప్పుడు ఆసీస్‌ పర్యటనలో ఉండేవాడు. ఇదంతా యాదృచ్చికంగా జరిగిందా? కావాలని ఏ అదృశ్యశక్తులో అడ్డుపడితే తలెత్తిన సమస్యా? ఏమో... ఆ రహస్యం ఎవరికి తెలుసు?. మొత్తానికి ముక్కుసూటిగా ఉండే రోహిత్‌కు ఇలాంటి అడ్డంకులు వస్తూనే ఉంటాయి. అహూజా టవర్స్‌లోని తన సొంత ఫ్లాట్‌ బాల్కనీలో కూర్చుని సముద్రాన్ని చూస్తున్నప్పుడు... ముందుకూ వెనక్కూ కదిలే కెరటాలే తనకు స్ఫూర్తి అంటాడతను. పడిలేవడం అలవాటే!. ఆ ప్రయాణమే అతన్ని రాటుదేలేలా చేసింది. రోహిత్‌ వయస్సు ఇప్పుడు 33 ఏళ్లు. ఇంకో అయిదేళ్లు ఆడగలడు. భారత క్రికెట్‌లో అతను ఎన్నోఅద్భుతాలను చేశాడు. కానీ... ఇంకో పరమాద్భుతం అతను మాత్రమే చేయగలడని ఆశ పడుతున్నారు క్రీడాభిమానులు. అదే... వన్‌డేల్లో ట్రిపుల్‌ సెంచరీ. ‘అది సాధ్యమేనా రోహిత్‌.. నువ్వు కొట్టగలవా’ అనడిగినప్పుడు - అతని విశాలమైన లివింగ్‌రూమ్‌లోని పియానోను వాయిస్తూ... ఎత్తయిన ఆకాశాన్నీ... లోతైన సముద్రాన్నీ చూస్తూ నవ్వుతాడంతే!. రోహిత్‌ కెరీర్‌ పైకెళ్లినా, కిందపడినా జీవితం ఒక ఆట లాంటిదే మిత్రమా... అనే మర్మం అతనికి తెలుసేమో!.   


క్రికెట్‌ కోసమే పుట్టాడు..

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో పుట్టిన రోహిత్‌ పదేళ్ల ప్రాయంలో క్రికెట్‌ కోసం ముంబయికి వచ్చాడు.


కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే కావడంతో.. తాతయ్య దగ్గర పెరిగాడు. మామయ్య సాయంతో క్రికెట్‌ కోచింగ్‌ తీసుకున్నాడు.


చిన్నప్పుడు గల్లీ క్రికెట్‌లో ఎదురింటి కిటికీ పగలగొట్టడంతో పోలీసుల ఫిర్యాదు వరకు వెళ్లిందా సంఘటన. 


వీరేంద్ర సెహ్వాగ్‌ అంటే వీరాభిమానం. అతన్ని చూసేందుకు స్కూల్‌ ఎగ్గొట్టి వెళ్లిన సందర్భాలు అనేకం. ఆ తరువాత వీరూతో కలిసి జట్టును పంచుకునే స్థాయికి ఎదిగాడు. 


రోహిత్‌కు మతిమరుపు ఎక్కువ. ఎప్పుడు చూసినా ఏదో ఒక వస్తువును పోగొట్టుకుంటాడు. ఓసారి ఇంగ్లండ్‌ పర్యటనలో ఉన్నప్పుడు ఏకంగా పాస్‌పోర్టునే పోగొట్టుకున్నాడట. 


హాయిగా నిద్రపోవడమంటే ఇష్టం. ఈ విషయమై కోహ్లీ, ఇతర సహచరులు అప్పుడప్పుడు సరదాగా ఆటపట్టిస్తుంటారు.


స్పోర్ట్స్‌ మేనేజర్‌ రితికతో ఆరేళ్ల డేటింగ్‌ తరువాత పెళ్లి చేసుకున్నాడు. వాళ్లకు ఇప్పుడొక పాప. 


రోహిత్‌ వాళ్లమ్మ పూర్ణిమకు విశాఖపట్టణంతో సంబంధం ఉంది. అందుకే తనకు కాస్త తెలుగు వచ్చు. ఇంగ్లిష్‌, హిందీ, మరాఠీ మాట్లాడతాడు.


తొలుత ఆఫ్‌ స్పిన్నర్‌గా ఆటలో అడుగుపెట్టినా కోచ్‌ దినేశ్‌ సూచనతో పూర్తిస్థాయి బ్యాట్స్‌మన్‌గా మారాడు రోహిత్‌. 


రోహితాస్త్రాలు

సూర్యకాంతికి ఎదురుగా నీ ముఖాన్ని ఉంచు. నీడ నీ వెనుకపడుతుంది.

మన మనస్సు ఏమి విశ్వసిస్తుందో శరీరమూ అదే పాటిస్తుంది.

ముందుగా నమ్మకముంచు. అప్పటికే నీ పని సగం పూర్తియినట్టు.

నీ ముందు ఎన్ని అబద్దాలు ఆడతారో... నీ వెనుక ఎన్ని అబద్దాలు చెబుతారో అనేది కాకుండా నీలో ఎన్ని అబద్దాలు ఉన్నాయో ఆత్మపరిశీలన చేసుకో.

మాట్లాడకు.. పని చేయి, చెప్పకు.. చేసి చూపించు,  వాగ్ధానం చేయకు.. నిరూపించుకో. 


‘రోహిత్‌ ఆటను చూస్తుంటే.. అప్పట్లో నేనూ అలాగే ఆడాలనుకునేవాడ్ని. కానీ నాటి పరిస్థితులు, నాలోని ఆత్మవిశ్వాస లోపంతో దూకుడు ప్రదర్శించలేకపోయా. ఇప్పటితరం వేగాన్ని చూస్తుంటే ముచ్చటేస్తుంది. వీరి అమోఘ ఆటతీరుతో ముందుతరానికి భారీ లక్ష్యాన్ని విధిస్తున్నారు’.

- సునీల్‌ గవాస్కర్‌


‘రోహిత్‌ బ్యాటింగ్‌ చేస్తుంటే నటరాజు విన్యాసంలా ఉంటుంది. అతడి స్కోరు 50 దాటితే మా చూపంతా 200పైనే ఉంటుంది’.

- కపిల్‌దేవ్‌


‘రోహిత్‌ది దేవుడిచ్చిన ప్రతిభ. తొలుత ఓపెనర్‌గా సంశయించినా ఆ స్థానంలో తిరుగులేని ముద్ర వేశాడు’.

- ధోని 

వీళ్లను అన్‌ఫాలో చేశాడు..

సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే రోహిత్‌ అప్పుడప్పుడు వివాదాల్లో చిక్కుకుంటుంటాడు. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, అతని భార్య అనుష్కలను ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేయడం అప్పట్లో పెద్ద దుమారాన్నే రేపింది.


శాఖాహారే.. కానీ

రోహిత్‌ది సంప్రదాయ శాఖాహార కుటుంబం కాబట్టి మాంసాహారం జోలికి వెళ్లడు. కానీ గుడ్లు ఎక్కువగా తింటాడు. అది కూడా ఇంటి వెలుపలే. వడాపావ్‌ అన్నా రోహిత్‌కు చాలా ఇష్టం. టీమిండియా ఆటగాళ్లు ముద్దుగా అదే పేరుతో తనను పిలుస్తుంటారు.


‘టీవీలో క్రికెట్‌ చూస్తుంటే చాలా సులువనిపిస్తుంది. కానీ మైదానంలో దిగితేనే తెలుస్తుంది. బాహ్యప్రపంచంలో మన చుట్టూ జరిగే అనేక సంఘటనలు అంతరంగిక శక్తిపై ప్రభావం చూపుతాయి. ఆ స్థితి నుంచి బయటపడాలి. ఆలోచనలు నియంత్రించుకోవడం అతి ముఖ్యం. అప్పుడే మన విధిరాతను సవ్యంగా లిఖించుకోగలం’

- రోహిత్‌ శర్మ


అతనేం చేసినా రికార్డే..!

 వన్‌డేల్లో రోహిత్‌ చేసిన అత్యధిక  వ్యక్తిగత స్కోరు 264 పరుగులు. 2014లో శ్రీలంకపై సాధించాడు.

 వన్‌డేల్లో మూడు డబుల్‌ సెంచరీలు సాధించిన ఏకైక బ్యాట్స్‌మన్‌ (209, 264, 208 పరుగులు).

 వన్‌డే మ్యాచ్‌లలో ఎనిమిదిసార్లు  150 పైచిలుకు పరుగులు చేసిన ఒకే ఒక్కడు. 

 2019 ప్రపంచకప్‌లో అత్యధిక  పరుగులు (648) సాధించిన ఆటగాడు.

 మూడు ఫార్మాట్‌లలోనూ సిక్స్‌లతో సెంచరీ పూర్తి చేసిన రికార్డు  ఇతని సొంతం.

 అవలీలగా బౌండరీలు కొట్టడంలో దిట్ట. ఒక వన్‌డే  మ్యాచ్‌లో 33 ఫోర్లు కొట్టాడు. ఇదో సంచలనం.

 టీ 20 మ్యాచ్‌లలో నాలుగు సెంచరీలతో రికార్డు బ్రేక్‌ చేశాడు.

 అన్ని ఫార్మట్‌లలో సెంచరీలు చేసిన తొలి ఆటగాడు.

 ప్రపంచకప్‌లో అత్యధిక శతకాల (6) వీరుడిగా సచిన్‌తో  కలిసి రికార్డు నెలకొల్పాడు.

 తొలి రెండు టెస్టుల్లో సెంచరీలు కొట్టిన మూడో భారత బ్యాట్స్‌మన్‌.

 ఐపీఎల్‌లో హ్యాట్రిక్‌ తీసిన అరుదైన ఘనత సొంతం.

 టీ 20 ల్లో అత్యంత వేగంగా శతకం సాధించిన  భారత క్రికెట్‌ ప్లేయర్‌. 


- మట్టపల్లి రమేష్‌, 9989378412

Updated Date - 2020-11-29T17:29:15+05:30 IST