కస్టమ్స్‌ అధికారినంటూ మోసం

ABN , First Publish Date - 2021-04-20T07:26:59+05:30 IST

ఎయిర్‌పోర్టు కస్టమ్స్‌ అధికారినంటూ మహిళను బెదిరించి రూ. 5.40 లక్షలు కాజేశాడు.

కస్టమ్స్‌ అధికారినంటూ మోసం

మహిళ నుంచి రూ. 5.4 లక్షలు కాజేసిన మోసగాడు

హిమాయత్‌నగర్‌, ఏప్రిల్‌ 19 (ఆంధ్రజ్యోతి): ఎయిర్‌పోర్టు కస్టమ్స్‌ అధికారినంటూ మహిళను బెదిరించి రూ. 5.40 లక్షలు కాజేశాడు. నగరానికి చెందిన ఓ మహిళ వాట్సాప్‌ నంబర్‌కు గుర్తుతెలియని నంబర్‌ నుంచి మెసేజ్‌ వచ్చింది. ఆమె పేరిట ఓ పార్శిల్‌ వచ్చిందని మెసేజ్‌లో ఉంది. పార్శిల్‌ పంపిస్తున్నానని ఆగంతుకుడు చెప్పాడు. రెండు రోజుల వ్యవధిలో మరో నంబర్‌ నుంచి కాల్‌ చేశాడు. గొంతు మార్చి ఎయిర్‌పోర్ట్‌ కస్టమ్స్‌ అధికారిని మాట్లాడుతున్నానని నమ్మించాడు. మీ పేరుతో పార్శిల్‌ వచ్చిందని, కస్టమ్స్‌ క్లియరెన్స్‌ చేయాలంటే రూ. 40 వేలు చెల్లించాలని డిమాండ్‌ చేశాడు. నమ్మిన మహిళ అతడు చెప్పిన అకౌంట్‌ నంబర్‌కు డబ్బు పంపించింది. ఆ తర్వాత మరో నెంబర్‌ నుంచి కాల్‌ చేసి ఎయిర్‌పోర్టు పోలీసులమని, పార్శిల్‌లో నిషేధిత వస్తువులు ఉన్నాయని, రూ. 5 లక్షలు చెల్లించకపోతే కేసు నమోదు చేస్తామని బెదిరించాడు. భయపడిన బాధితురాలు అతడు చెప్పిన ఖాతాకు రూ. 5 లక్షలు ట్రాన్స్‌ఫర్‌ చేసింది. మోసగాడు మరోసారి ఫోన్‌ చేసి డబ్బులు డిమాండ్‌ చేయడంతో బాధితురాలికి అనుమానం వచ్చి సైబర్‌క్రైమ్స్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 

అధిక లాభాల పేరుతో.. 

ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ చేస్తున్న నగరానికి చెందిన వ్యక్తిని ట్రాప్‌ చేసిన సైబర్‌ కేటుగాళ్లు తమ ద్వారా ట్రేడింగ్‌ చేస్తే రెట్టింపు లాభాలు వస్తాయని చెప్పారు. వారి మాటలు నమ్మిన బాధితుడు మోసగాళ్ల ఖాతాలకు రూ. 5.80 లక్షలు ట్రాన్స్‌ఫర్‌ చేశాడు. తర్వాత వారి ఫోన్‌లు స్విచ్చాఫ్‌ రావడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 


Updated Date - 2021-04-20T07:26:59+05:30 IST