భారీగా నకిలీ మద్యం పట్టివేత

ABN , First Publish Date - 2020-11-30T04:36:32+05:30 IST

కర్ణాటకలో తయారైన నకిలీ మద్యం జిల్లాలో పట్టుబడింది.

భారీగా నకిలీ మద్యం పట్టివేత
నకిలీ మద్యం బాటిళ్ల గోతాలు పరిశీలిస్తున్న రూరల్‌ ఎస్పీ విశాల్‌గున్నీ, అదనపు ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌

పల్నాడులో రూ.32 లక్షల ఖరీదైన 6,128 బాటిళ్ళు స్వాధీనం

కర్ణాటకలో తయారీ.. మధ్యప్రదేశ్‌, తెలంగాణల్లో మూలాలు

నాలుగు రాష్ర్టాల పరిధిలో  18 మంది నిందితులు అరెస్ట్‌


గుంటూరు, నవంబరు 29: కర్ణాటకలో తయారైన నకిలీ మద్యం జిల్లాలో పట్టుబడింది. మొత్తం 18 మందిని ఎస్‌ఈబీ పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. ఆదివారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్‌ఈబీ అదనపు ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌, ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ చంద్రశేఖర్‌రెడ్డిలతో కలసి రూరల్‌ ఎస్పీ విశాల్‌గున్నీ వివరాలు వెల్లడించారు... పల్నాడులోని వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామంలోని ఓ హోటల్‌లో నకిలీ మద్యం విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలసులు హోటల్‌పై దాడిచేసి నకిలీ మద్యం విక్రయిస్తున్న కేలం శ్రీను, కల్లూరి కొండలును అదుపులోకి తీసుకొని వారి నుంచి 51 నకిలీ మద్యం బాటిళ్ళు స్వాధీనం చేసుకున్నారు. తమకు గుండ్లపాడుకు చెందిన పొనికే రాంబాబు, ఉప్పలపాడుకు చెందిన గొరిగె కొండలు విక్రయించినట్లు వారు చెప్పారు. వారిని అదుపులోకి తీసుకొని విచారించగా తక్కువ ధరకు నకిలీ మద్యం కోసం నల్గొండ జిల్లాలోని గుంటక మధుసూదనరెడ్డి, హైదరాబాద్‌కు చెందిన విజయారెడ్డి, బాల్‌రెడ్డి, కర్నాటక రాష్ట్రంలోని బీదర్‌ జిల్లా హమ్నాబాద్‌లో ఉండే సంగమేష్‌,  మధ్యప్రదేశ్‌కు చెందిన ఇర్ఫాన్‌, ఆరిఫ్‌ను సంప్రదించామని తెలిపారు. వారి ద్వారా కర్నాటక రాష్ట్రంలోని బెల్గాం జిల్లా నిప్పానికి చెందిన విజయ్‌భాట్లే అనే వ్యక్తి వద్ద మద్యం కొనుగోలు చేశారు. ఇర్ఫాన్‌ తన లారీలో పల్నాడులోని గుండ్లపాడు, ఉప్పలపాడు గ్రామాలకు మద్యాన్ని తరలించగా అక్కడ రాంబాబు, కొండలు కొంత మద్యాన్ని విక్రయించారు. మిగిలిన మద్యాన్ని ఉప్పలపాడులోని చిన్నమౌలాలికి చెందిన కోళ్ళఫారం వద్ద పొలంలో 4,645 బాటిళ్ళను, మరో చోట 10,934 బాటిళ్ళను, గుండ్లపాడు అటవీ ప్రాంతంలో దాచిన 3,072 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 16,128 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో గుండ్లపాడు, ఉప్పలపాడు గ్రామాలకు చెందిన ప్రధాన నిందితులు పొనికె రాంబాబు, గొరిగె కొండలుతో పాటు వీరయ్య, తోట వెంకటేశ్వర్లు, తోట పాపారావు, జె.నాగరాజు,  డ్రైవర్‌ ఆవుల మధుసూదనరెడ్డి, బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, గుంటక మధుసూధనరెడ్డి, కేలం శ్రీను, కల్లూరి కొండలు, చిన మౌలాలి, తెలంగాణకు చెందిన గుంటక మధుసూధనరెడ్డి, పబ్బతి బాల్‌రెడ్డి, కాశిరెడ్డి విజయారెడ్డిలను, మధ్యప్రదేశ్‌కు చెందిన ఆరీఫ్‌ అబ్దుల్‌ రెహ్మాన్‌ ఖాన్‌, ఇర్ఫాన్‌ ఖాన్‌, కర్ణాటకలోని బీదర్‌కు చెందిన సంగమేష్‌ చింద్రి, బెల్గాంకు చెందిన విజయ్‌బాలు భతాలే తదితరులను అరెస్ట్‌ చేశారు. నకిలీ మద్యాన్ని కర్ణాటక రాష్ట్రంలోని బెల్గాంకు చెందిన విజయ్‌ బాలు భతాలే హుబ్లీ సమీపంలోని నిప్పానిలో గుట్టుగా తయారు చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. డిస్టలరీలకు సరఫరా అయ్యే ఎక్స్‌ట్రా నాచురల్‌ ఆల్కహాల్‌ను ఆయా ట్యాంకర్‌ డ్రైవర్‌ల నుంచి కొనుగోలు వీరు కొనుగోలు చేశారు. దానికి సగం నీరు, ఫుడ్‌ కలర్‌ కలిపి రోజుకు 3,200కు పైగా నకిలీ మద్యం తయారు చేస్తున్నాడు. ఇండోర్‌లో ఆయా స్టిక్కర్‌లను, వాటికి అవసరమైన మూతలను సలీం నుంచి కొనుగోలుచేసి అంటిస్తున్నారన్నారు. 

Updated Date - 2020-11-30T04:36:32+05:30 IST