కన్నతల్లిపై దాడిచేసిన రౌడీషీటర్‌ అరెస్టు

ABN , First Publish Date - 2020-12-04T04:50:15+05:30 IST

డబ్బులు అడిగితే ఇవ్వలేదన్న కోపంతో కన్నతల్లిపైనే దాడిచేసి తీవ్రంగా గాయపరిచిన రౌడీషీటర్‌ను నాలుగో పట్టణ పోలీసులు గురువారం అరెస్టు చేశారు.

కన్నతల్లిపై దాడిచేసిన రౌడీషీటర్‌ అరెస్టు

ద్విచక్ర వాహనం కొనుగోలుకు డబ్బులు ఇవ్వలేదని ఆగ్రహం

కత్తిపీట పిడితో విచక్షణా రహితంగా దాడి

సీతంపేట, డిసెంబరు 3: డబ్బులు అడిగితే ఇవ్వలేదన్న కోపంతో కన్నతల్లిపైనే దాడిచేసి తీవ్రంగా గాయపరిచిన రౌడీషీటర్‌ను నాలుగో పట్టణ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం మేరకు...వేంకటేశ్వర కాలనీలో నివాసం ఉంటున్న గంజిలీల, గంజి శివ తల్లీ కొడుకులు. బాల్యం నుంచే చెడు వ్యసనాలకు బానిసైన శివ పలు నేరాలకు పాల్పడడంతో పోలీసులు అతనిపై రౌడీషీట్‌ తెరిచారు. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి శివ పూటుగా మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. మాటల సందర్భంలో తాను ద్విచక్ర వాహనం కొనుక్కోవాలనుకుంటున్నానని, అందుకు డబ్బులు ఇవ్వాలని తల్లిని కోరాడు. ఆమె తనవద్ద లేవని చెప్పింది. దీంతో ఆమెను పలు రూపాల్లో బెదిరించాడు. అయినా ఆమె దిగిరాలేదు. ఇద్దరి మధ్యా వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ సమయంలో ఆవేశానికి లోనైన శివ సమీపంలోని కత్తిపీట తీసుకుని దాని పిడితో తల్లి ముఖంపై విచక్షణా రహితంగా కొట్టాడు. స్థానికులు అడ్డుకుని తీవ్రంగా గాయపడిన బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసిన పోలీసులు శివను అరెస్టుచేశారు.

Updated Date - 2020-12-04T04:50:15+05:30 IST