పంట భూమి తనపేరుపై రాయాలంటూ.. భర్తపై భార్య దాడి

ABN , First Publish Date - 2021-03-06T07:18:06+05:30 IST

స్వగ్రామంలో ఉన్న పంట భూమి తన పేరుపై రాయాలంటూ భర్తపై దాడిచేసిందో మహిళ.

పంట భూమి తనపేరుపై రాయాలంటూ..  భర్తపై భార్య దాడి

సోదరుడు, ఇంటి యజమాని కుటుంబ సభ్యులతో కలిసి..

పంజాగుట్ట, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): స్వగ్రామంలో ఉన్న పంట భూమి తన పేరుపై రాయాలంటూ భర్తపై దాడిచేసిందో మహిళ. పంజాగుట్ట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్ర, నాందేడ్‌, ధనగర్వాడి గ్రామానికి చెందిన దొండిడా డూంగవే ఉపాధి నిమిత్తం కొంతకాలం క్రితం భార్య లక్ష్మీబాయితో కలిసి నగరానికి వచ్చాడు. అమీర్‌పేటలో ఉంటూ వంట మనిషిగా పనిచేస్తున్నాడు. స్వగ్రామంలోని పంట భూమి విషయమై భార్యాభర్తల మధ్య కొంతకాలంగా వివాదం జరుగుతోంది. భూమి తన పేరుపై రాయాలని భార్య అతడితో తరచూ ఘర్షణ పడుతోంది. రెండు నెలల క్రితం వంట పని నిమిత్తం దొండిడా డూంగవే పుణె వెళ్లాడు. ఈనెల 4వ తేదీన నగరానికి తిరిగి వచ్చాడు. లక్ష్మీబాయి తన సోదరుడు కైలాష్‌ ముండేతో కలిసి భూమి తన పేరుపై రాయాలని భర్తను నిలదీసింది. దీనికి అతడు అంగీకరించలేదు. లక్ష్మీబాయి, ఆమె సోదరుడు, ఇంటి యజమాని, అతడి భార్య, మరదలితో కలిసి దొండిడా డూంగవేపై కర్రలతో దాడి చేశారు. ఈ విషయమై అతడు తన సోదరుడు కొండిబ డూంగవేకు ఫోన్‌ చేసి చెప్పాడు. అతడు వెంటనే అమీర్‌పేట వెళ్లగా తీవ్రంగా గాయపడిన దొండిడా డూంగవేను అప్పటికే చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. బాధితుడి సోదరుడి ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


Updated Date - 2021-03-06T07:18:06+05:30 IST