పిల్లలు, మహిళలపై నేరాలు పెరుగుతున్నాయి

ABN , First Publish Date - 2022-01-22T08:14:10+05:30 IST

పిల్లలు, మహిళలపై జరిగే నేరాలు చాలా హేయమైనవని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా పేర్కొన్నారు.

పిల్లలు, మహిళలపై నేరాలు పెరుగుతున్నాయి

  • పటిష్ఠ విచారణ, సత్వర న్యాయం అందించేందుకే ప్రత్యేక కోర్టులు
  • తప్పు చేసినవారు తప్పించుకోకుండా చూడాల్సిన బాధ్యత న్యాయవాదులదే
  • మచిలీపట్నంలో పోక్సో, కడపలో మహిళా కోర్టు
  • వర్చ్యువల్‌గా ప్రారంభించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి


అమరావతి/కడప (రూరల్‌), జనవరి 21(ఆంధ్రజ్యోతి): పిల్లలు, మహిళలపై జరిగే నేరాలు చాలా హేయమైనవని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా పేర్కొన్నారు. బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు ప్రత్యేక కోర్టులు పనిచేస్తాయని తెలిపారు. చిన్నారుల పై లైంగిక వేధింపుల సెక్షన్ల కింద నమోదైన కేసులు విచారించేందుకు మచిలీపట్నంలో పోక్సో ప్రత్యేక కోర్టు, మహిళలపై జరిగిన నేరాలను విచారించేందుకు కడపలో ప్రత్యేక మహిళా కోర్టు (ఏడో అదనపు జిల్లా కోర్టు)ను శుక్రవారం వర్చ్యువల్‌ విధానంలో ఆయన హైకోర్టు నుంచి మీటనొక్కి ప్రారంభించారు. అమాయకులకు శిక్షపడకుండా, నేరస్థులు చట్టం నుంచి తప్పించుకోకుండా చూడాల్సిన బాధ్యత న్యాయవాదులపై ఉందన్నారు. మహిళలు, పిల్లలపై నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ తరహా కేసుల విషయంలో పటిష్ఠ విచారణ చేపట్టేందుకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాల్సి వస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు జస్టిస్‌ అసనుద్దీన్‌ అమానుల్లా, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తి, జస్టిస్‌ ఎం.వెంకటరమణ, జస్టిస్‌ బట్టు దేవానంద్‌ పాల్గొని ప్రసంగించారు. పెండెన్సీ కేసులు పరిష్కారానికి న్యాయవాదులు సహరించాలని కోరారు. కాగా.. నూతనంగా ప్రారంభమైన 7వ జిల్లా అదనపు కోర్టుకు ఇన్‌చార్జి జడ్జిగా జి.గీతను నియమిస్తూ రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది.

Updated Date - 2022-01-22T08:14:10+05:30 IST