మా అమ్మను చంపేశాడు.. నన్నూ కత్తితో పొడిచేశాడు!

ABN , First Publish Date - 2022-01-23T05:06:08+05:30 IST

కలిగిరి మండలంలోని అంబటివారిపాలెంకు చెందిన షేక్‌ మస్తాన్‌కు ఇద్దరు సోదరులు, ఇద్దరు సోదరీమణులు.

మా అమ్మను చంపేశాడు..  నన్నూ కత్తితో పొడిచేశాడు!
ఇంటి వరండాలో హత్యకు గురైన మీరమ్మ

ప్రశాంత పల్లెలో చావుకేక

కలిగిరి మండలంలో తల్లీ కొడుకు హత్య

ఒంగోలులో మరొకరిపై హత్యాయత్నం

వివాహేతర సంబంధమే కారణం?

పోలీసుల అదుపులో నిందితుడు


ఎంతో ప్రశాంతంగా ఉన్న పల్లెసీమలో చావుకేక వినబడింది. ‘‘మా అమ్మను చంపేశాడు.. నన్నూ కత్తితో పొడిచేశాడు రబ్బానీ..’’ అంటూ ఓ యువకుడు పెట్టిన కేక గ్రామం మొత్తం భీతిల్లిపోయేలా చేసింది. క్షణాల్లో ఆ యువకుడి ప్రాణం గాలిలో కలిసిపోగా, అంతా తేరుకునే లోపు అగంతకుడు వచ్చిన బైక్‌లోనే అక్కడ నుంచి జారుకున్నాడు. కలిగిరి మండలం అంబటివారిపాలెంలో శనివారం చోటుచేసుకుంది. ఇక్కడ నుంచి పరారైన అగంతకుడు ప్రకాశం జిల్లా ఒంగోలులో మరొకరిపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. రెండు జిల్లాల్లో సంచలనం రేపిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే..

కలిగిరి : కలిగిరి మండలంలోని అంబటివారిపాలెంకు చెందిన షేక్‌ మస్తాన్‌కు ఇద్దరు సోదరులు, ఇద్దరు సోదరీమణులు. వారిలో ఒక సోదరి నూర్జాహాన్‌కు నెల్లూరులో ఓ వ్యక్తితో వివాహం జరిపించగా భర్తతో విడిపోయింది. ఈ క్రమంలో పోలంపాడు గ్రామానికి చెందిన రబ్బానితో ఐదేళ్లుగా సహజీవనం సాగిస్తూ ఒక కుమారుడుకి జన్మనిచ్చింది. వీరు ఒంగోలులో ఐస్‌ బండి నడుపుకుంటూ జీవిస్తున్నారు. అయితే, నాలుగైదునెలల క్రితం రబ్బాని, నూర్జాహాన్‌ల మధ్య గొడవలు ఏర్పడటంతో ఆమె రబ్బానికి చెప్పకుండా వెళ్లిపోయింది. ఆమె వివరాలు తెలియని రబ్బాని ఆమె అన్న మస్తాన్‌ కుటుంబీకులే ఆమెకు ఆశ్రయం కల్పించి ఉంటారన్న అనుమానంతో శనివారం ఉదయం మోటార్‌ సైకిల్‌పై అంబటివారిపాలెంలో మస్తాన్‌ ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో మస్తాన భార్య మీరమ్మ ఒక్కరే ఇంట్లో ఉన్నారు. ఏమైందో ఏమోకాని మీరమ్మ (42) మెడపై కత్తితో పొడవడంతో ఆమె ఇంటి వరండాలో కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందింది. అదే సమయంలో నీళ్లు తెచ్చేందుకు వాటర్‌ప్లాంట్‌ వద్దకు వెళ్లిన ఆమె కుమారుడు ఆలీఫ్‌ (19) ఇంట్లోకి రావడంతో రబ్బాని అతడిని కూడా కత్తితో పొడిచాడు. తీవ్ర గాయాలతో గ్రామంలో కొంతదూరం పరుగెత్తిన ఆలీఫ్‌ తన తల్లిని, తనను రబ్బాని పొడిచేశాడని కేకలు వేస్తూ  కుప్పకూలి మృతి చెందాడు. దీంతో గ్రామస్థులు ఆ ఇంటి వైపు వెళ్లగా నిందితుడు మోటార్‌ సైకిల్‌పై పారిపోయినట్లు స్థానికులు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న కావలి డీఎస్పీ ప్రసాద్‌, సీఐ సాంబశివరావు ఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. నిందితుడి ఫొటోను మీడియాకు ఇచ్చారు. త్వరలో నిందితుడిని పట్టుకుంటామని పేర్కొన్నారు. కాగా అందరితో కలుపుగోలుగా ఉండే మీరమ్మ, నెల్లూరులోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో డిగ్రీ రెండోవ సంవత్సరం చదువుతున్న ఆమె కుమారుడు ఆలీఫ్‌ కరోనా కారాణంగా ఇంటికి వచ్చి హత్యకు గురై విగతజీవులుగా మారడంతో స్థానికులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. 


ఒంగోలులో మరొకరిపై హత్యాయత్నం


ఒంగోలు (క్రైం) : అంబటివారిపాలెం నుంచి రబ్బాని బస్సులో ఒంగోలుకు చేరుకున్నాడు. రవిప్రియ మాల్‌ సమీపంలో  కాశీకుమార్‌ అనే వ్యక్తి వచ్చిన వెంటనే తన భార్యను ఎక్కడ ఉంచావు.. అంటూ గొడవకు దిగాడు. తనకేమీ సంబంధం లేదంటూ అక్కడి నుంచి వెళ్లే ప్రయత్నం చేశాడు. అయితే రబ్బానీ తన వెంట తెచ్చుకున్న కత్తితో కాశీకుమార్‌ను పొడిచి తర్వాత గొంతు కోశాడు. తీవ్రంగా గాయపడిన కాశీకుమార్‌ను స్థానికులు ఆసుపత్రి తరలించారు. 





Updated Date - 2022-01-23T05:06:08+05:30 IST