పెళ్లింట పెను విషాదం

ABN , First Publish Date - 2022-06-24T05:53:53+05:30 IST

పెళ్లింట పెను విషాదం

పెళ్లింట పెను విషాదం

ఆగి ఉన్న లారీని ఢీకొన్న బైక్‌

ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి

వరంగల్‌ నాయుడు పెట్రోల్‌ పంపు వద్ద ఘటన

వివాహ రిసెప్షన్‌కు కూరగాయలు తీసుకెళుతుండగా ప్రమాదం

మృతులిద్దరూ పెళ్లి కుమారుడికి సోదరులు

ఇల్లంద, తమ్మడపెల్లి(ఐ) గ్రామాల్లో విషాదఛాయలు


మామునూరు/వర్ధన్నపేట, జూన్‌ 23: బంధు మిత్రులతో సంతోషంగా వివాహ వేడుకలు జరుపుకొని రిసెప్షన్‌కు సిద్ధమైన ఆ కుటుంబంలో అనుకోని ప్రమాదం పెను విషాదాన్ని నింపింది. రోడ్డు ప్రమాదంలో పెళ్లి కుమారుడి సోదరుడు, చిన్నమ్మ కుమారుడు మృతి చెందడంతో ఆయా కుటుంబాలు శోకసంద్రంంలో మునిగిపోయాయి. వరంగల్‌ ఆర్టీఏ జంక్షన్‌ సమీపంలోని నాయుడు పెట్రోల్‌ పంపు వద్ద గురువారం తెల్లవారుజామున ఆగి ఉన్న లారీని ద్విచక్రవాహనం వేగంగా ఢీకొట్టడడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. 


వరంగల్‌ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామానికి చెందిన గడ్డల ఎలేంద్ర- దుర్గయ్య దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. దుర్గయ్య సొంత భూమితో పాటు మరికొంత కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. పెద్ద కుమారుడు రాజశేఖర్‌ ఇల్లందలో మెకానిక్‌గా పనిచేస్తుండగా, చిన్న కుమారుడు మధుకర్‌(22) హైదరాబాద్‌లోని ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటూ తల్లిదండ్రులకు ఆసరాగా ఉంటున్నారు. ఈ నెల 22న పరకాలలో రాజశేఖర్‌ వివాహం జరిగింది. అన్న పెళ్లి కోసం మధుకర్‌  హైదరాబాద్‌ నుంచి ఇల్లందకు చేరుకున్నాడు. బుధవారం వివాహం పూర్తయ్యాక అదేరోజు రాత్రి ఇంటికి చేరుకున్నారు. బరాత్‌లో స్నేహితులు, బంధువులతో కలిసి ఉత్సాహంగా గడిపారు. మరుసటి రోజు గురువారం పెళ్లి కుమారుడు రాజశేఖర్‌ ఇంటి వద్ద రిసెప్షన్‌ పెట్టుకున్నారు. రిసెప్షన్‌కు వచ్చే బంధుమిత్రులకు భోజనాల కోసం కూరగాయలు తీసుకొచ్చేందుకు గడ్డల మధుకర్‌.. జనగామ జిల్లా జఫర్‌గడ్‌ మండలం తమ్మడపెల్లి(ఐ) గ్రామానికి చెందిన తన చిన్నమ్మ కొడుకు గణే్‌ష(22)తో కలిసి వరంగల్‌ కూరగాయాల మార్కెట్‌కు బయలుదేరారు. కూరగాయలు తీసుకుని వస్తుండగా నాయుడుపంపు వద్ద ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో మధుకర్‌, గణేష్‌ ముఖాలు ఛిద్రమై ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. 


రోదనలు

తమ్ముడు మృతిచెందడంతో పెళ్లి కుమారుడు రాజశేఖర్‌ రోదనలు అందరినీ కలచివేశాయి. రిసెప్షన్‌ జరగాల్సిన ఇల్లు రోదనలతో మిన్నంటింది. చేతికి వచ్చిన కుమారుడు మృతిచెందడంతో తల్లిదండ్రులు షాక్‌కు గురయ్యారు. ఇల్లంద గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా, మరో మృతుడు గణేష్‌ తల్లిదండ్రులు సదానందం-రమ వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. గణేష్‌ డిగ్రీ పూర్తి చేసి హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ కోర్సు చేస్తున్నాడు. పెద్దమ్మ కొడుకు పెళ్లి కోసమని వచ్చి గణేష్‌ రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో స్వగ్రామంలో విషాదం నెలకొంది.


అతివేగంతోనే ప్రమాదం

మార్కెట్‌ నుంచి మధుకర్‌, గణేష్‌ ఇద్దరూ బైక్‌పై ఇల్లందకు వెళుతుండగా నాయుడు పెట్రోల్‌ పంపు వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టారు. ప్రమాద సమయంలో బైక్‌ను మధుకర్‌ నడుపుతుండగా ఎదురుగా వచ్చే వాహనం లైట్ల వెలుతురు నేరుగా పడడంతో ముందు వైపు సరిగా కనిపించకపోవడంతో లారీని ఢీకొట్టినట్లు తెలుస్తోంది. వెంటనే సీఐ రమేష్‌ నాయక్‌ అక్కడికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతుల బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వివరించారు. పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించినట్లు తెలిపారు. 


పెళ్లికి వెళుతుండగా.. 


మోటార్‌ సైకిల్‌ను కారు ఢీకొనడంతో ఇద్దరు మృతి

స్టేషన్‌ఘన్‌పూర్‌లోని జాతీయ రహదారిపై ప్రమాదం

మృతులు చిలుపూరు మండలం క్రిష్ణాజీగూడెం వాసులు


స్టేషన్‌ఘన్‌పూర్‌, జూన్‌ 23 : పెళ్లికి వెళుతున్న ఇద్దరి పాలిట కారు మృత్యువాహనంలా దూసుకొచ్చింది. వారు ప్రయాణిస్తున్న మోటారు సైకిల్‌ను వేగంగా ఢీకొట్టడంతో ఇద్దరు మృతిచెందారు. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌ జాతీయరహదారిపై గురువారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించి సీఐ శ్రీనివా్‌సరెడ్డి, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.


జనగామ జిల్లా చిలుపూరు మండలంలోని క్రిష్ణాజీగూడెం గ్రామానికి చెందిన ఉడుత సమ్మయ్య (48), సాధం మచ్చ చంద్రయ్య (50)లు సమీప బంధువులు. ఉడుత సమ్మయ్య చిన్నాన్న కుమార్తె వివాహం స్టేషన్‌ ఘన్‌పూర్‌లోని ఓ ఫంక్షన్‌హల్‌లో జరుగుతోంది. వివాహ వేడుకకు హాజరయ్యేందుకు ఇద్దరు టీవీఎస్‌ ఎక్స్‌ఎల్‌ వాహనంపై క్రిష్ణాజీగూడెం నుంచి వస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌కు చెందిన నలుగురు వ్యక్తులు వరంగల్‌ జిల్లా మామునూరులో ఓ వివాహ వేడుకకు హాజరయ్యేందుకు కారులో వస్తున్నారు. పల్లగుట్ట క్రాస్‌రోడ్డు వద్ద జాతీయ రహదారిని మోటారు సైకిల్‌ క్రాస్‌ చేస్తుండగా కారు వేగంగా ఢీకొట్టి డివైడర్‌ మీది నుంచి పక్కరోడ్డు పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో సమ్మయ్య తలకు బలమైన గాయాలై అక్కడికి అక్కడే మృతి చెందాడు. మచ్చ చంద్రయ్యకు రెండు కాళ్లు విరుగగా ప్రైవేట్‌ వాహనంలో హనుమకొండలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా, ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురికి ఏవిధమైన గాయాలు కాలేదు. కారులో ప్రయాణిస్తున్న మహిళా డాక్టర్‌ వెంటనే కారులో నుంచి దిగివచ్చి ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఉడుత సమ్మయ్య (48) ఛాతిపై ఒత్తిడి చేసినప్పటికీ అప్పటికే మృతి చెందాడు.


బంధువులు, గ్రామస్థుల ఆందోళన

రోడ్డు ప్రమాదంలో సమ్మయ్య మృతి చెందారనే విషయం తెలుసుకున్న బంధువులు, గ్రామస్థులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. తమకు తగు న్యాయం జరిగే వరకు మృతదేహాన్ని రహదారి మీద నుంచి తీసుకువెళ్లనివ్వమని ఆందోళన చేబట్టారు. పోలీసులు నచ్చజెప్పినా వినలేదు. ఈ క్రమంలో జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు కొంతసేపు స్తంభించాయి. విషయం తెలుసుకున్న సీఐ ఎడవెల్లి శ్రీనివాస్‌రెడ్డి అక్కడకు చేరుకొని మృతుడు సమ్మయ్య బంధువులకు తగు న్యాయం చేస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమింపచేశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వరంగల్‌ ఎంజీఎంకు తరలించారు. ఎస్సైలు శ్రీనివాస్‌, శ్రావణ్‌కుమార్‌లు జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ను నియంత్రించారు. కాగా, సమ్మయ్యకు భార్య కొన్నేళ్ల కిందట మృతిచెందగా, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మరొక మృతుడు మచ్చ చంద్రయ్యకు భార్య లక్ష్మి, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. వారి కుటుంబసభ్యుల ఫిర్యాదుతో ప్రమాదానికి కారణమైన కారును సీజ్‌ చేసి కారు నడిపిన వేణుగోపాలనాయుడుపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు. 

Updated Date - 2022-06-24T05:53:53+05:30 IST