Advertisement

నీటి సంపులో పడి బాలుడి మృతి

Nov 28 2020 @ 00:00AM
కేతేపల్లిలో బాలుడి మృతదేహం వద్ద రోదిస్తున్నతల్లి

కేతేపలి, నవంబర్‌ 28: ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి బాలుడు మృతి చెందిన సంఘటన నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలకేంద్రంలో చోటుచేసుకుంది. సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్‌ మండలం అనంతారం గ్రామానికి చెందిన బచ్చలకూరి ముక్కంటి నాలుగేళ్ల క్రితం బతుకుదెరువకోసం కేతేపల్లి వచ్చాడు. కేతేపల్లిలో హోటల్‌ నిర్వహిస్తూ కుటుంబంతో జీవనం సాగిస్తున్నాడు. ముక్కంటికి భార్యతోపాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ క్రమంలో ముక్కంటి, భార్యతో కలిసి శనివారం హోటల్‌ నిర్వహణకు వెళ్లగా ఇంటి వద్ద ఉన్న చిన్నారులు ఆడుకుంటున్నారు. ఆడుకుంటూ పక్కింట్లోకి వెళ్లిన ముక్కంటి చిన్న కుమారుడు విహాల్‌(3) ప్రమాదవశాత్తు ఆ ఇంట్లోని నీటి సంపులో పడిపోయాడు. చాలా సేపటి వరకు ఎవరూ గమనించకపోవడంతో బాలుడు మృతి చెందాడు. సుమారు గంట తర్వాత బయటకు వచ్చిన ఆ ఇంటివారు నీటి సంపులో బాలుడి మృతదేహాన్ని గమనించి కేకలు వేశారు. దీంతో పరిసర నివాస గృహాల వారు అక్కడికి చేరుకొని బాలుడిని బయటికి తీసి వైద్యుడి వద్దకు తీసుకెళ్లగా అప్పటికే బాలుడు మృతి చెందాడు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు గుండెలు అవిసేలా విలపించారు.


అనుమానంతో భర్తపై యాసిడ్‌ పోసింది

అనుమానంతో భర్తపై యాసిడ్‌ పోసింది

స్వల్ప గాయాలతో బయటపడ్డ వ్యక్తి

పదేళ్లుగా మానసిక వైద్యం చేయించుకుంటున్న భార్య

సూర్యాపేట జిల్లా కోదాడలో ఘటన

కోదాడరూరల్‌, నవంబరు 28: మానసిక పరిస్థితి బాగాలేని ఓ మహిళ తన భర్తపై అనుమానంతో టాయిలెట్‌లో వినియోగించే యాసిడ్‌ పోసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని శ్రీనివాసనగర్‌లో నివాసం ఉంటున్న గంగవరపు నర్సింహారావు(58)కు లక్ష్మితో 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు, కూతురు ఉన్నారు. కూతురి వివాహం కూడా అయింది. కాగా, లక్ష్మి మానసికస్థితి సరిగాలేకపోవడంతో పదేళ్లుగా వైద్య చికిత్స తీసుకుంటోంది. భర్తపై తరచూ అనుమానంతో ఘర్షణపడేది. నర్సింహారావు మరో మహిళతో సన్నిహితంగా ఉంటున్నాడనే అనుమానంతో శనివారం ఉదయం ఇంట్లో ఉపయోగించే యాసిడ్‌ను అతడిపై పోసింది. యాసిడ్‌ నర్సింహారావు ముఖంపై పడగా, మంటపుట్టడంతో ఒక్కసారిగా బయటికి పరిగెత్తాడు. అతడిని స్థానికులు, కుమారుడి సహాయంతో వెంటనే కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చర్మ వైద్యుడికి చూపించారు. అయితే ప్రమాదం ఏమీ లేదని, అక్కడి వైద్యులు చికిత్స అనంతరం ఇంటికి పంపిచారు. కాగా, నర్సింహారావు భార్య లక్ష్మి మానసిక స్థితి బాగా లేదని, ఆమె తరచూ భర్తను అనుమానిస్తూ, ఘర్షణలకు పాల్పడుతోందని పోలీసులు తెలిపారు. నర్సింహారావు కుమారుడు రవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు కోదాడ ఎస్‌ఐ రవీందర్‌ తెలిపారు.


చికిత్స పొందుతూ వివాహిత మృతి 

భువనగిరి రూరల్‌, నవంబరు 28: కుటుంబ కలహాలతో ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని నిప్పంటించుకున్న మహిళ చికిత్స పొందుతూ శనివారం మృతిచెందింది. భువనగిరి రూరల్‌ ఎస్‌ఐ కె.రాఘవేందర్‌గౌడ్‌ వివరాల ప్రకారం భువనగిరి మండలం ముత్తిరెడ్డిగూడేనికి మహ్మద్‌ బషీర్‌కు చిట్యాల మండలం గుండ్రాపల్లి గ్రామానికి చెందిన అషియాబేగం(21)తో రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. కుటుంబ కలహాలతో అషియాబేగం శుక్రవారం ఒంటిపై కిరోసిన్‌పోసుకుని నిప్పంటించుకుంది. కుటుంబ సభ్యులు అషియాను భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యంకోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం మృతిచెందింది. అషియాబేగం తల్లి సైమాబేగం ఇచ్చిన ఫిర్యాదు  మేరకు కేసు  దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

 

విద్యుదాఘాతంతో పాడి ఆవు మృతి 

ఆలేరు రూరల్‌, నవంబరు 28: ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో పాడి ఆవు మృతి చెందింది. మండలంలోని శ్రీనివాసపురం గ్రామానికి  చెందిన రైతు చౌడబోయిన తిరుపతి, తన ఆవును మేపడానికి విడిచాడు. ప్రమాదవశాత్తు విద్యుత్‌ స్తంభానికి తగలడంతో విద్యుదాఘాతంతో మృతి చెందింది. 


ఇద్దరు కానిస్టేబుళ్ల సస్పెన్షన్‌

చౌటుప్పల్‌ రూరల్‌, నవంబరు 28: ప్రేమ జంట నుంచి డబ్బులు డిమాండ్‌ చేసిన ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్‌ చేశారు. చౌటుప్పల్‌ పోలీ్‌సస్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుళ్లు ఆర్‌.చంద్రశేఖర్‌, కె.లింగస్వామి కలిసి వారం రోజుల క్రితం ఓ ప్రేమజంటను బెదిరించి డబ్బులు డిమాండ్‌చేశారు. ఈ విషయం స్థానిక సీఐకి సమాచారం అందించడంతో, కానిస్టేబుళ్లపై డీజీపీకి నివేదిక అందించారు. సీఐ నివేదిక ఆధారంగా కానిస్టేబుళ్లను సస్పెండ్‌ చేస్తూ డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. 


యాదాద్రి కొండపై తాత్కాలికంగా దుకాణాలు సీజ్‌ 

యాదాద్రి టౌన్‌, నవంబరు 28: కార్తీక దీపాలు, మొక్కు టెంకాయల దుకాణాలను శనివారం దేవస్థాన అధికారులు తాత్కాలికంగా సీజ్‌చేశారు. మొక్కు టెంకాయలు, కార్తీక దీపాలను అధిక ధరలకు విక్రయిస్తున్నారంటూ వచ్చిన ఫిర్యాదుల మేరకు ఆయా దుకాణాలను సీజ్‌ చేసినట్లు దేవస్థాన అధికారులు పేర్కొన్నారు.  మొక్కు టెంకాయలు, కార్తీక దీపారాధన విక్రయాల దుకాణాల చెంత దేవస్థానం నిర్ణయించిన ధరల పట్టికను ఏర్పాటు చేసుకోవాలని, టెండరు ధరకు మాత్రమే భక్తులకు కార్తీక దీపాలు, మొక్కు టెంకాయలు విక్రయించాలని దుకాణదారులకు ఈవో గీతారెడ్డి సూచించారు. 


మేకల దొంగల అరెస్ట్‌ : రిమాండ్‌  

మర్రిగూడ, నవంబరు 28: మేకల దొంగతనం కేసులో ముగ్గురు నిందితులను అరె్‌స్టచేసి, రిమాండ్‌చేసినట్లు మర్రిగూడ ఎస్‌ఐ క్రాంతికుమార్‌ తెలిపారు. గతనెల 15న మర్రిగూడ మండలంలోని తమడపల్లి, మర్రిగూడ గ్రామాల్లో మేకలు చోరీకి గురైన  విషయం విధితమే. అయితే తమడపల్లి, మర్రిగూడ గ్రామాలకు చెందిన మేకల యజమానులు కొట్టం రాజయ్య, తిరుమని అంజమ్మ గతనెల 15న పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈమేరకు ఎస్‌ఐ క్రాంతికుమార్‌ విచారణ నిర్వహించగా హాలియా మండలంలోని 14వ మైలు వద్ద సంపంగి వెంకటేష్‌, శారద, వారితోపాటు మునుగోడు మండలానికి చెందిన గూడపూర్‌ గ్రామవాసి వేమిరెడ్డి శ్రీనివా్‌సరెడ్డి కలిసి మేకలను అపహరించినట్లు విచారణలో వెల్లడైందని ఎస్‌ఐ క్రాంతికుమార్‌ తెలిపారు. ఈ ముగ్గురిని శనివారం దేవరకొండ కోర్టులో రిమాండ్‌ చేసినట్లు తెలిపారు.  Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.