నేరాల ఛేదనను చాలెంజ్‌గా తీసుకోవాలి

May 9 2021 @ 00:28AM
మాట్లాడుతున్న అడిషనల్‌ డీసీపీ జీ చంద్రమోహన్‌

-అడిషనల్‌ డీసీపీ జీ చంద్రమోహన్‌

కరీంనగర్‌ క్రైం, మే8: క్రైంపార్టీ పోలీసులు నేరాలను ఛేదించడాన్ని చాలెంజ్‌గా తీసుకోవాలని అడిషనల్‌ డీసీపీ జీ చంద్రమోహన్‌ అన్నారు. శనివారం కమిషనరేట్‌ కేంద్రంలో క్రైంపార్టీ పోలీసులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్‌ డీసీపీ మాట్లాడుతూ పట్టుదలతో కృషి చేస్తే ఎలాంటి కేసునైనా ఛేదించవచ్చన్నారు. ఎండాకాలంలో దొంగతనాలు జరిగేందుకు ఎక్కువగా ఆస్కారముంటుందని, క్రైంపార్టీ పోలీసులు అనునిత్యం అప్రమత్తంగా ఉంటూ నేరస్థుల కదలికలపై నిఘా ఉంచాలన్నారు. నేరాల నియంత్రణకు ప్రణాళికలను రూపొందించాలని సూచించారు. నేరాల ఛేదనకు సైబర్‌ల్యాబ్‌ సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. గుట్కా, మట్కా, పేకాట, వ్యభిచారం, నకిలీ విత్తనాలపై సమాచారం సేకరించాలన్నారు. సమాచార వ్యవస్థను పెంపొందించుకోవటం ద్వారా నేరస్థుల కదలికలను పసిగట్టవచ్చని అడిషనల్‌ డీసీపీ అన్నారు. రివార్డులు, అవార్డుల ప్రకటనలో క్రైం బృందాలకు ప్రత్యేక ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. ఏ తరహా నేరాలు ఏయే నేరస్థులు చేస్తారో నేరం జరిగిన వెంటనే అంచనాకు రావాలని ఆయన సూచించారు. నేరస్థలంలో సాక్ష్యాధారాలు చెదరకుండా తీసుకునే జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. నేరాల నియంత్రణకు రేయింబవళ్లు గస్తీని ముమ్మరం చేయనున్నామని అడిషనల్‌ డీసీపీ తెలిపారు. ఈ సమావేశంలో సీఐ జవ్వాజి సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on: