టీటీడీ బోర్డులో నేరగాళ్లు, కళంకితులు

ABN , First Publish Date - 2021-09-18T07:59:58+05:30 IST

భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా తిరుమల తిరుపతి దేవస్థానానికి వేసిన జంబో బోర్డును తక్షణం రద్దు చేయాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు డిమాండ్‌ చేశారు.

టీటీడీ బోర్డులో నేరగాళ్లు, కళంకితులు

సీబీఐ కేసుల్లో ఉన్నవారూ సభ్యులేనా?

అనర్హులను నియమించి ఆలయ ప్రతిష్ఠ దిగజార్చారు

జంబో బోర్డును తక్షణమే రద్దు చేయండి

సంప్రదాయాలు పాటిస్తూ కొత్త బోర్డు వేయండి

ముఖ్యమంత్రికి చంద్రబాబు లేఖ


అమరావతి, సెప్టెంబరు 17(ఆంధ్రజ్యోతి): భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా తిరుమల తిరుపతి దేవస్థానానికి వేసిన జంబో బోర్డును తక్షణం రద్దు చేయాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు డిమాండ్‌ చేశారు. ఈమేరకు ఆయన ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డికి శుక్రవారం ఒక లేఖ రాశారు. ‘ఆధ్యాత్మిక చింతనకు, సనాతన హైందవ ధర్మానికి ప్రతీక అయిన తిరుమల పవిత్ర క్షేత్రాన్ని వ్యాపార సంస్థగా మార్చడం అత్యంత బాధాకరం. టీటీడీని రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం సరికాదు. భక్తి భావం, సేవా స్పూర్తి కలిగిన వారితో ఏర్పాటవ్వాల్సిన ఆలయ ధర్మకర్తల మండలిలో పారిశ్రామికవేత్తలు, అవినీతిపరులు, నేరగాళ్లు, కళంకితులకు చోటు కల్పించడాన్ని టీడీపీ తీవ్రంగా ఖండిస్తోంది. ముందెన్నడూ లేనివిధంగా 81 మందితో జంబో బోర్డు ఏర్పాటు చేయడం గర్హనీయం. ఇంతమందిని వేయడంలో స్వార్ధ ప్రయోజనాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తిరుమల ప్రాశస్త్యాన్ని, పవిత్రతను దెబ్బతీసేలా రాజకీయ వ్యాపార ప్రయోజనాల కోసం బోర్డు సైజు పెంచేశారు. అనర్హులను సభ్యులుగా నియమించి శ్రీవారి ఆలయ ప్రతిష్ఠను, భక్తుల మనోభావాలను కించపర్చారు’ అని ఆయన తన లేఖలో విమర్శించారు. ‘స్వప్రయోజనాల కోసం రాజకీయ నిరుద్యోగుల పునరావాస కేంద్రంగా టీటీడీని మార్చారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ సీబీఐ కేసుల్లో ఉన్న వారిని కూడా సభ్యులుగా చేర్చి బోర్డు పవిత్రతను దెబ్బ తీశారు.


గత రెండున్నరేళ్లుగా తిరుమల పవిత్రత దెబ్బతింటూ వస్తోంది. అన్యమత ప్రచారం, ఎస్వీబీసీ చైర్మన్‌ రాసలీలలు, భక్తుల తలనీలాల స్మగ్లింగ్‌, టీటీడీ పత్రికలో రామాయణాన్ని వక్రీకరించడం, లడ్డూ ప్రసాదం ధరలు పెంచడం, శ్రీవారి ప్రసాదాన్ని ఎన్నికల ప్రచారంలో పంపిణీ చేయడం వంటి అనేక అనైతిక చర్యలు చోటుచేసుకొన్నాయి. తిరుమల గిరుల్లో డివైడర్లకు వైసీపీ రంగులు వేశారు. డ్రోన్లు ఎగరవేసి ర్యాలీలు నిర్వహించారు. తిరుమల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. జంబో బోర్డును రద్దు చేసి తిరుమల సంప్రదాయాలకు అనుగుణంగా కొత్త ధర్మకర్తల మండలిని ఏర్పాటు చేయాలి’ అని తన లేఖ లో ముఖ్యమంత్రికి సూచించారు. స్వామివారి ప్రతిష్ఠ ను దెబ్బతీస్తే భవిష్యత్తులో మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. 

Updated Date - 2021-09-18T07:59:58+05:30 IST