క్రిప్టో’ నిబంధనలు ఉల్లంఘిస్తే కటకటాలే!

ABN , First Publish Date - 2021-12-08T08:03:19+05:30 IST

క్రిప్టోకరెన్సీల బిల్లును కేంద్ర ప్రభుత్వం అత్యంత పకడ్బందీగా రూపొందిస్తోంది. వీటి లావాదేవీల్లో ఏ మాత్రం హద్దులు దాటినా.....

క్రిప్టో’ నిబంధనలు ఉల్లంఘిస్తే కటకటాలే!

రూ.20 కోట్ల జరిమానా లేదా ఏడాదిన్నర జైలు

న్యూఢిల్లీ: క్రిప్టోకరెన్సీల బిల్లును కేంద్ర ప్రభుత్వం అత్యంత పకడ్బందీగా రూపొందిస్తోంది. వీటి లావాదేవీల్లో ఏ మాత్రం హద్దులు దాటినా.. అందుకు బాధ్యులైన వారికి రూ.20 కోట్ల జరిమానా లేదా ఏడాదిన్నర పాటు జైలు తప్పదని బిల్లులో పేర్కొన్నట్టు సమాచారం. ఇంకా ఇలాంటి వ్యక్తుల్ని బెయిల్‌కు కూడా అవకాశం లేని అరెస్టు వారెంట్‌ కింద అరెస్టు చేసేందుకూ వీలు కల్పించబోతోంది. 


‘కనీస’ పరిమితి: వీటికి తోడు చిన్న మదుపరులు క్రిప్టోకరెన్సీల్లో పెట్టుబడులు పెట్టి చేతులు కాల్చుకోకుండా నిరోధించేందుకూ ప్రభుత్వం బిల్లులో ప్రత్యేక నిబంధనలు పెట్టబోతోంది. ఇందుకోసం కనీస పెట్టుబడి నిబంధన విధించినట్టు తెలుస్తోంది. పార్లమెంట్‌ ప్రస్తుత సమావేశాల్లోనే క్రిప్టోల బిల్లు ప్రవేశపెడతామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఇంతకు ముందే ప్రకటించారు.


నల్లధనానికి చెక్‌: తమ నల్లధనాన్ని క్రిప్టోల్లో మదుపు చేసిన ఘరానా పెద్దలకు చెక్‌ పెట్టేందుకూ ప్రభుత్వం ఈ బిల్లులో ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. వీటిల్లో పెట్టుబడులు పెట్టిన ప్రతి ఒక్కరూ ఒక నిర్ణీత తేదీలోగా తమ పెట్టుబడుల వివరాలన్నీ వెల్లడించాలని గడువు విధించబోతున్నట్టు సమాచారం. దీంతో ఇప్పటి వరకు ఎలాంటి లెక్కపత్రం లేకుండా క్రిప్టోల్లో మదుపు చేసిన నల్లధన స్వాముల జాతకాలూ బయటపడతాయని భావిస్తున్నారు.


సెబీ, ఆర్‌బీఐలకు అధికారం: దీనికి  తోడు క్రిప్టో కరెన్సీల లావాదేవీలపై పర్యవేక్షణ అధికారాన్ని ప్రభుత్వం.. మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ, భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ)కి ఇవ్వబోతున్నట్టు సమాచారం. ఇందుకోసం క్రిప్టోలను కరెన్సీలుగా కాకుండా క్రిప్టో ఆస్తులుగా ప్రతిపాదిత బిల్లులో పేర్కొన్నారు. ఇక వీటి లావాదేవీలకు తోడ్పడుతున్న ఎక్స్ఛేంజీలు తమ ఖాతా దారుల కేవైసీ వివరాల్ని సెబీ, ఆర్‌బీఐ, ఆదాయ పన్ను శాఖలకు ఇవ్వాల్సి ఉంటుంది. తద్వారా వాటి పెట్టుబడులు, లాభాలపైనా పన్నులు విధించేందుకు ప్రభుత్వానికి వీలవుతుంది.


ఇంతకీ ఈ బిల్లు ద్వారా ప్రభుత్వం క్రిప్టోకరెన్సీల్లో భారతీయుల లావాదేవీలను నిషేధిస్తుందా? లేక నియంత్రిస్తుందా? అనే దానిపై ఇంకా స్పష్టత లేదు. బిట్‌కాయిన్‌ వంటి క్రిప్టోకరెన్సీలను చట్టబద్ద కరెన్సీలుగా గుర్తించే ప్రసక్తే లేదని ఆర్థిక మంత్రి ఇప్పటికే స్పష్టం చేశారు. అధికార వర్గాలు మాత్రం వీటిని నిషేధించకుండా నియంత్రించేలా బిల్లు రూపొందించినట్టు చెబుతున్నాయి. కరన్సీ నోట్లలా క్రిప్టోల మార్పిడి, నిల్వ చేయడం లేదా ఖాతా కలిగి ఉండడాన్ని నిషేధిస్తున్నట్టు బిల్లు ప్రారంభంలో పేర్కొన్నట్టు సమాచారం. ప్రభుత్వం అధికారికంగా బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెడితే తప్ప పూర్తి వివరాలు తెలియవని భావిస్తున్నారు. 

Updated Date - 2021-12-08T08:03:19+05:30 IST