ఎత్తులు.. పైఎత్తులు

Published: Mon, 27 Jun 2022 11:27:58 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఎత్తులు.. పైఎత్తులు

తుది అంకానికి ‘రెండాకుల’ పార్టీ సంక్షోభం! 

నేడు అన్నాడీఎంకే నేతల అత్యవసర సమావేశం

కార్యకర్తలంతా నా వైపే-సమస్యకు పరిష్కారం కనుగొంటా : మదురైలో ఓపీఎస్‌

అన్నాడీఎంకే అధికారపత్రిక నుంచి ఓపీఎస్‌ పేరు తొలగింపు 

మౌనం వీడని ఈపీఎస్‌

తెర వెనుక నుంచే వ్యూహరచన!


చెన్నై: అన్నాడీఎంకేలో సంక్షోభం తుది అంకానికి చేరుకుంటోంది. అగ్రనేతలైన ఓపీఎస్‌, ఈపీఎ్‌సలు రెండు వర్గాలుగా చీలిపోయి ఒకరిపై ఒకరు ఎత్తులు, పైఎత్తులతో పార్టీని హస్తగతం చేసుకునేందుకు పావులు కదుపుతున్నారు. ముఖ్యంగా వచ్చే నెల 11వ తేదీన నిర్వహించతలపెట్టిన ఆ పార్టీ సర్వసభ్య సమావేశాన్ని అడ్డుకునేందుకు ఓపీఎస్‌ వర్గం శతవిధాలా ప్రయత్నిస్తుండగా, ఆయన్ని పార్టీ నుంచి తొలగించేందుకు ఈపీఎస్‌ వర్గం వ్యూహరచన చేస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి.


మరోవైపు పార్టీ కార్యకర్తలంతా తనవైపే ఉన్నారనీ, పార్టీలో ఉత్పన్నమైన సమస్యకు తగిన రీతిలో పరిష్కారం కనుగొంటానని ఓపీఎస్‌ ప్రకటించగా, అన్నాడీఎంకే అధికార పత్రిక ‘నమదు అమ్మ’ నుంచి ఆయన పేరును ఈపీఎస్‌ వర్గం తొలగించింది. ఏకనాయకత్వ అంశం అన్నాడీఎంకేలో చిచ్చురేపిన విషయం తెలిసిందే. పార్టీపై అంతగా పట్టులేని ఓపీఎస్‌.. ద్వంద్వ నాయకత్వం కోసం పట్టుబడుతుండగా, పార్టీపై పూర్తి పట్టు సాధించిన ఈపీఎస్‌ మాత్రం ఏకనాయకత్వం కోసం రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే పార్టీ పగ్గాలు తన చేతుల నుంచి జారిపోతున్నాయని గ్రహించిన ఓపీఎస్‌.. హడావుడిగా ఢిల్లీ వెళ్లి పెద్దలను కలిసి వచ్చారు. అటు నుంచి ఎలాంటి హామీ లభించిందో తెలియదు గానీ ఆయన మాత్రం గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. అయితే అదంతా మేకపోతు గాంభీర్యమేనని, ఆయన్ని కలుసుకునేందుకు మోదీ, అమిత్‌షా విముఖత చూపారని ఈపీఎస్‌ వర్గీయులు చెబుతున్నారు. 


రేపు పార్టీ కార్యాలయానికి ఓపీఎస్‌!

ప్రస్తుతం మదురైకి వెళ్ళిన ఓపీఎస్‌ ఈ నెల 28వ తేదీన చెన్నైకి రానున్నారు. ఆయన నేరుగా పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకుని ముఖ్య అనుచరులతో చర్చలు జరిపే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా, ఈపీఎస్‌ వర్గం దూకుడుకు కళ్లెం వేసేలా వ్యూహాలు రచిస్తున్నారు. ముఖ్యంగా జూలై 11వ తేదీన పార్టీ సర్వసభ్య సమావేశం జరుగకుండా అడ్డుకోవాలని భావిస్తున్నారు. ఇందుకోసం ఒకవైపు న్యాయపోరాటం చేస్తూనే, మరోవైపు పార్టీ కన్వీనర్‌ హోదాలో తాను చేయాల్సిన పనులు చేయాలని భావిస్తున్నారు. అయితే ఆయన్ని అడ్డుకునేందుకు ఈపీఎస్‌ వర్గం సిద్ధమవుతోంది. 


కార్యకర్తలంతా నా వైపే: ఓపీఎస్‌

ఆదివారం చెన్నై నుంచి మదురైకు వెళ్ళి ఓపీఎ్‌సకు విమానాశ్రయంలో పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ... పార్టీ కార్యకర్తలంతా తనవైపే ఉన్నారనీ, పార్టీలో ఏర్పడిన సంక్షోభానికి పరిష్కారం కనుగొంటానని ఓపీఎస్‌ ప్రకటించారు. పార్టీలో అసాధారణ పరిస్థితి నెలకొందని, దీనికి ఎవరు కారణమో పార్టీ కార్యకర్తలకు బాగా తెలుసన్నారు. ఈ సమస్యకు పార్టీ కార్యకర్తలు తగిన సమాధానం చెబుతారన్నారు. ఈ సంక్షోభం ఎవరివల్ల ఉత్పన్నమైందో త్వరలోనే ప్రతి ఒక్కరికీ తెలుస్తుందని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. 


మూకుమ్మడి వేటుపై ఆలోచనలు?

అన్నాడీఎంకేలో నెలకొన్న సంక్షోభానికి పరిష్కారం చూపేలా ఓపీఎ్‌సను, ఆయన మద్దతుదారులను మూకుమ్మడిగా బహిష్కరించాలని ఈపీఎస్‌ వర్గం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకోసం  రెండు రోజులుగా ఓపీఎస్‌ వర్గం జాబితాను తయారు చేసే పనిలో నిమగ్నమైనట్టు సమాచారం. ఈ జాబితా సిద్ధమైన తర్వాత పార్టీ జనరల్‌ బాడీ సమావేశానికి ముందే వారిని బహిష్కరించేలా వ్యూహం రచిస్తున్నారు. ఇందుకోసం ఆయన న్యాయనిపుణులతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. 


‘నమదు అమ్మ’ పత్రికలో ఓపీఎస్‌ పేరు తొలగింపు

అన్నాడీఎంకే అధికార పత్రిక నమదు అమ్మ పత్రిక వ్యవస్థాపకుల పేర్ల నుంచి ఒ.పన్నీర్‌సెల్వం పేరును తొలగించారు. జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నమదు ఎంజీఆర్‌ పత్రిక వెలువడేది. ఆమె మృతి తర్వాత ఆ పత్రికను శశికళ వర్గీయులు స్వాధీనం చేసుకున్నారు. నమదు ఎంజీఆర్‌ పత్రిక టీటీవీ దినకరన్‌ పర్యవేక్షణలో ప్రచురితమవుతుంది. దీంతో అన్నాడీఎంకే బాధ్యతలను ఓపీఎస్‌, ఈపీఎస్‌ చేపట్టిన తర్వాత  వీరి పర్యవేక్షణలో నమదు అమ్మ దినపత్రికను ప్రారంభించారు. ఇందులో మొదటి పేజీలోనే వ్యవస్థాపకులు ఎడప్పాడి పళనిస్వామి, ఒ.పన్నీర్‌సెల్వం పేర్లను ముద్రించేవారు. ఇప్పుడు ఓపీఎస్‌ పేరును ఈ పత్రిక నుంచి తొలగించారు. ఈ నిర్ణయం ఓపీఎ్‌సను పార్టీ నుంచి బహిష్కరించే చర్యల్లో భాగమేనని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. 


సర్వసభ్యమండలి సమావేశాన్ని అడ్డుకుంటాం: వైద్యలింగం

జూలై 11వ తేదీన నిర్వహించదలచిన పార్టీ సర్వసభ్యమండలి సమావేశాన్ని అడ్డుకుంటామని ఓపీఎస్‌ వర్గానికి చెందిన మాజీ మంత్రి వైద్యలింగం ప్రకటించారు. ఆయన తంజావూరులో విలేకరులతో మాట్లాడుతూ... ఈ నెల 23వ తేదీన జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశానికి 600 మంది హాజరయ్యారని చెప్పారు. వారివల్లే పార్టీలో సమస్య ఉత్పన్నమైందన్నారు. పార్టీ నిబంధనలకు వ్యతిరేకంగా చేసిన తీర్మానాలను తోసిపుచ్చడం వల్లే తాము ఆ సమావేశాన్ని బహిష్కరించినట్టు చెప్పారు. పార్టీకి ద్వంద్వ నాయకత్వం కావాలన్నదే తమ లక్ష్యమన్నారు. 


నేడు అన్నాడీఎంకే నేతల అత్యవసర సమావేశం

పార్టీలో తలెత్తిన సంక్షోభాన్ని అధిగమించేందుకు అన్నాడీఎంకే  నేతలు సోమవారం అత్యవసరంగా భేటీ కానున్నారు. ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యులు జిల్లా కార్యదర్శులు, సీనియర్లు సోమవారం పార్టీ ప్రధాన కార్యాలయానికి తరలిరావాలంటూ అన్నాడీఎంకే  పేరుతో ఆదేశాలు జారీ అయ్యాయి. గతంలో ఈపీఎస్‌-ఓపీఎస్‌ల పేరుతో విడుదలైన ప్రకటనలకు భిన్నంగా ఇప్పుడు పార్టీ పేరుతోనే ప్రకటన విడుదల కావడం గమనార్హం.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.