ఇచ్చేది 10 వేలు.. గుంజేది 30 వేలు!

ABN , First Publish Date - 2021-06-16T08:18:41+05:30 IST

వాహనమిత్ర పేరుతో జగన్‌ ప్రభుత్వం ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు రూ.10 వేలు ఇచ్చి పరోక్షంగా వారి నుంచి రూ.30 వేలు గుంజుతోందని టీడీపీ నేతలు విమర్శించారు. ‘‘వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత డీజిల్‌

ఇచ్చేది 10 వేలు.. గుంజేది 30 వేలు!

వాహనమిత్రపై టీడీపీ నేతల విమర్శ


అమరావతి/విజయవాడ, జూన్‌ 15(ఆంధ్రజ్యోతి): వాహనమిత్ర పేరుతో జగన్‌ ప్రభుత్వం ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు రూ.10 వేలు ఇచ్చి పరోక్షంగా వారి నుంచి రూ.30 వేలు గుంజుతోందని టీడీపీ నేతలు విమర్శించారు. ‘‘వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత డీజిల్‌ ధరలు అడ్డగోలుగా పెంచుకొంటూ పోయింది. వాహనాలు నడిపేవారికి ఉపశమనం కలిగించే నిమిత్తం కేరళ ప్రభుత్వం డీజిల్‌ ధర తగ్గించింది. జగన్‌ ప్రభుత్వం పన్నులు పెంచుకొంటూ పోవడం తప్ప తగ్గించడం లేదు. వాహనాలు నడిపేవారిపై పోలీస్‌ జరిమానాలు విపరీతంగా పెంచేశారు. ఇవన్నీ లెక్కవేస్తే వారికి ఇచ్చిన దానికి మూడు రెట్లు వారి నుంచి ప్రభుత్వం వసూలు చేసుకొంటోంది’’ అని మాజీ మంత్రి జవహర్‌ విరుచుకుపడ్డారు. 


అరాచక ఆంధ్రప్రదేశ్‌ చేస్తున్నారు: అచ్చెన్న

నవ్యాంధ్రప్రదేశ్‌ను ముఖ్యమంత్రి అరాచకాంధ్రప్రదేశ్‌గా మారుస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. అభివృద్ధిలో ముందుండాల్సిన రాష్ట్రాన్ని అరాచకాలు, అకృత్యాలు, అన్యాయాల్లో ముందుంజలో ఉంచారని, రెండేళ్ల జగన్‌పాలనలో కక్షసాధింపు తప్ప, ప్రజలకు చేసిన మేలేమీ లేదని విమర్శించారు. గుంటూరు జిల్లా అమరావతి మండలం ఉంగుటూరు గ్రామ సర్పంచ్‌ భర్త సోమశేఖర్‌పై వైసీపీ నాయకులు మారణాయుధాలతో దాడి చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. రెండు నెలల్లో ఆరుసార్లు దాడి జరిగినా ఇంత వరకు కేసు ఎందుకు నమోదు చేయలేదు? సర్పంచ్‌గా గెలిచిన నాయకులను అభివృద్ధి పనులు చేస్తే దాడులు చేస్తారా? అని ప్రశ్నించారు. హోంమంత్రి సొంత జిల్లాలో ఇలాంటి దాడులు జరగడం సిగ్గుచేటని మండిపడ్డారు. దాడికి పాల్పడిన రాయపాటి శివను వెంటనే అరెస్టు చేయాలని, 24గంటల్లో నిందితులను అరెస్టు చేయకపోతే రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.  


నేరచరిత ఉన్నవారే సీఎం ఇష్టం: వర్ల

ముఖ్యమంత్రి జగన్‌కు నేరచరిత్ర ఉన్నవారి పట్ల మక్కువ ఎక్కువని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ట్విట్టర్‌ వేదికగా విమర్శించారు. రాష్ట్రమంతా ఎరిగిన ఇద్దరు నేరచరితులను ఎమ్మెల్సీలుగా నామినేట్‌ చేసేందుకు సాక్షాత్తూ ముఖ్యమంత్రే సతీసమేతంగా గవర్నర్‌ వద్దకు వెళ్లడం శోచనీయమని పేర్కొన్నారు.


రైతులకు రాయితీపై డీజిల్‌ ఇవ్వాలి: తెలుగు రైతు

పెట్రోల్‌, డీజిల్‌ ధరలతో వ్యవసాయ రంగం కుదేలవుతున్నందున వ్యవసాయ అనుబంధ రంగాలకు 50% రాయితీతో డీజిల్‌ అందించాలని తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి కోరారు. రైతుల పట్ల కపటప్రేమ చూపిస్తున్నాయని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించారు.  


వాహనమిత్రకు కార్పొరేషన్ల నిధులా?:తులసిరెడ్డి

వేంపల్లె, జూన్‌ 15: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వాహనమిత్ర పథకానికి వివిధ కార్పొరేషన్ల నిధులు మళ్లిస్తారా? అని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి నిలదీశారు. ఈ పథకానికి బడ్జెట్‌లో  నిధులు కేటాయించకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు, బ్రాహ్మణ, ఈబీసీ, క్రిస్టియన్‌ మైనారిటీ కార్పొరేషన్‌ నిధులను జీవో 26 ద్వారా మళ్లించడం దారుణమని వ్యాఖ్యానించారు. 

Updated Date - 2021-06-16T08:18:41+05:30 IST