పంట నీటిపాలు

ABN , First Publish Date - 2021-11-21T05:18:26+05:30 IST

అతివృష్ఠి, అనావృష్టి రైతుల జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి.

పంట నీటిపాలు
కర్నూలు యార్డులో కుళ్లిన ఉల్లి

  1. ఎడతెరిపిలేని వర్షాలతో నష్టం
  2. యార్డులో కుళ్లిపోతున్న ఉల్లి నిల్వలు
  3. కంటతడి పెట్టుకుంటున్న రైతులు


కర్నూలు(అగ్రికల్చర్‌), నవంబరు 20: అతివృష్ఠి, అనావృష్టి రైతుల జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. జూలై, ఆగస్టు నెలల్లో వర్షాభావం వల్ల జిల్లా వ్యాప్తంగా వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి. దిగుబడి గణనీయంగా తగ్గిపోయింది. మిగిలిన కాస్తో.. కూస్తో పంట చేతికి అందితే అమ్ముకుందామని అనుకున్నారు. ఇదే సమయంలో ఎడతెరిపి లేని వానలు మొదలయ్యాయి. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో మిగిలిన పంటలు నీటి పాలయ్యాయి. వరిపైరు పూర్తిగా నీటమునిగిపోయింది. పత్తి రైతుల కష్టం నీటిలో కొట్టుకుపోతోంది. పత్తికి మంచి ధర ఉండటంతో సంతోషించిన రైతులకు వాన కన్నీటిని మిగిల్చింది. 


కొనసాగిన వర్షం


జిల్లా వ్యాప్తంగా శనివారం కూడా భారీ వర్షాలు కొనసాగాయి. హొళగుంద మండలంలో 23 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఆస్పరిలో 20.2, ఆదోనిలో 19.8, కౌతాళంలో 18, హాలహర్విలో 17.2, ఆలూరులో 17, గోస్పాడులో 16.6, దేవనకొండలో 14.6, శ్రీశైలంలో 13.8, ప్యాపిలిలో 13.6, డోన్‌లో 13.6, మద్దికెరలో 13.2, పెద్దకడుబూరులో 13.2, తుగ్గలిలో 13, చాగలమర్రిలో 12.4, పగిడ్యాలలో 11.8, కోసిగిలో 11.6, పత్తికొండలో 11.4, కొలిమిగుండ్లలో 11.2, సంజామలలో 10.6, రుద్రవరంలో 10 మి.మీ. వర్షపాతం నమోదైంది. మిగిలిన మండలాల్లో 4 నుంచి 9 మి.మీ. వర్షం కురిసింది. జిల్లా మొత్తం మీద శనివారం 8.8 మి.మీ. సగటు వర్షపాతం నమోదు అయింది. నవంబరులో సాధారణ వర్షపాతం 27.6 మి.మీ. కాగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పటికే 75.7 మి.మీ. వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు.


ఉల్లి దిబ్బపాలు


పొలాల్లో తడిసిపోయి మొలకెత్తుతున్న ఉల్లిని ఏదో ఓ ధరకు అమ్ముకుందామని రైతులు కర్నూలు మార్కెట్‌ యార్డుకు తెచ్చారు. డోన్‌, కోడుమూరు, గోనెగండ్ల, పత్తికొండ, పాణ్యం, ఎమ్మిగనూరు తదితర నియోజకవర్గాల నుంచి రైతులు పెద్ద ఎత్తున ఉల్లిని మార్కెట్‌యార్డుకు విక్రయానికి తెచ్చారు. ప్లాట్‌ఫారాలపై నిల్వ ఉంచారు. వర్షపునీరు ఫ్లాట్‌పారాలపైకి చేరడంతో ఉల్లి నానిపోయి కుళ్లిపోతుంది. రైతుల కష్టం దిబ్బలపాలు అవుతోంది. దీంతో పలువురు రైతులు కంటతడి పెడుతున్నారు.


తుంగభద్ర తీరంలో అప్రమత్తం


  1. డ్యాం నుంచి 40 వేల క్యూసెక్కులు విడుదల
  2. అధికారులతో కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు సమీక్ష


కర్నూలు(కలెక్టరేట్‌), నవంబరు 20: తుంగభద్ర డ్యాం నుంచి దిగువకు నీటిని విడుదల చేసిన నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేయాలని ఆర్‌డీవోలు, తహసీల్దార్లు ఎంపీడీవోలను కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు ఆదేశించారు. తుంగభద్ర డ్యాం నుంచి నీటి విడుదల నేపథ్యంలో అధికారులతో శనివారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. తుంగభద్ర డ్యాం నుంచి 40 వేల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేశారని, లక్ష క్యూసెక్కుల వరకు పెరిగే అవకాశం ఉందని తెలిపారు. తుంగభద్ర నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. వీఆర్వోలతో లోతట్టు ప్రాంతాల్లో దండోరా వేయించాలని సూచించారు. నదిలో ప్రవాహం తగ్గే వరకు సమీప ప్రాంతాల గొర్రెలు, మేకలు కాపరులు, పిల్లలు అటువైపు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. తుంగభద్ర నదిలో ప్రవాహం ఉధృతంగా ఉందని, మాలలు ధరించిన భక్తులు నదీ స్నానానికి వెళ్లవద్దని సూచించారు. తాగునీటి సమస్య రాకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. పంచాయతీ కార్యదర్శులు పారిశుధ్యంపై ప్రత్యేకదృష్టి పెట్టేలా ఎంపీడీవోలు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఈవోపీఆర్‌డీలు, పంచాయతీ కార్యదర్శులు హెడ్‌ క్వార్టర్లలో ఉండాలని ఆదేశించారు. రెవెన్యూ, ట్రాన్స్‌కో, పోలీస్‌, శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కోసిగి, కౌతాళం, పెద్దకడుబూరు, బెళగల్‌, మంత్రాలయం, గూడూరు, కొత్తపల్లె, కర్నూలు అర్బన్‌ ప్రాంతాల తహసీల్దార్లు, ఎంపీడీవోలతో మండలాల వారీగా కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో డీఆర్వో పుల్లయ్య, డీపీవో ప్రభాకర్‌ రావు, విపత్తుల నిర్వహణ డీపీఎం తదితరులు పాల్గొన్నారు. ఆర్డీవో కార్యాలయం నుంచి ఇన్‌చార్జి జేసీ తమీమ్‌ అన్సారీయా, ఆర్డీవో హరిప్రసాద్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-11-21T05:18:26+05:30 IST