పంటనష్ట పరిహాసం

ABN , First Publish Date - 2020-10-29T07:26:27+05:30 IST

అతివృష్టి వచ్చినా.. అనావృష్టి వచ్చినా నష్టపోయేది రైతులే. ప్రభుత్వాలు రైతులకు సంక్షేమపథకాలు, సబ్సిడీ అందజేస్తున్నామని కాగితాలకే పరిమితమవుతున్నాయి.

పంటనష్ట పరిహాసం

పంటల ఇన్సూరెన్స్‌పై రైతులకు అవగాహన కరువు

అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోతున్న అన్నదాతలు

జిల్లాలో 19,313 ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు

ఇన్సూరెన్స్‌ చేయని పరిస్థితి

నష్ట పరిహారం చెల్లించి ఆదుకోవాలంటున్న బాధిత రైతులు

నష్టపోతున్న 19,169 మంది రైతులు


కామారెడ్డి, అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి): అతివృష్టి వచ్చినా.. అనావృష్టి వచ్చినా నష్టపోయేది రైతులే. ప్రభుత్వాలు రైతులకు సంక్షేమపథకాలు, సబ్సిడీ అందజేస్తున్నామని కాగితాలకే పరిమితమవుతున్నాయి. క్షేత్రస్థాయిలో మాత్రం అతివృష్టి, అనావృష్టి వచ్చినా రైతులకు లబ్ధి చేకూరడం లేదు. ప్రధాన కారణం క్షేత్రస్థాయిలో పథకాలు, ఇన్సూరెన్స్‌ లాంటి స్కీమ్‌లపై వ్యవసాయశాఖ అధికారులు, సిబ్బంది రైతులకు అవగాహన కల్పించకపోవడమే ఇందుకు నిదర్శనం. కామారెడ్డి జిల్లాలో అకాల వర్షాలతో 19,313 ఎకరాలలో పంట దెబ్బతినగా 19,169 మంది రైతులు నష్టపోయారు. కానీ ఈ ఏడాది ప్రభుత్వాలు ఇన్సూరెన్స్‌ సౌకర్యాలు కల్పించకపో వడంతో ఈ రైతులంతా నష్టపోవాల్సిందే.


జిల్లాలో 19,313 ఎకరాల్లో పంట నష్టం

జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు 19,313 ఎకరాలలో పంట నష్టం వాటిల్లినట్లు వ్యవసాయశాఖ అధికారులు గుర్తించారు.  సుమారు రూ.7.37 కోట్ల వరకు పంట నష్టం వాటిల్లిందని అధికారులు అంచనా వేశారు. వరి, పత్తి, సోయాబిన్‌, మొక్కజొన్న, కంది పంట లు అధిక మొత్తంలో దెబ్బతిన్నాయి. జిల్లాలో అధికంగా ఈ సంవత్సరం2.10 లక్షల ఎకరాల్లో వరి పంట సాగు కాగా 9,863 ఎకరాలలో వరి పంట దెబ్బతిన్నది. 80,630 ఎకరాలలో సోయాబిన్‌ సాగు కాగా 160 ఎకరాల్లో దెబ్బతిన్నది. 60,180 ఎకరాల్లో పత్తిపంట సాగు కాగా 9,350 ఎకరాలలో పంట దెబ్బతిన్నది. అధికంగా తాడ్వాయి 4,175 ఎకరాలలో, పెద్దకొడపగల్‌ 3,816 ఎకరాలలో, గాంధారి 3,419 ఎకరాలలో, నాగిరెడ్డిపేట 1,535 ఎకరాలలో, బిచ్కుంద 850 ఎకరాలలో, నిజాంసాగర్‌ 410 ఎకరాలలో, పిట్లం 224 ఎకరాలలో, జుక్కల్‌ 600 ఎకరాలలో, బాన్సువాడ 83 ఎకరాలలో, నస్రూల్లాబాద్‌ 611 ఎకరాలలో, బీర్కూరు 86 ఎకరాలు, కామారెడ్డి 141 ఎకరాలలో, మాచారెడ్డి 413 ఎకరాలలో, భిక్కనూరు 388 ఎకరాలలో, రాజంపేట 113 ఎకరాలలో, బీబీపేట 195 ఎకరాలు, దోమకొండ 85 ఎకరాలలో, లింగంపేట 800 ఎకరాలలో, సదాశివనగర్‌ 639 ఎకరాలలో, రామారెడ్డి 325 ఎకరాలలో, ఎల్లారెడ్డి 405 ఎకరాలలో పంట నష్టం జరిగినట్లు అధికారిక లెక్కలు తెలుపుతున్నాయి.


నష్టపరిహారం అందేనా?

జిల్లాలో 80శాతం ప్రజానీకం వ్యవసాయం మీదనే ఆధారపడి జీవనాన్ని కొనసాగిస్తున్నారు. అయితే జిల్లాలో ప్రజలను అతివృష్టి, అనావృష్టి వెంటాడుతూ వస్తోంది. గత 4 సంవత్సరాలుగా ఆశించిన మేర వర్షాలు లేకపోవడంతో వెనుక బడిన ప్రాంతాల్లో రైతులు పంటలు సాగు చేసినా నష్టాలనే చవి చూశారు. అయితే ఈ ఏడాది భారీ వర్షాల కారణంగా ఆయా ప్రాంతాలైన మద్నూర్‌, జుక్కల్‌, పిట్లం, బిచ్కుంద, గాంధారి, నిజాంసాగర్‌, నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డిలో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. జిల్లావ్యాప్తంగా సుమారు 19,313 ఎకరాలలో పంటలు దెబ్బతిన్నాయి. కానీ ఈ ఏడాది నుంచి ప్రభుత్వా లు పంటల కోసం ఇన్సూరెన్స్‌ పథకాలను తొలగించింది. గత ఏడాది ఫసల్‌బీమా పథకం కింద కేంద్ర ప్రభుత్వం నష్టపోయిన పంటలకు ఇన్సూరెన్స్‌ చెల్లిస్తూ వస్తోంది. కానీ ఈ ఏడాది ఆ పథకం కూడా లేకపోవడంతో అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలకు నష్టపరిహా రం వస్తుందా లేదా అనే దానిపై ప్రశ్నార్థకంగా మారింది. కేవలం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రైతు బీమాపైనే ఆధారపడి ఉంది. ఇది కూడా నష్టపోయిన రైతులు ఎవరైనా ప్రమాదవ శాత్తు చనిపోతేనే రైతు బీమా నిధులు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పంట నష్టపరిహారంపై ప్రభుత్వాల నుంచి ఎలాంటి స్పష్టత లేదు.


పరిహారం లేక పంటకు నిప్పంటిస్తున్న రైతులు

రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు రాక అతివృష్టి, అనావృష్టితో పంటలు దెబ్బతినడంతో సాగు చేసినా గిట్టుబాటురాక చివరకు పంటలకు నిప్పుపెట్టుకునే పరిస్థితి ఎదురవు తోంది. రైతుల పంటలకు ఇన్సూరెన్స్‌ కల్పించని పరిస్థితి కలుగుతోంది. కామారెడ్డి జిల్లాలో అధిక వర్షాలకు వేల ఎకరాలలో పంటలు దెబ్బతినగా వేలాది మంది రైతులు నష్టపోయారు. ప్రభుత్వం పంటలకు ఇన్సూరెన్స్‌ ఇవ్వకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు ఉన్న పంటలను కాపాడుకునే ప్రయత్నంలో చీడ, పీడల నుంచి రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం సన్నరకం వరిని సాగు చేయాలనే నిబంధనతో రైతులు పెద్ద మొత్తంలోనే ఆ పంటను సాగు చేశారు. కానీ రైతులకు మాత్రం సన్నరకం పంట సాగులో చీడ, పీడలతో నిరాశే మిగిలింది. దోమపోటు రావడంతో జిల్లాలో పలువురు రైతులు ఎకరాలలోనే పంటలకు నిప్పంటించి దహనం చేసిన ఘటనలు ఉన్నాయి. మొన్న కామారెడ్డి మండలం లింగాపూర్‌, దోమ కొండ, నేడు ఎల్లారెడ్డిలో చీడపీడల బెడదతో దిగుబడి లేక సన్నరకం వరి పంటలకు నిప్పు అంటించి దహనం చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. వరి పంట రైతులే కాకుండా మొక్కజొన్న రైతుల మద్దతు ధరలేక రాష్ట్ర స్థాయిలోనే నిరసనలు తెలిపిన సంఘటనలు జిల్లాలో చోటు చేసుకు న్నాయి. ఇలాంటి సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో కూడా ప్రభు త్వాలు రైతుల పంటలకు బీమా కల్పించకపోవడంపై రైతులు మండిపడుతున్నారు.


దోమపోటుతో పెట్టిన పెట్టుబడి రాక నిప్పుపెట్టాల్సి వచ్చింది..కొమిరెడ్డి నారాయణ, రైతు, లింగాపూర్‌.

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ సన్నరకం వరి ధాన్యాన్ని పండించాలని సూచించడంతో దొడ్డు రకం ధాన్యాన్ని వదిలి సన్నరకం ధాన్యాన్ని పెడితే దోమపోటు వచ్చి పెట్టిన పెట్టుబడి నష్టపోయాం. పెట్టిన పెట్టుబడి రాక పంట కోస్తే మరింత నష్టం వాటిల్లు తుందని పంటకు నిప్పుపెట్టాల్సి వచ్చింది. వేసిన మూడెకరాల పంట దోమపోటు తో పంటంతా నష్టపోయాం దీంతో పంటకు నిప్పు పెట్టాను.

Updated Date - 2020-10-29T07:26:27+05:30 IST