నష్టం.. కష్టం

ABN , First Publish Date - 2020-11-21T06:20:15+05:30 IST

ఖరీఫ్‌ రైతులకు కష్టాలే మిగిలాయి. వరదలు చేతికొచ్చిన పంటను పొట్టనబెట్టుకున్నాయి.

నష్టం.. కష్టం
దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలిస్తున్న ఆర్డీవో ఖాజావలి, రెవెన్యూ, వ్యవసాయశాఖ అధికారులు

పంట నష్టం నమోదులో జాప్యం

నేల వాలిన పైరుపై మళ్లీ వర్షం

వరి కంకులకు మొలక.. రైతుల గగ్గోలు

నేలవాలిన వరి కోతకు ఎకరానికి ఆరు నుంచి ఏడు వేలు

వ్యవసాయశాఖ అధికారుల తాత్సారం


ఖరీఫ్‌ రైతులకు కష్టాలే మిగిలాయి. వరదలు చేతికొచ్చిన పంటను పొట్టనబెట్టుకున్నాయి. దెబ్బతిన్న పంటల నష్టాన్ని నమోదు చేయాల్సిన వ్యవసాయ శాఖ అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఆ వివరాలను గ్రామ సచివాలయాల్లోని వ్యవసాయశాఖ అసిస్టెంట్లు నమోదు చేస్తారంటూ వ్యవసాయశాఖ అధికారులు తప్పించుకుంటుంటే వారేమో 70 శాతం పైబడి వరిపైరు దెబ్బతింటేనే నష్టం నమోదు చేస్తామంటున్నారని రైతులు వాపోతున్నారు.


ఆంధ్రజ్యోతి, మచిలీపట్నం : అక్ట్టోబరులో కురిసిన భారీ వర్షాలకు వరి పొలాలు పూర్తిగా నీట మునిగాయి. పంట పొలాల్లో నిలిచిన నీరు రోజుల తరబడి అలాగే ఉంది. నీరు తగ్గుతున్న సమయంలో కంకులతో బరువుగా ఉన్న వరిపైరు మొదళ్లు బలహీనపడడంతో వరిపైరు నేలవాలింది. నవంబరులో కురిసిన వర్షాలకు నేలవాలిన వరిపై మళ్లీ నీరు చేరింది. వేలాది రూపాయలు ఖర్చు చేసి పండించిన పంట నీటిలో తేలియాడుతోందని, పంట నష్టం వివరాలు నమోదు చేయాలని గ్రామ వ్యవసాయశాఖ అసిస్టెంట్ల వద్దకు వెళితే రేపు మాపు అంటూ తిప్పుకున్నారని, ఇప్పుడేమో 70 శాతం పైబడి వరిపైరు దెబ్బతింటేనే నష్టం నమోదు చేస్తామని చెబుతున్నారని రైతులు వాపోతున్నారు.


33 శాతం నష్టం జరిగితే నమోదు చేయాలి

మచిలీపట్నం మండలం చిన్నాపురం గ్రామానికి చెందిన సుమారు 400 మంది రైతులకు చల్లపల్లి మండలం మాజేరు రెవెన్యూ గ్రామ పరిధిలో రెండు వేల ఎకరాల భూములున్నాయి. ఆ భూముల్లో వరి సాగు చేశారు.  పది రోజుల క్రితం ఈ పొలాల్లోని వరి పైరు వర్షానికి నేలవాలింది. ఆర్డీవో ఖాజావలి,  రెవెన్యూ, వ్యవసాయశాఖ అధికారులతో కలసి ఈ పొలాలను పరిశీలించారు. ఈ పొలాల్లో పంట నష్టం అంచనాలు నమోదు చేయాలని చల్లపల్లి తహసీల్దారుకు, వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. నేలవాలిన పంట 70 శాతం దెబ్బతింటేనే నమోదు చేస్తామని గ్రామ వ్యవసాయ శాఖ అసిస్టెంట్లు చెబుతుండటంతో రైతులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పది రోజులుగా వరిపైరు నీటిలోనే ఉండటంతో కంకులు  మొలకెత్తాయని, శుక్రవారం  వ్యవసాయశాఖ అధికారులు తీరిగ్గా వచ్చి పంట పొలాలను పరిశీలించి వెళ్లారని, ఈ లోగా జరగాల్సిన నష్టం జరిగిపోయిందని రైతులు వాపోతున్నారు. భారీ వర్షాలు, ఇతరత్రా కారణాలతో పంటలకు 33 శాతం నష్టం జరిగితే  పంట నష్టం నమోదు చేయాలని, గతంలో ఈ పరిమితి 50 శాతం వరకు ఉండగా, ఇటీవల ప్రభుత్వం 33 శాతానికి తగ్గించిందని జిల్లా వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. 


ఎకరం వరికోతకు రూ.6 నుంచి 7 వేలు 

ఈ ఏడాది 4.50 లక్షల ఎకరాల్లో సన్న రకాలైన బీపీటీ 5204, స్వర్ణ 1061 వంటి రకాలను సాగు చేశారు. మిగిలిన విస్తీర్ణంలో ముతక రకాలు సాగు చేశారు.  తేలికపాటి వంగడాలు కావడం, వాతావరణ పరిస్థితులు, కంకులు పాలు పోసుకొని ఉండడంతో బరువెక్కి పైరు నేలవాలింది. నేలవాలిన పైరుపై  రోజుల తరబడి నీరు నిల్వ ఉండిపోయింది. నేలవాలిన పైరును నిలబెట్టి జుట్టు కట్టలు కట్టేందుకు రైతులు ఎకరానికి రూ.1500 నుంచి రెండు వేల రూపాయలు ఖర్చు చేశారు.  రెండో పంటగా మినుము విత్తాల్సి ఉండటంతో కూలీలద్వారా  వరి కోయించాల్సి ఉంది. పడిపోయిన వరిని కోసేందుకు ఎకరానికి కోత కూలీగా రూ.6 వేల నుంచి ఏడు వేల వరకు డిమాండ్‌ చేస్తుండటంతో రైతులు ఏంచేయాలో తెలీక  దిక్కులు చూస్తున్నారు.


నవంబరు నెల నష్టం వివరాలు నమోదు చేస్తున్నాం  

నవంబరు నెలలో కురిసిన వర్షాలకు వరి పైరు నేలవాలింది. పంట నష్టం అంచనాలు నమోదు చేసే ప్రక్రియ కొనసాగుతోంది. త్వరితగతిన పంట నష్టం వివరాలు తయారు చేసి, ప్రభుత్వానికి నివేదిస్తాం. అక్టోబరు వరకు జరిగిన నష్టంపై ప్రభుత్వానికి నివేదిక పంపాం. రూ.10.42 కోట్ల పంట నష్ట పరిహారం నిధులు విడుదలయ్యాయి. ఈ నగదు రైతుల ఖాతాల్లో జమచేస్తున్నాం. 

- టి.మోహనరావు, వ్యవసాయశాఖ జేడీ  


Updated Date - 2020-11-21T06:20:15+05:30 IST